డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ముఖద్వారం
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఉపకులపతి నియామకం వ్యవహారం వేగం పుంజుకోనుంది. గడిచిన మూడు సంవత్సరాలుగా ఇన్‌చార్జి వీసీగా ఉద్యాన శాఖ కమిషనర్‌గా చిరంజీవి చౌదరి పనిచేస్తున్నారు. డాక్టర్ బీఎంసీ రెడ్డి వీసీగా 2017లో ఉద్యోగ విరమణ చేశారు. ఆతర్వాత పూర్తిస్థాయి వీసీ నియామకం చేపట్టలేదు. ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో సెర్చ్ కమిటీ ముగ్గురు సభ్యులతో ఏర్పాటైంది. ఈ కమిటీ ఈనెల 27న వీసీ నియామక ప్రక్రియ చేపట్టేందుకు కూర్చోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ మహోపాధ్యాయ , మరొక నిపుణుడుతో కలిసి ముగ్గురు సభ్యుల సెర్చ్ కమిటీ ఏర్పాటైంది.
కోర్టు జోక్యంతో నోటిఫికేషన్ విడుదల
వాస్తవానికి వీసీ నియామకపు ప్రక్రియ ఎన్నికలకు ముందు పూర్తికావాల్సి ఉంది. సాంకేతిక కారణాలలో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇన్‌చార్జి వీసీ పర్యవేక్షణలో అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేయడం సరికాదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వీసీ నియామకం విషయంలో హైకోర్టు జోక్యంతో సెర్చ్ కమిటీ ఏర్పాటైంది. వీసీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన వారు దరఖాస్తు చేశారు. ఎవరిని వీసీగా నియమించాలనే విషయాలు చర్చించడానికి సెర్చ్ కమిటీ ఈ నెల 27న సమావేశం కానుందని అధికారిక వర్గాల సమాచారం
31 మంది ఆశావహులు
డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ వీసీ నియామకం విషయంలో 31 మంది ఆశావహులు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. తొలి నోటిఫికేషన్‌లో 21 మంది, మలి నోటిఫికేషన్‌లో పది మంది వీసీ కోసం దరఖాస్తులు అందచేశారని అధికారులు తెలిపారు. ఈ 31 మందిలో ఐసీఏఆర్ నేపథ్యం కలిగిన వారు 20 మంది ఉండగా, మిగిలిన 11 మంది ఉద్యాన వర్సిటీలో అధికారులుగా పనిచేస్తున్నవారు. గతంలో పనిచేసిన వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. అర్హతలు, సేవ, అనుభవం ప్రామాణికాలుగా వీసీ నియామక ప్రక్రియ జరగనుంది. సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఒకరిని వీసీగా నియమించనున్నారు.
27న సమావేశం
వీసీ నియామక ప్రక్రియ తంతును పూర్తి చేయడానికి ఈ నెల 27న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి సెర్చ్ కమిటీలోని మరో ఇద్దరు సభ్యులు సమావేశం కానున్నారు. సమావేశంలో దాదాపుగా వీసీ ఎవరనే విషయం తేల్చనున్నారు.సెర్చ్ కమిటీ తేల్చి ప్రతిపాదించిన పేర్లలో ఒకరిని వీసీ పీఠం వరించనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి పూర్తిస్థాయి వీసీ వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment