నేమకల్లు..గుండె ఝల్లు | nemakallu ground report | Sakshi
Sakshi News home page

నేమకల్లు..గుండె ఝల్లు

Published Fri, Jul 28 2017 9:48 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

నేమకల్లు..గుండె ఝల్లు - Sakshi

నేమకల్లు..గుండె ఝల్లు

గుండెల్లో గునపం!

మృత్యు ఘోష
2000 : కుటుంబాలు
26 - కంకర యంత్రాలు
23 - పని చేస్తున్నవి
19 - అనుమతి ఉన్నవి
100 - బ్లాస్టింగ్‌ కారణంగా పూడిపోయిన బోర్లు
50 - సిలికోసిస్‌ వ్యాధి మృతులు(ఏడాదిలో)
1000 - మృత్యువాత పడిన జీవాలు(ఏడాదిలో)
రూ.6లక్షలు - గొర్రెల మృతితో ఏటా వస్తున్న నష్టం
రూ.50లక్షలు - ఏటా పంట నష్టం


ఊరు వల్లకాడుగా మారుతోంది. బంగారు భవిష్యత్తు దుమ్ము కొట్టుకుపోతోంది. ఇళ్లు బీటలు వారుతుంటే.. పొలాలు నాశనమవుతుంటే.. జీవాలు మృత్యువాత పడుతుంటే.. వ్యవసాయ బోర్లు ఎండిపోతుంటే.. నేమకల్లు కన్నీరు పెడుతోంది. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన గ్రామం కాస్తా.. అదే చరిత్రలో కలిసిపోతోంది. ఒక్కడ ఒకప్పుడు గ్రామం ఉండేదని చెప్పుకునే రోజులు ఎంతో దూరంలో లేవనే విషయం తాజా పరిస్థితిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అనుమతిలేని కంకర యంత్రాలు మరణ శాసనం రాస్తుంటే.. అనుమతి ఉన్నా నిబంధనలు కాలరాస్తున్న తీరు గుండెల్లో గుణపం దించుతోంది. నాయకులు ఏమి చేస్తున్నట్లు? అధికారులు ఏమైనట్లు? ఓ గ్రామం కళ్లెదుటే శ్మశానంగా మారుతున్నా కళ్లు తెరవరేం?

నేమకల్లు ‘దుమ్ము’కొట్టుకుపోతోంది!
- అనుమతిలేని కంకర మిషన్లతో అనర్థం
- యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
- చిదిమేస్తున్న సిలికోసిస్‌ వ్యాధు
- చిన్నా పెద్ద తేడా లేకుండా మరణాలు
- మృత్యువాత పడుతున్న జీవాలు

 

- కంకర యంత్రాలతో వెలువడుతున్న దుమ్ము, ధూళి
- కాలుష్యం కోరల్లో నేమకల్లు జనం
- ఊపిరితిత్తుల వ్యాధితో అనంతలోకాలకు..
- ఏటా 50కి పైగానే మృతులు
- పనికిరాకుండా పోతున్న పంటపొలాలు
- బ్లాస్టింగ్‌ దెబ్బతో ఇళ్లకు బీటలు
- ఊళ్లో ఉండలేమంటున్న ప్రజలు
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు


అది ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం... జిల్లా నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అభయమిచ్చే ఆ దేవుడి సాక్షిగా ఆ ఊరు వళ్లకాడు అవుతోంది. కారణం కాలుష్యమే. దుమ్ము, ధూళితో నిత్యం ఆ గ్రామ ప్రజలు రోగాలతో సావాసం చేస్తుంటారు. యేటా 50 మందికి పైగానే చనిపోతున్నా మన పాలకులకు, అధికారులకు మాత్రం పట్టడం లేదు.

అనంతపురం అర్బన్‌/బొమ్మనహాల్‌ : రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి దేవాలయానికి ఎంతో పేరుంది. ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుంటోంది. స్వామి వారి సన్నిధిలో ప్రశాంతంగా ఉండాల్సిన నేమకల్‌ ప్రజలు దుర్భర జీవితాలను గడుతున్నారు. కారణం గ్రామానికి అర్ధ కిలోమీటరు దూరంలో నెలకొల్పిన కంకర యంత్రాలు. వీటి నుంచి వెలువడుతున్న ధూళి (డస్ట్‌) వీరి బతుకులను చిద్రం చేస్తున్నాయి. ఇక్కడ అకాల మరణాలు నిత్యకృత్యం అయిపోయారు. ఎక్కువ మంది ఊపిరితిత్తుల వ్యాధి (సిలికోసిస్‌) బారిన పడి అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ధూళి పడిన నీటిని తాగిన మూగ జీవాలు చనిపోవడం సర్వసాధరణంగా మారింది. పొలాలపై దుమ్ము కప్పెస్తుండటంతో  రైతులు పంటలను కూడా నష్టపోతున్నారు. కంకర కోసం కొండల్లో నిర్వహిస్తున్న పేలుళ్ల దాటికి ఇళ్లు బీటలు వారుతున్నాయి. పాత మిద్దెలు కూలిపోతున్నాయి. కంకర ఫ్యాక్టరీల పరిసరాల్లోని పొలాల్లో బోర్లు మూసుకుపోతున్నాయి.  గ్రామస్తులు  తమ సమస్యను అధికారులకు చేసుకుంటున్న వినపాలు, చేపడుతున్న ఆందోళనలు వృథా అవుతున్నాయి. ఓరకంగా వారి గోడు ‘‘అరణ్య రోదన’’ గా మారింది.

ఎప్పుడు చస్తామో – గోవిందప్ప, సిలికోసిస్‌ వ్యాధిగ్రస్తుడు
నా పేరు గోవిందప్ప. వయస్సు 60 లోపే ఉంది. గ్రామంలో ఎవరు ఎప్పుడు చస్తామో మాకే తెలియదు. కంకర యంత్రాల నుంచి వచ్చే దూళిని పీల్చడంతో అదేదో మాయ రోగం ‘‘సిలికోసిస్‌’’ అంట.  మమ్మల్ని బలితీసుకుంటోంది. నేను కూడా అదే రోగంతో బాధపడుతున్నాను. నాలుగు ఆపరేషన్లు చేయించుకున్నాను. పది అడుగులు నడిస్తే దగ్గు, ఆయసం వస్తుంది. ఏ పనిచేయలేకపోతున్నా. గ్రామంలో దాదాపు 100 మంది ఇదే వ్యాధితో బాధపడుతున్నారు. పది రోజుల క్రితం వీరేశ్‌ అనే 36 ఏళ్ల యువకుడు చనిపోయాడు. రెండు రోజుల క్రితం 65 ఏళ్ల వయస్సుండే తాయన్న చనిపోయాడు. ఇలా నెలలో నలుగురైదుగురు చనిపోతుంటారు. ఏటా 50 మందికి పైగానే చనిపోతున్నారు. నేను కూడా ఎక్కువ రోజులు బతుకుతాననే నమ్మకం లేదు. ఎప్పుడైనా చనిపోవచ్చు.

ఏటా రూ.లక్షల్లో పంట నష్టపోతున్నా – హీరోజీరావ్, రైతు
నాకు మూడు ఎకరాలు పొలం ఉంది. టమాట, మిర్చి, ఆనప, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు పండిస్తాను. పంట పూతకొచ్చే సమయంలో కంకర మిషన్‌ల నుంచి దుమ్మువచ్చి చేరుతోంది. దీంతో పంట పండటం లేదు. ప్రస్తుతం టమాట వేశాను. ప్రస్తుతం ధర బాగుంది. కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుంది. కంకర దుమ్ము పంటపై చేరుతోంది. దీంతో పంట నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి. ఏటా లక్షల రూపాయల్లో పంట నష్టపోతున్నాను. నేనే కాదు నాలాంటి రైతులు గ్రామంలో చాలా మంది ఉన్నారు. కంకర యంత్రాలను బంద్‌ చేయాలంటూ మేము చేస్తున్న పోరాటం ఎవరికీ పట్టడం లేదు.
 
మూగజీవాలు చచ్చిపోతున్నాయి – గోనేహల్‌ బసవ
గ్రామంలో పంటలు దెబ్బతింటుండటంతో ప్రత్యామ్నయంగా గొర్రెలను పెంచుతున్నాము. మేపు కోసం కొండల్లోకి తీసుకెళ్తాం. అక్కడ నీళ్లలో కంకర ధూళి కలుస్తోంది. వాటిని తాగిన గొర్రెలు కడుపుబ్బరంతో చనిపోతున్నాయి. ఈ ఏడాదిలో నావి 40 పెద్ద గొర్రెలు చనిపోయాయి. ఐదేళ్లలో దాదాపు 150 గొర్రెలు చనిపోయి ఉంటాయి. గ్రామంలో ఏటా 1000 గొర్రెలకు పైగానే వరకు చనిపోతుంటాయి.

పేలుళ్లకు బోర్లు మూసుకుపోతున్నాయి – రమేశ్,రైతు
నాలుగున్నర ఎకరాల్లో ఆనప పంట పెట్టాను. కంకర యంత్రాల వారు కొండల్లో నిర్వహిస్తున్న పేలుళ్ల కారణంగా వచ్చే అదుర్లకు బోర్లు పూడిపోతున్నాయి. దాదాపు 100కు పైగా బోర్లు మూసుకుపోయాయి. నా పొలంలో  రెండు బోర్లు వేయించా. అవి పూడిపోయాయి. కొత్తగా మరో బోరు వేయించాను. ఇప్పుడు అదీ పూడిపోయింది. పంట పూత దశలో ఉంది. నీరు లేదు. రెండు ఎకరాల్లో పంట పోయింది. బసవప్ప అనే రైతు రూ.4 లక్షలు ఖర్చుచేసి 12 బోర్లు వేయించాడు. మాలాంటి రైతులు గ్రామంలో వందల్లో ఉన్నారు.

బ్లాస్టింగ్‌తో ఇల్లు కూలిపోయింది – అంజనమ్మ, ఎస్సీ కాలనీ వృద్ధురాలు
నా కొడుకు వీరరాజు కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.  కొండల్లో జరుపుతున్న పేలుళ్లకు రెండు గదుల ఇంటిలో వెనుకగది కూలింది. దీంతో ముందుపక్క ఉన్న రేకుషెడ్డులోనే భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. కూలీ చేసుకుని బతికే మా వాడికి  ఇల్లు కట్టుకునే స్థోమతలేదు. కాలనీలో మా లాంటివారి పాత మిద్దెలు చాలానే కూలిపోయాయి. భయం భయంగా బతకాల్సి వస్తోంది.

ఇళ్లు కూలిపోతే రేకులు షెడ్డు వేసుకున్నా – కల్లమ్మ, ఎస్సీ కాలనీ
కాలనీకి దగ్గరలోని కొండల్లో పెట్టిన పేలుళ్లకు మా ఇళ్లు కూలిపోయింది. దీంతో రేకులు షెడ్డు వేసుకుని గడుపుతున్నాము. మాలాంటి పేదోళ్లకు ప్రభుత్వం ఇల్లు ఇవ్వడం లేదు. ఇళ్లు ఉన్నవారికే ఇస్తున్నారు. కొందరు రెండు ఇళ్లు కూడా తీసుకున్నారు. మాలాంటి వారికి ఇల్లు మంజూరు చేయడం లేదు.  ఈ ఊరిలో నరకం అనుభవిస్తున్నాము.

ఈ ఊళ్లో ఉండలేం – ఎస్సీ కాలనీ మహిళలు
ఈ ఊరిలో ఉంటూ బతకలేము. మాకు ఈ ఊరే వద్దు... దూరంగా అడవిలో ఇళ్లు కట్టించి ఇచ్చినా వెళతామని లక్ష్మి, పెద్దగంగమ్మ, చిన్నగంగమ్మ, నీలమ్మ, హనుమక్క, ఇతర మహిళలు వాపోయారు. కంకర దుమ్ముతో రోగాలు వస్తున్నాయి. ఇళ్లు బీటలు వారుతున్నాయి. పాత మిద్దెలు కూలిపోతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయంతో బతుకుతున్నాము. ఏ అధికారి మమ్మల్ని కానీ, మా సమస్యలను కానీ పట్టించుకోవడం లేదు.

మా గోడు అరణ్య రోదనే – కె.పరమేశ్, మాజీ ఎంపీటీసీ
గ్రామంలో దుర్భర జీవితాలను గడుపుతున్నాము. కంకర ఫ్యాక్టరీల నుంచి వస్తున్న ధూళితో ప్రాణహాని ఉందంటూ అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నా ఎవరికీ పట్టడం లేదు. ఇక్కడి పరిస్థితిని కలెక్టరేట్‌లోని మీ కోసంలో అధికారులకు వివరించాం. ఈ ఏడాది ఫిబ్రవరి 20న తహశీల్దారు కార్యాలయాన్ని దిగ్భందించాము. మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆర్‌డీఓ, డీఎస్‌పీ హామీ ఇచ్చారు. అప్పట్లో 20 రోజుల పాటు కంకర యంత్రాలను నిలిపివేశాము. మళ్లీ మామూలుగానే పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 23 కంకర యంత్రాలు ఉన్నాయి. వాస్తవంగా వీటిలో 19 వాటికి అనుమతి ఉన్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఊరికి రెండు కిలోమీటర్ల దూరం వరకు కంకర యంత్రాలు ఉండకూడదు. అయితే మా గ్రామానికి అర్ధ కిలోమీటరు దూరంలోనే కంకర మిషన్లు ఉన్నాయి. డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో ఐదు బృందం పర్యటించి పరీక్షలు చేసి గ్రామంలో చాలా మందికి సిలికోసిస్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. అటు తరువాత వారు వచ్చింది లేదు. రోగాలకు మందులిచ్చింది లేదు.  కంకర మిషన్లు తొలగిస్తేనే మా ఊరు, ఇక్కడి ప్రజలు బతుకుతారు.

పంటలకు అపార నష్టం
పంటల పొలాలపై దుమ్మూ ధూళి పడి పంట పొలాలు సర్వనాశనం అయిపోతున్నాయని నేమకల్లు రైతులు వాపోతున్నారు.  దీంతో లక్షల్లో నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది దానప్ప అనే రైతు 5  , శంకరప్ప మూడు ఎకరాల్లో వేరుశనగ, కురబ నాగేంద్ర మూడు ఎకరాల్లో మిరప, మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. అలాగే గోనాల సిద్ధప్ప నాలుగు ఎకరాల్లో, అంజన్‌ మూడు ఎకరాల్లో, ముక్కన్న ఐదు ఎకరాల్లో, లక్ష్మమ్మ 3 ఎకరాల్లో, గౌరమ్మ ఐదు ఎకరాల్లో వేరుశనగ పంట వేశారు. దేవునూరి పరమేశ్‌ ఐదు ఎకరాల్లో , కాశీం వలి మూడు ఎకరాల్లో ఆనప వేశారు. కాలుష్యం వల్ల ఈ పంటలన్నింటినీ కోల్పోయామని వారు కన్నీరు మున్నీరయ్యారు. వీరు మాత్రమే కాదు వందలాది మంది రైతులది ఇదే పరిస్థితి.

రెండు కంకర మిషన్ల అనుమతి రద్దు చేశాం – రాజేంద్రరెడ్డి, జోనల్‌ అధికారి, కాలుష్య నియంత్రణ బోర్డు, కర్నూలు
బొమ్మనహల్‌ మండలం నేమకల్‌ గ్రామంలో కాలుష్య పరీక్షలు నిర్వహించాం. ఊరికి  సమీపంలోని కంకర మిషన్లలో రెండింటికి అనుమతులు రద్దు చేశాము.

సిలికోసిస్‌ ముదిరితే ప్రాణాంతకమే – డాక్టర్‌ వెంకటేశ్వరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌
సిలికోసిస్‌ అనే వ్యాధి ధూళి పీల్చడం ద్వారా వస్తుంది. ఇది ఎక్కువగా ధూళి ఉండే ప్రాంతంలో పనిచేసేవారికి, ఆ ప్రదేశాల్లో నివాసముండేవారికి, తిరిగే వారికి వస్తుంది.  దగ్గు, ఆయసంతో ఇబ్బంది పడారు. చిన్న పనిచేసినా, కొద్ది దూరం నడిచినా ఆయాసం,  దగ్గు విపరీతంగా వస్తుంది. జబ్బుని తొలి దశలో గుర్తిస్తే మందుల ద్వారా నయం చేయవచ్చు. వ్యాధి ముదిరితే ప్రాణాంతకమే . ఈ వ్యాధితో బాధపడే వారు దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాల్లో ఉండకూడదు, అలాంటి ప్రాంతాల్లో పనిచేయకూడదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement