ఓడీఎఫ్‌ కార్పొరేటీకరణను అడ్డుకుంటాం | Kotha Prabhakar Reddy Said Prohibit Of ODF Corporatization | Sakshi
Sakshi News home page

ఓడీఎఫ్‌ కార్పొరేటీకరణను అడ్డుకుంటాం

Published Tue, Aug 20 2019 10:00 AM | Last Updated on Tue, Aug 20 2019 10:01 AM

Kotha Prabhakar Reddy Said Prohibit Of ODF Corporatization - Sakshi

ఓడీఎఫ్‌ వద్ద ధర్నాలో మాట్లాడుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి  

సాక్షి, సంగారెడ్డి : దేశ రక్షణ రంగంలో ఎంతో కీలకమైన ఆయుధ కర్మాగారాల (ఓడీఎఫ్‌)లను  కార్పొరేటీకరించడాన్ని అడ్డుకుని ఉద్యోగులకు అండగా నిలుస్తామని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఓడీఎఫ్‌లను కార్పొరేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి రూరల్‌ మండల పరిధిలోని ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారం(ఓడీఎఫ్‌) వద్ద ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకొని తప్పుడు నిర్ణయాలను కేంద్రం తీసుకొని ఓడీఎఫ్‌ను ప్రైవేటీకరించేందుకు పూనుకోవడం దారుణమన్నారు.

1984లో మెదక్‌ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పన కోసం దివంగత ప్రధాని ఇందిరాగాంధీ  ఓడీఎఫ్‌ను స్థాపించారన్నారు.  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్‌లను  కార్పొరేటీకరించేందుకు ప్రయత్నించడాన్ని చూసి ఇందిరాగాంధీ ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. దేశ రక్షణలో కీలకంగా ఉంటూ సైనికులకు అవసరమైన ఆయుధాలను తయారు చేసే ఓడీఎఫ్‌లను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడం మంచిది కాదన్నారు. ప్రభుత్వపరంగా ఉన్న సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సలహాలు, సూచనలతో పార్లమెంట్‌లో ఓడీఎఫ్‌ల కార్పొరేటీరణను అడ్డుకుంటామని తెలిపారు.

ఓడీఎఫ్‌లను రక్షించుకుందాం: ఉద్యోగుల జేఏసీ 
రాత్రింబవళ్లు కష్టపడి సైన్యానికి అవసరమైన పరికరాలను అందించిన ఆయుధ కర్మాగారాలను కార్పొరేటీకరించేందుకు  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని ఓడీఎఫ్‌లను రక్షించుకుందామని ఓడీఎఫ్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు  తెలిపారు. ధర్నాలో జేఏసీ నాయకులు ఈశ్వర్‌ ప్రసాద్, జనార్దన్‌రెడ్డి, సుదర్శన్, నరేందర్‌ కుమార్‌లు మాట్లాడుతూ గతంలో రూ. 45 వేల కోట్ల లాభంతో ఉన్న ఓడీఎఫ్‌లు ప్రస్తుతం రూ.5 వేల కోట్లకు పడిపోయాయన్నారు. ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు.  దేశ మొత్తంలో  ఉన్న 41 ఓడీఎఫ్‌లను రక్షించుకునేందుకు «ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు.  రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కీలకంగా ఉన్న ఓడీఎఫ్‌లను కార్పొరేట్‌ సంస్థలైన అంబానీ, అదాని, టాటా, బిర్లాలకు అప్పజెప్పేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

ఈ ఓడీఎఫ్‌ల పరిధిలో  60 వేల ఎకరాలు ఉన్న భూమిని  ప్రైవేట్‌ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఉన్న అప్పటి రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఓడీఎఫ్‌లను ప్రైవేటీకరించబోమని రాత పూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆర్డినెస్‌ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించి ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే కార్యక్రమానికి పూనుకుందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయాలను అడ్డుకునేందుకు ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎంపీపీ అధ్యక్షురాలు సరళ పుల్లారెడ్డితో పాటు సీఐటీయూ జిల్లా నాయకులు సాయిలు, రాజయ్య, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement