పెళ్లిళ్లు వేలల్లో ... రిజిస్ట్రేషన్లు వందల్లో
►ఆరు నెలల్లో 578 వివాహాలు నమోదు
►జరిగినవి సుమారు నాలుగు వేలు
►వధూవరుల్లో కొరవడిన అవగాహన
మార్కాపురం : వేలల్లో పెళ్లిళ్లు జరుగుతున్నా, చట్టబద్ధత కల్పించే రిజిస్ట్రేషన్ల విషయంలో వధూవరులకు అవగాహన లేకపోవడంతో సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో వివాహాల నమోదు నత్తనడకన సాగుతోది.
జిల్లాలో ఇలా..
మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో మార్కాపురం, అద్దంకి, కంభం, దర్శి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, పొదిలి, యర్రగొండపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 2016 డిసెంబర్1నుంచి 2017 మే 31వరకు సుమారు 4వేల వరకు వివాహాలు జరగ్గా సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 578పెళ్లిళ్లు రిజిస్టర్ అయ్యాయి. పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.
చట్టబద్ధంగా ఎన్ని?
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే కల్యాణ మండపాలు బుక్కవుతాయి. ఒక రోజు ఒక్కొక్క మండపంలో మూడు పెళ్లిళ్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కల్యాణ మండపాలు బుక్ చేసుకునేందుకు రెండు, మూడు నెలలు ముందుగానే అడ్వాన్స్‌లు ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే వీటిలో చట్టబద్ధంగా నమోదవుతున్నవి మాత్రం చాలా తక్కువే. నెలకు సగటున వంద మాత్రమే వివాహాలు నమోదవుతున్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది.
కోర్టులు చెబుతున్నా..
వివాహాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోర్టులు చెబుతున్నా అత్య«ధిక జంటలు వివాహాల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విదేశాలకు వెళ్లే జంటలు మాత్రమే తమ పెళ్లిళ్లను నమోదు చేయించుకుంటున్నారు.
ఇవి లాభాలు
►వివాహానంతరం వచ్చే సమస్యల పరిష్కారంలో వివాహ ధ్రువీకరణ పత్రాలు ఉపయోగపడతాయి.
►జీవిత భాగస్వామిని విదేశాలకు తీసుకెళ్లాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి.
►విదేశాలకు వెళ్లడంతో పాటు న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతోంది.
►ముఖ్యంగా 2, 3 పెళ్లిళ్లు చేసుకునే వారి ఆట కూడా కట్టించవచ్చు.
నమోదుకు..
వివాహాల రిజిస్ట్రేషన్‌కు గడువు అంటూ ఏమి లేదు. ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు. వివాహ శుభలేఖ, ముగ్గురు సాక్షుల, వయసు ధ్రువీకరణ పత్రం(పదో తరగతి సర్టిఫికెట్), పెళ్లి ఫొటోలు తీసుకుని దగ్గరలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతుంది.
మహిళలకు పూర్తి రక్షణ
వివాహాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోర్టులు చెబుతున్నాయి. భార్యభర్తల మధ్య గొడవలు జరిగి కోర్టుకు వచ్చినప్పుడు కచ్చితంగా వివాహ ధ్రువీకరణ పత్రం అవసరమవుతోంది. మహిళలను వంచించే వారి బండారం బయటపడుతుంది. వివాహం రద్దయిన తర్వాత భరణం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. మహిళలకు పూర్తిగా రక్షణ ఉంటుంది.
– ఉమ్మడి రవీంద్రనాథ్, న్యాయవాది, మార్కాపురం