ప్రణాళిక కొత్తది..ప్రతిపాదనలు పాతవే
– అభిప్రాయ సేకరణకు ప్రచారం కరువు
– కొత్త ప్రాజెక్టులు సూచించాలన్న అధికారులు
– పాత వాటికే దిక్కులేదన్న ప్రజా సంఘాలు
కర్నూలు సిటీ: జిల్లాలో సాగు నీటి వనరుల పెంపు కోసం అభిప్రాయణ సేకరణ ప్రణాళిక కొత్తదే అయినా..ప్రతిపాదనలన్నీ పాతవే వచ్చాయి. శుక్రవారం స్థాని జెడ్పీ హాల్‌లో జల వనరుల శాఖ అభిప్రాయ సేకరణ చేపట్టింది. సీఈ నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి డ్వామా పీడీ పుల్లారెడ్డి, ఎస్‌ఈలు చంద్రశేఖర్ రావు, సూర్యకూమార్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీసీఈ జి.విశ్వనాథం హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందే ఇంజినీర్లు.. గతంలో ప్రతిపాదనలు చేసిన ప్రాజెక్టులు కాకుండా కొత్తవాటిని సూచించాలని ప్రజా సంఘాల నాయకులను కోరారు. ఈ సందర్భంగా ఆదోనికి చెందిన ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. పాత ప్రాజెక్టులే దిక్కులేదన్నారు. జల వనరుల శాఖకు సంబంధించిన ప్రణాళిక తయారులో శాఖల మధ్య సమన్వమం లేదన్నారు. కలెక్టర్ సూచించిన వాటినే ఇంజినీర్లు చెప్పడం కాకుండా ఇంజినీర్లు కలెక్టర్‌కు చెప్పే స్థాయిలో ఉండాలన్నారు. జీఆర్‌పీ నుంచి ఈ ఏడాది చుక్క నీరు ఇవ్వలేదన్నారు. దీంతో జీఆర్‌పీ ఈఈ నారాయణ స్వామి మాట్లాడుతూ.. అన్ని స్కీమ్‌ల నుంచి నుంచి నీరు ఇచ్చామని కావాలంటే చూపిస్తామన్నారు.
– ఎల్‌ఎల్‌సీ నీటి పరిరక్షణ సమతి సభ్యులు సాయిబాబు మాట్లాడుతూ.. చింతకుంట వాగు, మెదేహాలు వాగు, హాలహర్వి వాగు, హరివాణం గజ్జి వాగు, ఎరిగేరి–బదినేహాళల్ళు మధ్య రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. ఈ వాగుల నుంచి ఏడాదికి సగటున 3 నుంచి 5 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం మేళిగనూరు దగ్గర తుంగభద్రపై ఆనకట్ట నిర్మించాలనే సూచన వచ్చింది. ఈ సమావేశంలో ఆయా ప్రాజెక్టుల ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు.