ప్రధాని మోదీ ప్రసంగాన్ని వీక్షిస్తున్న ఓడీఎఫ్ అధికారులు
కంది(సంగారెడ్డి): రక్షణరంగ ఉత్పత్తులకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు కార్పొరేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణరంగ ప్రముఖుల సమక్షంలో వీటిని జాతికి అంకితం చేశారు. ఢిల్లీలోని డీఆర్డీఓ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారంలో జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్ ఇతర అధికారులు లైవ్ ద్వారా వీక్షించారు.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, డిఫెన్స్ ప్రొడక్షన్, డిఫెన్స్ మినిస్ట్రీ కింద దేశ వ్యాప్తంగా ఉన్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో ఈ కొత్త సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలు సాయుధ దళాలకు సంబంధించి వివిధ రకాల ఉత్పత్తులను సరఫరా చేయనున్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఎద్దు మైలారం)గ్రోత్ అండ్ గ్లోరీ అనే అశంపై వీడియోను ప్రదర్శించారు. అనంతరం ఎద్దుమైలారం యూనిట్ జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్, ఏజీఎం శివకుమార్ మాట్లాడుతూ రక్షణ రంగంలో ఏడు కొత్త సంస్థలు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటుతో కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. మరింత పట్టుదలతో పనిచేసి కొత్తరకం ఉత్పత్తులను తయారు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment