ఓడీఎఫ్‌గా జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యం
ఓడీఎఫ్‌గా జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యం
Published Thu, Nov 10 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
గాదెలదిన్నె (విడవలూరు): జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చేందుకు ప్రజల సహకారం అవసరమని డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి పేర్కొన్నారు. మండలంలోని గాదెలదిన్నెలో బుధవారం ఆత్మగౌరవ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న గాదెలదిన్నెలో రెండో విడతలతో కేవలం నెల రోజుల వ్యవధిలో 102 మరుగుదొడ్లను నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన సర్పంచ్ శేషయ్యను అభినందించారు. గాదెలదిన్నెలో నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. బహిరంగా మల విసర్జన రహిత గ్రామంగా ఆమోదించడం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని గ్రామాలు గాదెలదిన్నెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామంలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ఏపీఎం అమరావతి, ఎంపీటీసీ సభ్యులు శారద, తదితరులు పాల్గొన్నారు.
Advertisement