నేస్తమా ఇద్దరి లోకం ఒక‌టేలేవమ్మా..! | nestama iddari lokam okatelevamma | Sakshi
Sakshi News home page

నేస్తమా ఇద్దరి లోకం ఒక‌టేలేవమ్మా..!

Published Thu, Sep 1 2016 11:42 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

నేస్తమా ఇద్దరి లోకం ఒక‌టేలేవమ్మా..! - Sakshi

నేస్తమా ఇద్దరి లోకం ఒక‌టేలేవమ్మా..!

అంధ యువకుడ్ని పెళ్లాడిన ఆదర్శవనిత
కంటికి రెప్పనై జీవితాంతం తోడుగా ఉంటా
అతని అమాయకత్వం నచ్చింది..  శ్యామల
ఆమెను మనసుతో చూశా...  కళ్లల్లో పెట్టి చూసుకుంటా  కొండబాబు


‘నేస్తమా ఇద్దరి లోకం ఒక‌టేలేవమ్మా..!
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా
ఈ గుండెలోన నీ ఊపిరి ఉంటే
ఈ కళ్లల్లోన  నీ కలలుంటే
ఊహలరెక్కలపైన ఊరేగే దారులు ఒక్కటే
చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే...’
అంటూ ‘అంధ’మైన ఈ లోకాన్ని చూపించేందుకు ఓ యువతి ముందుకొచ్చింది. ఏడడుగులు నడిచింది. అంధుడైన భర్తను తన కళ్లతో లోకాన్ని చూపిస్తానంటోంది. తన హృదయంలో ఆమెకు ఆలయం కడతానని అతనంటున్నాడు. ఆ.. ఆమె...ఆ.. అతడు కథే ఇది...!
–కె.టి. రామునాయుడు, సాక్షి,మధురవాడ(విశాఖపట్నం)

 పెళ్లంటే నూరేళ్ల పంట. దాని గురించి తలంపు రాగానే∙ప్రతి యువతి తన ఊహల రాకుమారుడి గురించి  ఎన్నో కలలుకంటుంది. తన నూరేళ్ల అందమైన జీవితానికి ఎన్నో బాటలు వేసుకుని దానిని సాకారానికి ఎలా ప్రయత్నించాలో ఆలోచించుకుంటుంది. కానీ విశాఖ జిల్లా పరదేశిపాలెంకు చెందిన సత్యాల శ్యామల ఆదర్శభావాలతో విభిన్నంగా ఆలోచించింది. దానికి అనుగుణంగానే  తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన వడ్డి కొండబాబు అనే అంధుడ్ని గత నెల 19న రాజమండ్రిలో వివాహమాడింది. తన కళ్లతో లోకాన్ని చూపిస్తానని శ్యామల చెబుతుంటే...నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటానని కొండబాబు చెబుతున్నాడు.

శ్యామల నేపథ్యమిది...
సత్యాల శ్యామల..పేద కుటుంబంలో వికసించిన పుష్పం. జీవీఎంసీ పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న అప్పారావు, పద్మల ప్రథమ కుమార్తె. పాఠశాల చదువంతా పరదేశిపాలెం, బోయిపాలెంలో సాగింది. విశాఖ కృష్ణా కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం వరకూ చదివింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పింది. చిన్నతనం నుంచి శ్యామలకు సేవా గుణం ఎక్కువ. వికలాంగులను సేవ చేయడంలో ముందుండేది. వికలాంగులు, అంధుల కోసం చందాలు వసూలు చేసి ఇచ్చేది. అంగవైకల్యం ఉన్న వారినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకునేది.

అతని మంచి తనం నాకు బాగా నచ్చింది
వికలాంగులు, ఆపదలో ఉన్నరిని చూస్తే ఎందుకో కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. మనుషులందర్నీ దేవుడే సృష్టించాడు..మరి అటువంటప్పుడు ఈ వ్యత్యాసాలు ఎందుకో.. అందుకే వారంటే నాకు ఎక్కడ లేని ప్రేమ,అభిమానం. ఈ క్రమంలోనే మా బంధువుల ద్వారా కొండబాబు సంబంధం వచ్చింది. ఆయనతో మాట్లాడిన తరువాత అతని అమాయకత్వం, మంచి తనం..బాగా నచ్చింది. ఆయనకు కళ్లు లేవు. అంతకు మించి మంచి మనసుంది. పెళ్లిలో చేయి పట్టుకుని నడిచా..జీవితాంతం ఆయనను నా చేతితో నడిపిస్తాను. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జియోన్‌ అంధుల పాఠశాల్లో పనిచేస్తున్నారు. అవసరమైతే ఇద్దరం పనిచేస్తాం. ఆయనకు కష్టంగా ఉంటే నేను ఉద్యోగం చేసైనా సరే పోషించుకుంటాను. ఆయనకు జీవితాంతం తోడు, నీడగ ఉంటాను.
–సత్యాల. శ్యామల, యువతి

ఆమెను మనస్సుతో చూశాను
నాది తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు. నాన్న కష్ణ. నాకు మూడేళ్ల వయస్సులో చికెన్‌ ఫాక్స్‌ కారణంగా ఓ కన్నుపోయింది. దాని ఇన్ఫక్షన్‌ వలన రెండో కన్ను కూడా పోయింది. దాంతో జియోన్‌ అంధుల పాఠశాలలో చదివాను. మా మేడమ్‌ గారు ఎస్తేరు రాణి ఇంటర్‌ తర్వాత ఇక్కడే ఉద్యోగం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఇక్కడ చదివిన ఓ పూర్వ విద్యార్థి ద్వారా సంబంధం కూడా ఎస్తేరు రాణి చూశారు. దగ్గరుండి పెళ్లి జరిపించారు.  పెళ్లికి ఆమెతో పాటు తుమ్మిడి బ్రదర్స్‌ , వ్యాపార వేత్త ఆనంద్‌ జయంత్‌ గారు ఇలా చాలా మంది మంది అండగా నిలిచారు. ఎంతో ఆదర్శ భావంతో నన్ను పెళ్లాడిన శ్యామలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను.  నా భార్య కళ్లల్లో పెట్టి చూసుకుంటాను.
–వడ్డి కొండబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement