
ఈఎస్‌ఐ ఆసుపత్రి వద్ద ఫుట్‌పాత్ గోడపై అద్దం అమర్చిన దృశ్యం
నగరంలో బహిరంగ మూత్రవిసర్జన అడ్డుకోవడానికి బీబీఎంపీ వినూత్న పథకం
బెంగళూరు, (కర్ణాటక): ఉద్యాన నగరిని స్వచ్ఛ నగరిగా మార్చేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. నగర వాసులు ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుండటంతో వాటిని అడ్డుకోవడానికి పాలికె వినూత్న ఆలోచన చేపట్టింది. బెంగళూరు నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్లపై నగర వాసులు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుండటంతో స్వచ్ఛతను కాపాడటానికి పాలికె ఫుట్‌పాత్ ప్రాంతాల్లో భారీ అద్దాలను (మిర్రర్) అమర్చింది. మూత్ర విసర్జన సమయంలో అద్దంలో కనబడుతుంటే సిగ్గుతోనైనా బహిరంగ మూత్ర విసర్జన మానుకుంటారని ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది.
దీంతో నగరంలో బీబీఎంపీ పలు చోట్ల భారీ సైజులో ఉన్న అద్దాలను అమర్చడానికి యత్నిస్తోంది. తాజాగా చర్చ్‌స్ట్రీట్, ఈఎస్‌ఐ ఆస్పత్రి వద్ద భారీ అద్దాలను అమర్చింది. నగరంలో పలు చోట్ల మరుగుదొడ్లు అమర్చినప్పటికి బహిరంగ మూత్ర విసర్జన అడ్డుకోవడం సాధ్యం కాలేదు. దీంతో బీబీఎంపీ గోడలకు భారీ అద్దాలను అమర్చి బహిరంగ మూత్ర విసర్జన అడ్డుకోవడానికి వినూత్న పథకంతో ప్రజల్లో మార్పు వస్తుందేమో వేచి చూడాలి.