sgf
-
విజేత హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) అంతర్ జిల్లా అండర్–14 హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. బోయిన్‌పల్లిలోని సీఎంఆర్ హైస్కూల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 8–6తో రంగారెడ్డిపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ 9–8తో ఖమ్మంను ఓడించింది. బాలుర ఫైనల్లో కరీంనగర్ 17–16తో పెనాల్టీ షూటౌట్లో వరంగల్‌పై విజయం సాధించింది. మహబూబ్‌నగర్ 11–8తో ఆదిలాబాద్‌పై గెలుపొంది మూడోస్థానాన్ని దక్కించుకుంది. టోర్నీ ముగింపు కార్యక్రమంలో సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్, కార్యదర్శి సీహెచ్ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. -
రంగారెడ్డి బాలికల డబుల్ ధమాకా
హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి సెపక్తక్రా టోర్నమెంట్లో రంగారెడ్డి బాలికల జట్లు అండర్–14, 17 విభాగాల్లో విజేతగా నిలిచాయి.సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం జరిగిన అండర్–14 బాలికల ఫైనల్లో రంగారెడ్డి 2–1 స్కోరుతో నిజామాబాద్‌పై గెలిచింది. సెమీస్‌లో రంగారెడ్డి 2–0తో ఆదిలాబాద్‌పై, నిజామాబాద్ 2–0తో హైదరాబాద్‌పై గెలుపొందాయి. అండర్–17 ఫైనల్లోనూ రంగారెడ్డి 2–0తో నిజామాబాద్‌పైనే నెగ్గింది. సెమీస్‌లో రంగారెడ్డి 2–0తో వరంగల్‌పై, నిజామాబాద్ 2–0తో నల్లగొండపై నెగ్గాయి. అండర్–14 బాలుర తుదిపోరులో మహబూబ్‌నగర్ 2–0తో నల్లగొండపై, అండర్–17 బాలుర టైటిల్ పోరులో వరంగల్ 2–0తో నిజామాబాద్‌పై విజయం సాధించాయి. స్క్వాష్ మార్షల్ ఆర్ట్స్‌లో వేణు, విష్ణు గెలుపొందారు. 48 కేజీల విభాగంలో వేణు 9–6తో కమలేశ్‌పై, బిపిన్ పాండే 12–8తో వేణుపై గెలువగా... 56 కేజీల కేటగిరీలో విష్ణు 6–2తో నందుపై, ఖుర్షీద్ 12–6తో విష్ణుపై నెగ్గారు. 52 కేజీల విభాగంలో శివమణి 10–7తో యశ్వంత్‌పై, 60 కేజీల కేటగిరీలో వేణు 12–8తో అజయ్‌పై నెగ్గారు. -
19న బ్యాడ్మింటన్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ జిల్లా అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ సెలక్షన్ టోర్నీ జరుగనుంది. నాంపల్లిలోని ప్రభుత్వ ఎంఏఎం జూనియర్ కళాశాల వేదికగా బాలబాలికల విభాగంలో ఈ పోటీలు జరుగుతాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మంగళవారం సరూర్‌నగర్ స్టేడియంలో ప్రారంభమయ్యే రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు ఎంపికవుతారు. ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కోసం బ్యాడ్మింటన్ సెక్షన్ సెక్రటరీ డి. ఆర్. అన్నా మేరీ (7013189722)ని సంప్రదించవచ్చు. -
తెలంగాణ బాలికల జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు సత్తా చాటారుు. అల్వాల్‌లోని పల్లవి మోడల్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలవగా... బాలుర జట్టు రెండో స్థానాన్ని సంపాదించింది. బుధవారం జరిగిన బాలికల ఫైనల్లో తెలంగాణ జట్టు 15-9, 12-15, 15-11తో ఢిల్లీపై గెలుపొందింది. మహారాష్ట్ర జట్టు 15-8, 12-15, 15-13తో హరియాణాపై గెలుపొంది మూడో స్థానంలో నిలిచింది. బాలుర ఫైనల్లో ఢిల్లీ 15-13, 15-12తో తెలంగాణపై గెలిచి విజేతగా నిలవగా... ఛత్తీస్‌గఢ్ 15-9, 15-11తో కర్ణాటకపై నెగ్గి మూడో స్ధానాన్ని దక్కించుకుంది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ నరేశ్ మన్, ఉపాధ్యక్షుడు రాంరెడ్డి, పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సునీర్ నేగి, తెలంగాణ త్రోబాల్ సంఘం కోశాధికారి వెంకట్ పాల్గొన్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి తైక్వాండో టోర్నీ
నంద్యాల: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్–19 తైక్వాండో టోర్నమెంట్‌ను స్థానిక పద్మావతినగర్‌లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహిస్తామని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి చలపతిరావు తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ 13 జిల్లాలకు చెందిన బాలురు, బాలికల జట్లు హాజరవుతాయని, ఒక్కో జట్టులో 8మంది క్రీడాకారులు కోచ్, మేనేజర్ ఉంటారని చెప్పారు. మూడు రోజుల పాటు టోర్నీ నిర్వహిస్తామన్నారు. టోర్నీలో ప్రతిభ చూపిన వారిని వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 8వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. -
ప్రతిభకు ’చెద’రంగం
రాష్ట్ర ఎస్జీఎఫ్ పోటీల నిర్వహణలో అక్రమాలు చెస్ టోర్నీలో ప్రతిభావంతులకు దక్కని చోటు కొన్ని రౌండ్లు ఆడకున్నా పాయింట్ల కేటాయింపు సస్పెన్షన్‌లో ఉన్న వ్యక్తే చీఫ్ ఆర్బిటర్ సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చెస్ జట్ల ఎంపికలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పిల్లల ప్రతిభకు పదునుపెట్టి మెరికల్లాంటి వారిని ఎంపిక చేయాల్సి ఉండగా.. ఎక్కడా అలా జరగడంలేదు. అయిన వారి కోసం ప్రతిభావంతులను పక్కన పెట్టిన బాగోతం తాజాగా బయటపడింది. నిబంధనలకు తిలోదకాలిచ్చి టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తేలింది. 62వ జాతీయ స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర స్థాయి(వేర్వేరు వయోవిభాగాలు) చెస్ జట్ల కోసం ఈనెల 17, 18వ తేదీన రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలోని సెరెనిటీ స్కూల్లో సెలక్షన్స జరిగారుు. ఆటగాళ్లను ఎంపిక చేసే బాధ్యతల్ని రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుంచి వచ్చిన చెస్ క్రీడాకారులు (బాలలు, బాలికలు) అండర్ -14, 17, 19 విభాగాల్లో పాల్గొన్నారు. రెండు రోజులు ఐదు రౌండ్ల పాటు కొనసాగిన ఈ టోర్నీకి డైరక్టర్‌గా రమేష్ రెడ్డి, చీఫ్ ఆర్బిటర్‌గా శ్రీకృష్ణ అలియాస్ ధన వ్యవహరించారు. పక్కనపెట్టిన వ్యక్తికే పట్టం.. సస్పెన్షన్ వేటు పడిన వ్యక్తినే ఆర్బిటర్‌గా కొనసాగించి టోర్నీని నిర్వహించారు. అండర్-11 విభాగంలో రాష్ట్ర చెస్ చాంపియన్‌షిప్‌లో అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంటూ చీఫ్ ఆర్బిటర్ శ్రీకృష్ణపై నెల క్రితం తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధించింది. నిషేధం ఉన్న కాలంలో ఏ టోర్నీకి కూడా ఆర్బిటర్‌గా వ్యవహరించకూడదని ఆ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయి నా నిబంధనలకు విరుద్ధంగా జాతీయ స్థాయి జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేసే బాధ్యతలను ఉద్దేశపూర్వకంగా అప్పగించినట్లు తెలుస్తోంది. మరోపక్క ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లోనూ ఇతను ఆర్బిటర్ కొనసాగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అతన్ని తప్పించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అవకతవకలకు సాక్ష్యాలు... ఈనెల 17న నాగారంలో జరిగిన స్టేట్ స్కూల్ గేమ్స్ చెస్ టోర్నీలో తొలిరోజు పాల్గొనని ఇద్దరు క్రీడాకారులను (అండర్-17, అండర్ -19 బాలికల విభాగం) పాల్గొన్నట్టుగా చూపించారు. అంతేగాక వారిని రెండో రోజునుంచి ఆడించారు. వాస్తవంగా తొలిరోజు ఆడని వారికి రెండో రోజు అవకాశం కల్పించకూడదు. వీరిద్దరిలో ఒకరు అండర్-19 విభాగంలో రాష్ట్రస్థారుు జట్టుకు ఎంపిక కావడం గమనార్హం. పైగా వీరిద్దరూ 17వ తేదీన రాష్ట్రంలోనే లేరు. ఇదే తేదీన కోల్‌కతాలో జరిగిన జాతీయ అండర్-17 బాలికల చదరంగ పోటీల్లో పాల్గొన్నారు. వాస్తవంగా తొలిరోజు జరిగిన రెండు రౌండ్లలో పాల్గొనకుండా అధిక పాయింట్లు సంపాదించడం చదరంగ చరిత్రలో సాధ్యపడిన దాఖలాలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. అండర్-14 బాలికల విభాగంలో తమకు కావాల్సిన క్రీడాకారిణి కోసం ప్రతిభ గల వ్యక్తిని పక్కనబెట్టారు. అది కూడా దాదాపు 1500 రేటింగ్ గల క్రీడాకారిణిని. ప్రతి రౌండ్‌కు ప్రత్యర్థులను నిర్ణయించే ప్రక్రియలో లోపాల కారణంగా అనర్హులకు టీంలో చోటు కల్పించారు. అండర్-17 బాలికల విభాగంలో మరో అక్రమం చోటుచేసుకుంది. ఓ బాలికకు ఫిడే రేటింగ్ ఉన్న అంశంపై గోప్యత పాటించారు. ఈ క్రీడాకారిణిని.. అసలు రేటింగ్ లేనివారితో తలపడేలా చేశారు. ఫలితంగా గోప్యత పాటించిన క్రీడాకారిణి 4 పాయింట్లు సాధించి జాతీయ టోర్నీ ఆడే టీంకు ఎంపికకావడం గమనార్హం. లోపాలు ఎక్కడా బయటపడకుండా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా అవకతవకలకు అవకాశం ఉండే ‘స్విస్ పర్ఫెక్ట్’ సాఫ్ట్‌వేర్‌పై ఫెడరేషన్ నిషేధం విధించింది. దాంతో ఏ చెస్ అసోసియేషన్ కూడా కొన్నాళ్లుగా వినియోగించడం లేదు. అరుుతే ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక టోర్నీలకు ఇదే సాఫ్ట్‌వేర్‌ను వాడారు. ఈ కారణంగానే ప్రతిభ గల క్రీడాకారులను పక్కన బెట్టడం సాధ్య పడింది. టోర్నీని ఆరు రౌండ్లు నిర్వహించాల్సి ఉండగా.. ఐదింటితోనే ముగించేశారు. నియమ నిబంధన ప్రకారం క్రీడాకారుల సంఖ్య 40 దాటితే టోర్నీ 6 రౌండ్లు సాగాలి. క్రీడాకారుల సంఖ్య తగ్గితే 5 రౌండ్లకే పరిమితం కావాలి. కానీ అండర్-14 బాలుర విభాగంలో 48 మంది పోటీపడినప్పటికీ.. 5 రౌండ్లతోనే మమ అనిపించారు. తద్వారా ప్రతిభ గలవారికి చోటుదక్కలేదు. తిరిగి నిర్వహించాలి... తాజా వివాదంపై ఆటగాళ్ల తల్లిదండ్రులు కొందరు నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలపై జిల్లా విద్యాధికారి (డీఈఓ) బుధవారం విచారణ కూడా జరిపారు. అయితే సాంకేతికపరంగా జరిగిన కొన్ని లోపాలను సాకుగా చూపిస్తూ నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఇప్పటికే ఎంపికై న ఆటగాళ్లే జాతీయ స్థాయిలో పోటీ పడే అవకాశం కనిపిస్తున్నాయి. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ‘పారదర్శకంగా, అత్యంత పకడ్బందీగా జరగాల్సిన టోర్నీలో అవకతవకలు జరుగుతుండటం దురదృష్టకరం. లోటుపాట్ల విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్నా వారు పట్టించుకోవడం లేదు. అక్రమాలు జరిగిన టోర్నీని రద్దు చేసి ఎటువంటి మచ్చలేని ఆర్బిటర్ల ఆధ్వర్యంలో తిరిగి నిర్వహించాలి. అవకతవకలపై నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి‘ అని చెస్ క్రీడాకారుడి తండ్రి ఒకరు వ్యాఖ్యానించారు. అరుుతే ఈ ఆరోపణలను శ్రీకృష్ణ ఖండించారు. ‘నిబంధనలకు అనుగుణంగానే సెలక్షన్సను నిర్వహించాము. ఎటువంటి అవకతవకలు జరగలేదు. పారదర్శకంగా ఎంపిక నిర్వహించామని చెప్పేందుకు మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి‘ అని ఆయన వివరణ ఇచ్చారు. -
ఎస్జీఎఫ్ అండర్–19 క్రీడాకారుల ఎంపిక
– రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్, బాల్‌బ్యాడ్మింటన్ జట్ల ఖరారు శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ స్థాయి బాలబాలికలకు స్కూల్‌గేమ్స్ అండర్–19 ఎంపికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో బాల్‌బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించగా, పెద్దపాడులోని శ్రీరామ వ్యాయామ కళాశాలలో వెయిట్‌లిఫ్టింగ్ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా ఎస్జీఎఫ్ అండర్–19 జట్లకు ఎంపికచేస్తామని ఫెడరేషన్ కార్యనిర్వహన కార్యదర్శి పీవీఎల్ఎన్ కృష్ణ వెల్లడించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు పయనం కాగా శనివారం నుంచి ప్రారంభంకానున్న రాష్ట్ర స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలబాలికల వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారులు శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లారు. క్రీడాకారుల వెంట పీఈటీ అఖిల్ మేనేజర్‌గా వెళ్లారు. ఈ పోటీలు పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురం వేదికగా జరగనున్నాయి. ఇదిలావుండగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం కేంద్రంగా ఈ నెల 20 నుంచి రాష్ట్ర స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలబాలికల బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయని కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు వీరే వెయిట్‌లిఫ్టింగ్‌లో: ఆదిలక్ష్మి(ప్రియాగ్రహారం), పార్వతీశంరెడ్డి(టెక్కలి), రామకృష్ణ(కోటబొమ్మాళి), వాసునాయుడు(టెక్కలి) ఎంపికైనవారిలో ఉన్నారు. బాల్‌బ్యాడ్మింటన్ జట్టు: ప్రవీణ్‌కుమార్, రవికుమార్, హరి, కిరణ్‌కుమార్, హరీష్, తారకేశ్వరరావు, డి.హరి, తేజేశ్వరరావు ఎంపికయ్యారు. వీరంతా ఏపీ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల టెక్కలికి చెందిన విద్యార్థులు కావడం విశేషం. -
పాలమూరు శుభారంభం
మెదక్‌పై ఘనవిజయం రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్–14 నెట్‌బాల్ టోర్నీ మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–14నెట్‌బాల్ టోర్నీలో ఆతిథ్య పాలమూరు జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని జెడ్పీ మైదానంలో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన బాలబాలికల జట్టు పాల్గొన్నాయి. బాలుర విభాగంలో ఏకపక్షంగా జరిగిన తొలి మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 10–1గోల్స్ తేడాతో మెదక్‌ను చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో 5గోల్స్‌తో దూసుకెళ్లిన జిల్లా జట్టు రెండో అర్ధభాగంలో అదే జోరును కొనసాగించి మరో ఐదు గోల్స్ చేసింది. బాలికల విభాగంలో తొలిమ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది. ఆ జట్టు 4–1గోల్స్ తేడాతో రంగారెడ్డిపై గెలుపొందింది. తొలి, రెండు సెషన్లో హైదరాబాద్ క్రీడాకారులు రెండేసి గోల్స్ సాధించారు. ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎదగాలి క్రీడల్లో ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎదగాలని మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ పిలుపునిచ్చారు. ఎస్జీఎఫ్ నెట్‌బాల్ టోర్నీ ప్రారంభోత్సవానికి ముందుగా ఆమె క్రీడ పతాకాన్ని ఎగురవేసి, క్రీడాకారుల నుంచి వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలో నైపుణ్యం గల క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తే మరింతగా రాణిస్తారని తెలిపారు. అన్ని రకాల క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టోర్నీలో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్ మాట్లాడుతూ గతంలో జిల్లా కేంద్రంలో జాతీయస్థాయి నెట్‌బాల్ టోర్నీలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. పదేళ్ల తర్వాత నెట్‌బాల్ టోర్నీ నిర్వహిస్తున్నామని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి టోర్నీలో రాణించిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపిక చేస్తామని చెప్పారు. అక్టోబర్ మొదటివారంలో జిల్లా కేంద్రంలోనే జాతీయస్థాయి అండర్–14 నెట్‌బాల్ టోర్నీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరామారావు, కృష్ణమూర్తి, రాములు, విలియమ్స్, జగన్మోహన్గౌడ్, రామేశ్వర్, సాదత్‌ఖాన్, సొహైల్ వుర్ రహెమాన్, పరుశరాముడు, నాగరాజు, ముకర్రం, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
షురూ!
నేటినుంచి నెట్‌బాల్ టోర్నీ హాజరుకానున్న పది జిల్లాల క్రీడాకారులు జెడ్పీ మైదానంలో ఏర్పాట్లు పూర్తి మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో శుక్రవారం నుంచి ఈనెల 11 వరకు జరిగే అండర్–14 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాల, బాలికల నెట్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. కొన్నేళ్ల తర్వాత జిల్లా కేంద్రంలో నెట్‌బాల్ టోర్నీ నిర్వహిస్తుండడంతో విజయవంతం చేయడానికి ఎస్జీఎఫ్ ప్రతినిధులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. టోర్నీని స్థానిక జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహిస్తున్నారు. వారం రోజుల నుంచి మైదానంలో కోర్టులతో పాటు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. టోర్నీకి మహబూబ్‌నగర్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి 130మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ్ రెయిన్బో, లిటిల్ స్కాలర్స్, చైతన్య, బ్రిలియంట్ పాఠశాలల్లో వసతి, బాలభవన్‌లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. టోర్నీలో 30మంది అఫీషియల్స్‌గా తమ విధులు నిర్వర్తించనున్నారు. టోర్నీని లీగ్‌కమ్ నాకౌట్ పద్ధతిలో నెట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం 4గంటలకు టోర్నీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, డీఈఓ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్ హాజరుకానున్నారు. గురువారం జిల్లా పరిషత్ మైదానంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్ పనులను పరిశీలించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్లను ఎంపిక చేసి నాలుగు రోజుల నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బాలుర జట్టు: రవి, జైరాం, సచిన్, విష్ణు, బాలకృష్ణ, నవీన్ చౌహాన్, విశాల్, ఇస్మాయిల్, షోయబ్, అమీర్, సురేశ్(మహబూబ్‌నగర్), అజహర్ (కోడ్గల్). బాలికల జట్టు: గంగోత్రి, శిరీష, గీత, శివగంగ, సోని (గార్లపహాడ్), స్వప్న (ఇప్పటూర్), రోహిణి, స్రవంతి, మౌనిక, అమ్ములు, అంజలి, భవాని (మహబూబ్‌నగర్).