ప్రాక్టీస్ చేస్తున్న మహబూబ్‌నగర్ క్రీడాకారులు
-
నేటినుంచి నెట్‌బాల్ టోర్నీ
-
హాజరుకానున్న పది జిల్లాల క్రీడాకారులు
-
జెడ్పీ మైదానంలో ఏర్పాట్లు పూర్తి
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో శుక్రవారం నుంచి ఈనెల 11 వరకు జరిగే అండర్–14 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాల, బాలికల నెట్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. కొన్నేళ్ల తర్వాత జిల్లా కేంద్రంలో నెట్‌బాల్ టోర్నీ నిర్వహిస్తుండడంతో విజయవంతం చేయడానికి ఎస్‌జీఎఫ్ ప్రతినిధులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. టోర్నీని స్థానిక జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహిస్తున్నారు. వారం రోజుల నుంచి మైదానంలో కోర్టులతో పాటు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. టోర్నీకి మహబూబ్‌నగర్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి 130మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ్ రెయిన్‌బో, లిటిల్ స్కాలర్స్, చైతన్య, బ్రిలియంట్ పాఠశాలల్లో వసతి, బాలభవన్‌లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. టోర్నీలో 30మంది అఫీషియల్స్‌గా తమ విధులు నిర్వర్తించనున్నారు. టోర్నీని లీగ్‌కమ్ నాకౌట్ పద్ధతిలో నెట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం 4గంటలకు టోర్నీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, డీఈఓ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్ హాజరుకానున్నారు. గురువారం జిల్లా పరిషత్ మైదానంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్ పనులను పరిశీలించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్లను ఎంపిక చేసి నాలుగు రోజుల నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
బాలుర జట్టు: రవి, జైరాం, సచిన్, విష్ణు, బాలకృష్ణ, నవీన్ చౌహాన్, విశాల్, ఇస్మాయిల్, షోయబ్, అమీర్, సురేశ్(మహబూబ్‌నగర్), అజహర్ (కోడ్గల్).
బాలికల జట్టు: గంగోత్రి, శిరీష, గీత, శివగంగ, సోని (గార్లపహాడ్), స్వప్న (ఇప్పటూర్), రోహిణి, స్రవంతి, మౌనిక, అమ్ములు, అంజలి, భవాని (మహబూబ్‌నగర్).