పాత నోట్లకు కొత్త నోట్లు
Published Mon, Dec 5 2016 12:21 AM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM
- రూ.7 కోట్లకు భేరం
- పోలీసులను పరుగులు పెట్టించిన ఘనులు
- తెల్లవారుజామున 5 గంటల వరకు గాలింపు
ఎమ్మిగనూరురూరల్: పెద్ద నోట్ల రద్దు కొందరికి సంకటంగా మారితే మరికొందరికి ఆదాయ వనరు అయింది. పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామంటూ కొందరు మరి కొందరికితో ఫోన్‌లో భేరమాడడం, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఘటన శనివారం ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. దీనిపై అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విశ్వనీయ సమాచారం మేరకు... ‘తమ మద్ద కొత్త కరెన్సీ నోట్లున్నాయి.. 20 శాతం కమీషన్ ఇస్తే రూ. 7కోట్ల వరకు పాత నోట్లు మార్చి ఇస్తాం’ అంటూ ఎమ్మిగనూరుకు చెందిన కొందరు వ్యక్తులు కొలిమిగుండ్ల, హైదరాబాద్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వారితో ఫోన్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఫోన్ సంభాషణల విషయం తెలుసుకున్న ఎస్పీ క్రైం పార్టీ పోలీసులు ట్రాప్ చేశారు. ‘ఎన్నికోట్ల పాత నోట్లు తెచ్చినా మేము మార్చి ఇస్తాం’ అంటూ ఎమ్మిగనూరు వాసులు చెప్పగా ’రూ. 3కోట్లకు కావాలి’ అని వారు చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు వారిని నోట్లతో వచ్చి ఎమ్మిగనూరు బస్టాండ్‌లో ఉండాలని సూచించారు’. ఇందుకు సంబంధించి ఎస్పీ నుంచి సమాచారం రావడంతో ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు అర్ధరాత్రి పట్టణానికి చేరుకొని స్థానిక సీఐ, ఎస్‌ఐలతో బస్టాండ్, లాడ్జ్‌లను గాలించారు. పోలీసులు పట్టణంలో తిరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తి పట్టణానికి వచ్చిన కొత్త వ్యక్తులకు సమాచారం అందించటంతో వారు రాత్రికి రాత్రే మంత్రాలయం వెళ్లడం, అక్కడ కూడా పోలీసులు గాలించడం జరిగిపోయింది. చివరకు పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి దగ్గర తనిఖీ చేయగా డబ్బులు దొరకకపోవడంతో పోలీసు ట్రీట్ మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున నోట్లు మార్పిడి జరుగుతుందని రేగిన కలకలం చివరికి రెండు గ్రూపులకు చెందిన వారి దగ్గర డబ్బులు లేవని చీటింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది. విషయంపై పట్టణ ఎస్‌ఐ కె.హరిప్రసాద్‌ను 'సాక్షి' వివరణ కొరగా డబ్బులు మారుస్తామని చీటింగ్ చేసిన కేసులో పట్టణానికి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Advertisement
Advertisement