ఖేడ్ తహసీల్ధార్ కార్యాలయంలో కలెక్టర్
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
భవనాలు, వాహనాలు, కంప్యూటర్లు, నెట్ సిద్ధం
పక్షం రోజుల్లో పాలనా పరంగా అందుబాటులోకి
డివిజన్, మండలాల్లోనూ అన్ని ఏర్పాట్లు
కలెక్టర్ రోనాల్డ్‌రోస్
మరో 11 కొత్త మండలాలకు ప్రతిపాదనలు
ఖేడ్ సంగారెడ్డి జిల్లాలోనే
నారాయణఖేడ్: నూతన సిద్దిపేట, మెదక్ జిల్లాల ఏర్పాటులో బాగంగా ప్రభుత్వ కార్యాలయాలు సిద్దంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌త తెలిపారు. గురువారం నారాయణఖేడ్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్, ఇతర విభాగాల కార్యాలన్నింటినీ సిద్దం చేశామని తెలిపారు.
దీంతోపాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాల్లో అక్కడి అధికారుల కార్యాయాలను సైతం సిద్దం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్న తరహాలో కొత్త జిల్లాల్లోనూ కార్యాలయాలు, ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇంటర్‌నెట్, వాహనాలు తదితరాలన్నింటినీ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకోసం భవనాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
మరో 11మండలాల కోసం ప్రతిపాదనలు
జిల్లాలో ఇదివరకు ప్రభుత్వం ముసాయిలో కొత్త మండలాలు ప్రకటించగా ప్రజా అవసరాలు, విజ్ఞప్తుల మేరకు మరో 11కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ రోనాల్‌రోస్ తెలిపారు. మనూరు మండలంలోని నాగల్‌గిద్దతోపాటు వివిధ ప్రాంతాల్లోని ప్రతిపాదిత మండలాలు ఉన్నాయని అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాలోనే ఉంటుందన్నారు.
జిల్లాలో మంచి వర్షం
జిల్లా వ్యాప్తంగా మూడు నాలుగు రోజులుగా మంచి వర్షం కురిసిందని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. జిల్లాలో ఈనెలలో మైనస్ 28 శాతం వర్షపాతం ఉండగా ప్రస్తుతం మైనస్ 5 శాతానికి వచ్చిందన్నారు. దీంతో వర్షపాతం నార్మల్ స్థాయికి చేరిందన్నారు. ఇంకా సింగూరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ప్రారంభం కాలేదని, మరో రెండు రోజుల్లో కొద్దిగా నీరు చేరే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం 5.9టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఈ నీటివల్ల రెండేళ్ల వరకు తాగునీటి ఇబ్బందులు తీరుతాయన్నారు. ఘన్‌పూర్‌కు కేవలం 0.25 టీఎంసీల నీటిని వదిలామని, ఇంతమేర నీరు వదలడంతో తాగునీటికి వచ్చే ఇబ్బందులు లేవన్నారు. చెరువులు, కుంటల్లోకి కొద్దిగా నీరు వచ్చి చేరిందని, మరికొన్ని నిండిపోయాయన్నారు. పంట, ఆస్తి నష్టాల వివరాలు సేకరించేందుకు ప్రతి మండలంలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అందరూ మరుగుదొడ్లు నిర్మించుకోండి
వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని సంపూర్ణ పారిశుద్ధ్యానికి పాటుపడాలని కలెక్టర్ రోనాల్డ్ రోస్ కోరారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించాయని అన్నారు. మెదక్ నియోజకవర్గం కూడా త్వరలో పూర్తవుతుందన్నారు. ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గం మాత్రమే వెనుకబడి ఉందని చెప్పారు. డిసెంబర్ నాటికి వందశాతం లక్ష్యానికి చేరుకోనున్నట్లు తెలిపారు. ఇక నుంచి మరుగుదొడ్ల బిల్లులు వ్యక్తికి నేరుగా కాకుండా సర్పంచ్ ఖాతాల్లో జమచేస్తామని, ఇలా గ్రూపులుగా డబ్బులు వస్తాయని కలెక్టర్ అన్నారు.