విశిష్ట రక్షిత సాగు ప్రాజెక్టు ప్రారంభం
విశిష్ట రక్షిత సాగు ప్రాజెక్టు ప్రారంభం
Published Sat, Dec 17 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
అందుబాటులోకి రానున్న సేవలు
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
సాక్షి, అమరావతి బ్యూరో :
పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో దేశంలో రెండవ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన విశిష్ట రక్షిత సాగు (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) ప్రాజెక్టును శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మంత్రికి పూర్ణకుంభంతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లాంఛనంగా ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి పుల్లారావు, వర్సిటి పాలకమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతరులకు ఉద్యానవర్సిటి అధికారులు ప్రాజెక్టులో జరిగే ప్రక్రియల గురించి వివరించారు. రైతు విత్తనం తీసుకొస్తే 30 నుంచి 35 రోజుల వ్యవధిలో మొక్కగా చేసి రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా మొక్కలను అందించవచ్చని వర్సిటి ఉపకులపతి డాక్టర్ బిఎంసిరెడ్డి మంత్రికి చెప్పారు. ఆటోమెషీన్ ప్రక్రియ, క్వాయర్ బెల్ట్ పనితీరు, నీరు ఎరువులు, యాజమాన్య పద్దతులు గురించి వివరించారు. కేవలం 40పైసలు వెచ్చిస్తే మిరప మొక్కను ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు అందించవచ్చని తెలిపారు. విశాఖ జిల్లాలో ప్రొటెక్టెడ్ కల్టీవేషన్ తరహాలో రూపొందించిన ఆర్కిడ్స్ ప్రాజెక్టులోని కొన్నింటిని ప్రాజెక్టులో ప్రదర్శనగా ఉంచారు. వీటి గురించి వి.సి మంత్రికి వివరించారు. అనంతరం క్యాప్సికమ్, చెర్రీ టమాట మొక్కలను మంత్రి పరిశీలించారు. ప్రాజెక్టులో వాతావరణ నియంత్రణ తదితర విషయాల గురించి మంత్రికి యూనివర్సిటి అధికారులు వివరించారు. రైతులకు ఉపయుక్తంగా ఉండే ఈ ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి ఉద్యానవర్సిటి అధికారులను ఆదేశించారు. రైతులకు అవగాహన కలిగితేనే ఇలాంటి ప్రాజెక్టుల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, గూడెం ఎంపిపి గన్నమని దొరబాబు, ఏఎంసి చైర్మన్లు పాతూరి రామ్‌ప్రసాద్ చౌదరి, పాతూరి విజయ్‌కుమార్, శాస్త్రవేత్తలు, పాలకమండలి సభ్యులు సత్యనారాయణ, శివరామకృష్ణ, బోణం నాగేశ్వరరావు, వర్సిటి విస్తరణ సంచాలకులు, ప్రాజెక్టు ఇన్‌ఛార్జ్ ఆర్‌విఎస్‌కె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement