జేసీ బదిలీకి రంగం సిద్ధం
Published Fri, Jul 29 2016 1:10 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:
జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ బదిలీకి రంగం సిద్ధమైంది. జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న ఒక నాయకుడు చెప్పిన పని చేయలేదనే ఆగ్రహంతో ఆయన్ను సాగనంపడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. త్వరలోనే ఆయన మీద బదిలీ వేటు పడొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఇంతియాజ్ నెల్లూరులో వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో 2014లో ఐఏఎస్ హోదా లభించింది. ఇక్కడే క్షేత్ర స్థాయి శిక్షణ పొందిన ఆయన గత ఏడాది జనవరి 15వ తేదీ జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఏడాదిన్నరగా వివాదాలకు దూరంగా పని చేస్తున్న ఆయన మీద తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడొకరు నెల్లూరులో విలువైన భూముల వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా తాను చెప్పినట్లు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. తాను చెబుతున్న పని చేయకపోవడంతో ఆ నాయకుడు జేసీ మీద అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన్ను జిల్లా నుంచి సాగనంపి తమకు అనుకూలమైన వారిని నియమించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయనీ త్వరలోనే జేసీ బదిలీ ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
Advertisement
Advertisement