ఓడీఎఫ్ నియోజకవర్గంగా నందికొట్కూరు
– అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే ఐజయ్య
కర్నూలు(అగ్రికల్చర్): బహిరంగ మల విసర్జనలేని( ఓడీఎఫ్) నియోజకవర్గంగా నందికొట్కూరును అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఐజయ్య ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను కలిసి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించారు. దత్తత తీసుకొని ఓడీఎఫ్ నియోజకవర్గంగా నందికొట్కూరును మార్చవచ్చుకదా అని కలెక్టర్ అనడంతో ఎమ్మెల్యే అందుకు అంగీకరించారు. రానున్న ఏడాదిలోపు నియోజకవర్గాన్ని ఆ మేరకు తీర్చిదిద్దుతానని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ... నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లోని ఎస్సీ కాలనీలు దయనీయంగా ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నా పట్టించుకోవడంలేదని తెలిపారు. అన్ని ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, కాల్వలు తక్షణం నిర్మించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. అధికారులు తమకు కమీషన్‌లు వచ్చే పనులు మాత్రమే చేస్తున్నారని, మిగిలిన పనులను పట్టించుకోవడం లేదని వివరించారు. పంచాయతీ రాజ్ అధికారులు, ఎన్‌ఆర్‌ఇజీఓస్ అధికారులు బీసీ కాలనీల్లో అభివద్ధి పనుల నిర్వహణపై ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారని తెలిపారు. దామగట్లతో పాటు వివిధ చెరువులను హంద్రీనీవా నీటితో నింపాలని కోరారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రవాసాంధ్రులతో వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన చర్చాగోష్టి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని అకట్టుకుందని తెలిపారు.