బీరులో ఇకపై కోరినంత కిక్కు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని మందుబాబులకు ఓ ‘చల్లని’ వార్త. బీరులో కిక్కు తక్కువ అనుకునేవారు ఇకపై కోరినంత కిక్కును తలకెక్కించుకోవచ్చు. తాజా బీరును క్షణాల్లో తయారు చేసి అందించేందుకు 20 మినీ బీరు ప్లాంట్లు (మైక్రో బ్రేవరేజెస్) అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఈ నెలాఖరులోగా ఏర్పాటు కానున్నట్టు సమాచారం. వీటిలో రెస్టారెంట్లు, స్టార్‌హోటళ్లు సైతం ఉన్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో 650 మి.లీ బీరును సీసాల్లో అందిస్తుండగా..
ఈ మినీ ప్లాంట్లలో అర లీటరు, లీటరు జగ్గుల్లో బీరును లాగించేయొచ్చు. అప్పటికప్పుడు తాజా ముడి పదార్థాలతో తయారు చేయడం ఈ బీరు ప్రత్యేకత. దీని ధర కూడా కాస్త అధికంగానే ఉండనున్నట్టు సమాచారం. అరలీటరు బీరు రూ.150 నుంచి రూ.200 చెల్లించి మందుబాబులు జేబులు గుల్లవడం తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఒక్కో ప్లాంట్‌కు రూ.4 కోట్లు..!
ఈ మినీ బీరు ప్లాంటు ఏర్పాటు చేయాలనుకునేవారికి విధిగా రెస్టారెంట్, బార్ లేదా హోటల్ ఉండాల్సిందే. ప్లాంటు ఏర్పాటుకు ప్రత్యేకంగా వెయ్యి చదరపు అడుగుల సువిశాలమైన స్థలం, పార్కింగ్ ఏర్పాట్లు తప్పనిసరి. ఈ ప్లాంటు ఏర్పాటుకు లైసెన్సు ఫీజును ప్రాథమికంగా రూ.3 లక్షలుగా నిర్ణయించారు. రోజువారీ ఉత్పత్తి ఆధారంగా ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. కానీ ప్లాంట్లు ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.2 నుంచి రూ.4 కోట్లు అవుతుందని ఆబ్కారీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక నిత్యం ఒక్కో ప్లాంటులో సుమారు 200 నుంచి 500 లీటర్ల బీరు తయారీకి అనుమతివ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల యజమానులు 20 మందికి మినీ బీర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆబ్కారీశాఖ ప్రాథమిక అనుమతులిచ్చింది. ఆయా ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న ప్రాంతాల్లో ఆబ్కారీశాఖ వర్గాలు తనిఖీలు చేసిన తర్వాతే లైసెన్సులను మంజూరు చేస్తారు.
ఈ బీరు చాలా ఖరీదు గురూ..
ప్రస్తుతం 650 మి.లీ లీటర్ల సీసాలో లభ్యమయ్యే లైట్ బీర్ రూ.90, హార్డ్‌బీర్ రూ.105 చొప్పున మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారు. మినీ బ్రేవరేజెస్‌లో తయారయ్యే బీరుకు అర లీటరు రూ.150 నుంచి రూ.200 ధర చెల్లించక తప్పదని ఆబ్కారీ శాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా తయారుచేసి అందించడం.. అదీ మనం చూస్తుండగానే క్షణాల్లో సిద్ధం చేయడం, ముడిపదార్థాల నాణ్యత కాస్త మెరుగ్గా ఉండడంతో రుచిలో ఈ బీరు మందుబాబులకు సరికొత్త కిక్ నిస్తుందని సెలవిస్తున్నారు. కనుక బీరుబాబులూ.. బీ(రు)రెడీ.