ysr university
-
అరటి నార.. అందాల చీర
ఈ చీరలను నూలు, పట్టు దారాలతో నేశారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. వీటిని కేవలం అరటి నారతో నేశారు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఔత్సాహిక యువత అరటి నార (బనానా ఫైబర్)తో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. చీర నుంచి చేతిసంచి వరకు దాదాపు 45 రకాల ఉత్పత్తుల్ని తయారు చేస్తూ అదరహో అనిపిస్తున్నారు. పర్యావరణ హితమైన ఈ ప్రయత్నానికి ఏడాదిన్నర క్రితం బీజం వేయగా.. వాణిజ్యపరంగాను లాభాల పంట పండించనుంది.సాక్షి, అమరావతి: ‘బిడ్డలకు జన్మనిచ్చి తల్లి ప్రాణాలు కోల్పోతుంది’ అనే పొడుపు కథ విన్నారా. అరటి చెట్టును ఉద్దేశించి ఈ పొడుపు కథ వాడుకలోకి వచ్చింది. అరటి చెట్టు గెలవేసి.. గెలలోని కాయలు పక్వానికి రాగానే గెలను కోసేస్తారు. మరుక్షణమే అరటి చెట్టును నరికేస్తారు. అలా నరికిపడేసిన అరటి చెట్లు తోటల్లో గుట్టలుగా పేరుకుపోవడంతో వాటిని తొలగించేందుకు రైతులు పడే ఇబ్బందులు వర్ణానాతీతం. దీనికి శాస్త్రవేత్తలు గతంలోనే చక్కటి పరిష్కారం కనుక్కున్నారు. అరటి చెట్ల కాండం నుంచి నార తీసే సాంకేతికతను అభివృద్ధి చేయడంతోపాటు యంత్రాలను సైతం అందుబాటులోకి తెచ్చారు.అరటి నార తయారీతో రైతులకు ఆదాయంఅరటి నారకు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోంది. దీంతో ఔత్సాహికులు రైతుల వద్దకు వెళ్లి కొట్టి పడేసిన అరటి బొంత (కాండం)లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క బొంతకు రూ.2 నుంచి రూ.5 వరకు చెల్లిస్తున్నారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆ బొంతలను ఎండబెట్టి యంత్రాల సాయంతో నార తీస్తున్నారు. ఈ నారతో పర్యావరణ హితమైన వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. దీనిపై మరింత అవగాహన పెంచి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అందించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎసాŠస్ర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అరటి నార ఉత్పత్తుల తయారీపై ఔత్సాహిక యువత, మహిళలు, రైతులకు శిక్షణ ఐదు రోజుల శిక్షణ ఇచ్చారు. కాగా.. కడప నగరానికి చెందిన ముసా ఫైబర్ స్టార్టప్ సంస్థ వివిధ ప్రాంతాల్లో యువత, మహిళలకు అరటి నార ఉత్పత్తులపై శిక్షణ ఇస్తోంది. తాజాగా ఈ సంస్థ అనంతపురం జిల్లా కురుగుంటలో రెండు నెలలపాటు ఇచ్చిన శిక్షణ శనివారంతో ముగిసింది.అద్భుతమైన ఉత్పత్తుల తయారీఅరటి నారతో అద్బుతమైన ఉత్పత్తులను అందించే నైపుణ్యం అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఇప్పటికే ఔత్సాహిక, అంకుర సంస్థలు అరటి నార నుంచి తీసిన దారాలతో చీరల్ని నేయించి అమ్మకాలకు పెడుతున్నాయి. అరటి నార దారాలతో ప్యాంట్లు, షర్ట్లు తదితర దుస్తులను రూపొందిస్తున్నాయి. కొందరు ఔత్సాహికులు అందమైన చేతి సంచులు, బుట్టలు, హ్యాండ్‌బ్యాగ్‌లు సైతం అరటి నారతో రూపొందిస్తున్నారు. చెవి రింగులు, గాజులు, బుట్టలు, ప్లేట్లు, గ్లాసులు, పాదరక్షలు, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, శానిటరీ న్యాప్కిన్స్, పేపర్, పూల బుట్టలు ఇలా అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. పరుపులో వాడే పీచుకు బదులు అరటి నారతో తయారు చేస్తున్న క్వాయర్ మరింత నాణ్యతతో ఉన్నట్టు గుర్తించారు.మా కృషి ఫలిస్తోందిరాష్ట్రంలో అరటి సాగుచేసే రైతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అరటి బొంతల నుంచి తీసే ఫైబర్‌తో ఉత్పత్తులు తయారు చేయడంపై ఉతర రాష్ట్రాలకు వెళ్లి శిక్షణతో అవగాహన పెంచుకున్నాం. ఐదుగురు సభ్యులతో ముసా ఫైబర్ స్టార్టప్ నెలకొల్పాం. కడప, అనంతపురం, కృష్ణా, రాజమండ్రి, విజయనగరం జిల్లాల్లో అరటి నారతో ఉత్పత్తులు తయారు చేసే ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశాం. రైతుల నుంచి అరటి బొంతలు సేకరించి నారతీసి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. మిగిలిన వ్యర్థాలను కంపోస్టుగా మారుస్తున్నాం. ర్చి రైతులకు ఇస్తున్నాం. అరటి బొంత నీరు నుంచి క్రిమిసంహారక మందులు, సౌందర్య సాధనాలు తయారు చేసే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. – పుల్లగుర శ్రీనివాసులు, ముసా ఫైబర్ స్టార్టప్, కడపఉపాధిగా మలుచుకుంటాంఅరటి ఉప ఉత్పత్తుల తయారీపై తీసుకున్న శిక్షణ మాకు ఉపయోగపడుతుంది. దీనిని ఉపాధిగా మలుచుకుంటాం. అరటి నార తీయడం మొదలు ఉత్పత్తుల తయారీ వరకు అనేక విధాలుగా జీవనోపాధి దొరుకుతుంది. – విద్య, కురుగుంట, అనంతపురం జిల్లాఅరటితో ఎన్నో ప్రయోజనాలుకొట్టిపడేసే అరటి చెట్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కుటీర పరిశ్రమగా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. శిక్షణ తీసుకోవడంతో మేం స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నాం. – శ్రీలక్ష్మి, కురుగుంట,అనంతపురం జిల్లా -
వైఎస్సార్ ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్
ఏఎఫ్‌యూ: కడపలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (ఏఎఫ్‌యూ) వైస్ చాన్సలర్ పోస్టుకు ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన వారు 20 రోజుల్లోపు http:// aps che. ap. gov. in వెబ్సైట్ ద్వారా దరఖా స్తు చేసుకోవాలని సూచించింది. 2020లో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి ఓఎస్డీగా ఆచార్య డి.విజయ్కిశోర్ను నియమించగా.. ఆయన రెండేళ్లకు పైగా ఇన్చార్జి వీసీగా, ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఆయన మాతృసంస్థకు వెళ్లడంతో.. వైవీయూ వైస్ చాన్సలర్ సూర్యకళావతిని ఇన్చార్జి వీసీగా నియమించారు. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌యూ వీసీ పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, చలమారెడ్డిపల్లె వద్ద 134 ఎకరాల్లో రూ.458 కోట్లతో నిర్మించనున్న ఈ విశ్వవిద్యాలయానికి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జూలై 7న భూమి పూజ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. -
'పంట తల్లీ'.. ఎలా ఉన్నావ్!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, శాస్త్రవేత్తలు పల్లెబాట పట్టారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను వేదికగా చేసుకుని ఉద్యాన రైతులతో మమేకమవుతున్నారు. ప్రయోగ శాలల్లో చేసిన పరిశోధనల ఫలితాలను సాధ్యమైనంత త్వరగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ద్వారా సాగులో సత్ఫలితాలను సాధించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా ‘మన గ్రామం.. మన విశ్వవిద్యాలయం’ కార్యక్రమానికి ఉద్యాన వర్సిటీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఉద్యాన అధికారులతో కలిసి వారంలో ఒకరోజు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి పంటల యోగక్షేమాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వీసీ టు విలేజ్ మన గ్రామం.. మన విశ్వవిద్యాలయం కార్యక్రమానికే పరిమితం కాకుండా వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.జానకిరామ్ సైతం ‘వీసీ టు విలేజ్’ పేరిట పల్లెబాట నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నారు. రైతులకు మేలు జరగాలంటే ఏ తరహా పరిశోధనలు, ఏ స్థాయిలో చేయాలనే అంశంపై శాస్త్రవేత్తలకు సైతం ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలుగుతోంది. గడచిన ఏడు నెలల్లో 22 గ్రామాల్లో ఈ కార్యక్రమాల్ని నిర్వహించారు. 42 గ్రామాలను దత్తత తీసుకున్న వర్శిటీ ఉద్యాన వర్సిటీకి అనుబంధంగా 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, 19 ఉద్యాన పరిశోధనా కేంద్రాలు, 4 ఉద్యాన, 4 పాలిటెక్నిక్, 11 అనుబంధ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఒక్కో గ్రామం చొప్పున మొత్తం 42 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లో ఉద్యాన పంటల సాగులో యూనివర్సిటీ కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా వ్యవసాయ, ఉద్యాన సహాయకుల సహకారంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్త రకం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే దిశగా సహకారం అందిస్తున్నారు. కావాల్సిన విత్తనాలను సమకూర్చడంతో పాటు సాగులో అవసరమైన మెళకువలపైనా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దత్తత గ్రామాల రైతులతో ప్రతి బుధవారం యూనివర్సిటీ నుంచే వెబినార్ ద్వారా సమావేశమవుతూ సూచనలు, సలహాలు అందిస్తున్నారు. రైతులకు మరింత మేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల మేరకు పల్లెబాట పట్టాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న వీసీ టు విలేజ్, మన గ్రామం.. మన విశ్వవిద్యాలయం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వారానికో గ్రామాన్ని సందర్శిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలెన్నో మా దృష్టికి వస్తున్నాయి. దీనివల్ల మరింత లోతైన పరిశోధనలు చేసేందుకు అవకాశం కలుగుతోంది. – డాక్టర్ టి.జానకిరామ్, వీసీ, ఉద్యాన వర్సిటీ చాలా ప్రయోజనకరంగా ఉంది మన ఊరు–మన విశ్వవిద్యాలయం కార్యక్రమంలో భాగంగా మా గ్రామాన్ని గతేడాది గాంధీ జయంతి రోజున కేవీకే శాస్త్రవేత్తలు దత్తత తీసుకున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం, కోళ్ల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. జీడిమామిడి రైతులను పందిరి మామిడి పరిశోధనా కేంద్రానికి తీసుకెళ్లి జీడిమామిడి పిక్కల ప్రొసెసింగ్ ఎలా చేయాలో వివరించారు. తాటికల్లుతో బెల్లం ఎలా తయారు చేయాలో చెప్పారు. కూరగాయ, పెరటి తోటల విత్తనాలు ఇచ్చారు. ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంది – కోతం మోహనరావు, పండుగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా -
వీసీ పీఠం దక్కేదెవరికో..?
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఉపకులపతి నియామకం వ్యవహారం వేగం పుంజుకోనుంది. గడిచిన మూడు సంవత్సరాలుగా ఇన్చార్జి వీసీగా ఉద్యాన శాఖ కమిషనర్‌గా చిరంజీవి చౌదరి పనిచేస్తున్నారు. డాక్టర్ బీఎంసీ రెడ్డి వీసీగా 2017లో ఉద్యోగ విరమణ చేశారు. ఆతర్వాత పూర్తిస్థాయి వీసీ నియామకం చేపట్టలేదు. ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో సెర్చ్ కమిటీ ముగ్గురు సభ్యులతో ఏర్పాటైంది. ఈ కమిటీ ఈనెల 27న వీసీ నియామక ప్రక్రియ చేపట్టేందుకు కూర్చోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ మహోపాధ్యాయ , మరొక నిపుణుడుతో కలిసి ముగ్గురు సభ్యుల సెర్చ్ కమిటీ ఏర్పాటైంది. కోర్టు జోక్యంతో నోటిఫికేషన్ విడుదల వాస్తవానికి వీసీ నియామకపు ప్రక్రియ ఎన్నికలకు ముందు పూర్తికావాల్సి ఉంది. సాంకేతిక కారణాలలో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇన్చార్జి వీసీ పర్యవేక్షణలో అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేయడం సరికాదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వీసీ నియామకం విషయంలో హైకోర్టు జోక్యంతో సెర్చ్ కమిటీ ఏర్పాటైంది. వీసీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన వారు దరఖాస్తు చేశారు. ఎవరిని వీసీగా నియమించాలనే విషయాలు చర్చించడానికి సెర్చ్ కమిటీ ఈ నెల 27న సమావేశం కానుందని అధికారిక వర్గాల సమాచారం 31 మంది ఆశావహులు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ వీసీ నియామకం విషయంలో 31 మంది ఆశావహులు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. తొలి నోటిఫికేషన్లో 21 మంది, మలి నోటిఫికేషన్లో పది మంది వీసీ కోసం దరఖాస్తులు అందచేశారని అధికారులు తెలిపారు. ఈ 31 మందిలో ఐసీఏఆర్ నేపథ్యం కలిగిన వారు 20 మంది ఉండగా, మిగిలిన 11 మంది ఉద్యాన వర్సిటీలో అధికారులుగా పనిచేస్తున్నవారు. గతంలో పనిచేసిన వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. అర్హతలు, సేవ, అనుభవం ప్రామాణికాలుగా వీసీ నియామక ప్రక్రియ జరగనుంది. సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఒకరిని వీసీగా నియమించనున్నారు. 27న సమావేశం వీసీ నియామక ప్రక్రియ తంతును పూర్తి చేయడానికి ఈ నెల 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి సెర్చ్ కమిటీలోని మరో ఇద్దరు సభ్యులు సమావేశం కానున్నారు. సమావేశంలో దాదాపుగా వీసీ ఎవరనే విషయం తేల్చనున్నారు.సెర్చ్ కమిటీ తేల్చి ప్రతిపాదించిన పేర్లలో ఒకరిని వీసీ పీఠం వరించనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి పూర్తిస్థాయి వీసీ వచ్చే అవకాశం ఉంది. -
విశిష్ట రక్షిత సాగు ప్రాజెక్టు ప్రారంభం
అందుబాటులోకి రానున్న సేవలు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సాక్షి, అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో దేశంలో రెండవ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన విశిష్ట రక్షిత సాగు (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) ప్రాజెక్టును శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మంత్రికి పూర్ణకుంభంతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లాంఛనంగా ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి పుల్లారావు, వర్సిటి పాలకమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతరులకు ఉద్యానవర్సిటి అధికారులు ప్రాజెక్టులో జరిగే ప్రక్రియల గురించి వివరించారు. రైతు విత్తనం తీసుకొస్తే 30 నుంచి 35 రోజుల వ్యవధిలో మొక్కగా చేసి రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా మొక్కలను అందించవచ్చని వర్సిటి ఉపకులపతి డాక్టర్ బిఎంసిరెడ్డి మంత్రికి చెప్పారు. ఆటోమెషీన్ ప్రక్రియ, క్వాయర్ బెల్ట్ పనితీరు, నీరు ఎరువులు, యాజమాన్య పద్దతులు గురించి వివరించారు. కేవలం 40పైసలు వెచ్చిస్తే మిరప మొక్కను ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు అందించవచ్చని తెలిపారు. విశాఖ జిల్లాలో ప్రొటెక్టెడ్ కల్టీవేషన్ తరహాలో రూపొందించిన ఆర్కిడ్స్ ప్రాజెక్టులోని కొన్నింటిని ప్రాజెక్టులో ప్రదర్శనగా ఉంచారు. వీటి గురించి వి.సి మంత్రికి వివరించారు. అనంతరం క్యాప్సికమ్, చెర్రీ టమాట మొక్కలను మంత్రి పరిశీలించారు. ప్రాజెక్టులో వాతావరణ నియంత్రణ తదితర విషయాల గురించి మంత్రికి యూనివర్సిటి అధికారులు వివరించారు. రైతులకు ఉపయుక్తంగా ఉండే ఈ ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి ఉద్యానవర్సిటి అధికారులను ఆదేశించారు. రైతులకు అవగాహన కలిగితేనే ఇలాంటి ప్రాజెక్టుల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, గూడెం ఎంపిపి గన్నమని దొరబాబు, ఏఎంసి చైర్మన్లు పాతూరి రామ్‌ప్రసాద్ చౌదరి, పాతూరి విజయ్‌కుమార్, శాస్త్రవేత్తలు, పాలకమండలి సభ్యులు సత్యనారాయణ, శివరామకృష్ణ, బోణం నాగేశ్వరరావు, వర్సిటి విస్తరణ సంచాలకులు, ప్రాజెక్టు ఇన్ఛార్జ్ ఆర్‌విఎస్‌కె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.