కాకినాడ (కాకినాడ సిటీ) :
కాకినాడకు కొత్త మాస్టర్‌ప్లాన్
Published Fri, Apr 28 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM
స్మార్ట్ సిటీ కాకినాడలో కొత్త మాస్టర్‌ప్లాన్కు ఆమోదం లభించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోదావరి అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ (గుడా)లో పరిధిలోకి కాకినాడ ఇప్పటికే చేరిన విషయం విదితమే. 1975లో 20 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. 1.64 లక్షల జనాభాకు తగ్గట్టుగా రూపుదిద్దుకున్న ఆ మాస్టర్‌ప్లాన్ను 1995లో సవరించారు. ఆ తరువాత అనేక సవరణలు చేశారు. 2011లో 3.26 లక్షల మంది జనాభాతో కొత్త మాస్టర్‌ప్లాన్కు రూపకల్పన చేశారు. ఎట్టకేలకు 2016లో కౌన్సిల్ తీర్మానం ద్వారా ఈ మాస్టర్‌ప్లాన్ను ప్రభుత్వానికి నివేదించారు. కాకినాడ పరిసరాల్లోని సుమారు 32 గ్రామాలను కూడా మాస్టర్‌ప్లాన్లో కలుపుతూ ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌వీ అసోసియేట్ సంస్థ ఈ ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చింది. 2035 నాటికి 10.93 లక్షల మంది జనాభా ఉంటుందన్న అంచనాతో చేసిన ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కొత్త మాస్టర్‌ప్లాన్ అమలులోకి వస్తే కాకినాడలో ప్రస్తుతం రెసిడెన్షియల్ ప్రాంతంగా ఉన్న మెయిన్రోడ్డు కమర్షియల్ జోన్గానూ, ఇండస్ట్రియల్ జోన్, స్కూల్ జోన్, గ్రీన్బెల్ట్ ప్రాంతాలను వేర్వేరుగా కేటాయించనున్నారు.
Advertisement
Advertisement