కొత్త కార్డులు హుళక్కే!
♦ ఇప్పటికే పూర్తయిన రేషన్‌కార్డుల ముద్రణ
♦ కొత్త జిల్లాల ఏర్పాటుతో గందరగోళం
♦ జిల్లాల పేర్లు మారడంతో నిలిచిన పంపిణీ
♦ తలపట్టుకుంటున్న పౌరసరఫరాల శాఖ
ఎన్నాళ్లుగానో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. వాస్తవానికి ఈ నెలలోనే కొత్తకార్డులు వస్తాయని భావించారు. కానీ, వీటిపై కొత్త జిల్లాల ప్రభావం పడింది. జిల్లా, మండలాల పేరు మార్చాల్సి ఉండడంతో వాటి పంపిణీని నిలిపివేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్త రేషన్ కార్డుల భాగ్యం లబ్ధిదారులకు ఇప్పట్లో కలిగే అవకాశం లేదు. వాస్తవానికి ఈ నెల మొదటివారంలో లబ్ధిదారులకు తెలంగాణ లోగోతో ఉన్న కొత్త ఆహార భద్రత కార్డులు అందించాల్సి ఉంది. పౌరసరఫరాల శాఖ సైతం ఈ మేరకు టెండర్లు పిలిచి ముద్రణ ప్రక్రియలో వేగం పెంచింది. దీంతో చర్యలకు దిగిన కాంట్రాక్టర్లు కొత్తగా కేటాయించే కార్డులను ముద్రించి పౌరసరఫరాలశాఖకు అప్పగించారు. సెప్టెంబర్ మొదటివారంలో వీటిని పంపిణీ చేయాలని యంత్రాంగం భావించింది. తాజాగా కొత్త జిల్లాల ప్రక్రియ తెరపైకి రావడం.. ప్రభుత్వం కూడా జిల్లాల ఏర్పాటును యుద్దప్రాతిపదకన భావిస్తూ చర్యలు వేగిరం చేయడంతో కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది.
వృథా ప్రయాసేనా...?
జిల్లాలో 11.65 లక్షల తెల్లరేషన్ కార్డులున్నాయి. క్షేత్రస్థాయిలో పౌరసరఫరాల శాఖ సర్వేలు నిర్వహిస్తూ అర్హతలేని కార్డుదారులపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నాలుగు చక్రాల వాహనాలు, రూ.వేలల్లో ఆస్తిపన్ను చెల్లించే వారి కార్డులను రద్దు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తొలివిడత సర్వే పూర్తిచేసిన పౌరసరఫరాల శాఖ 1.10లక్షల కార్డులు అర్హత లేనివిగా తేల్చింది. వీటిని రద్దు చేసే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా... అర్హత ఉన్న కార్డుదారులకు కొత్తగా తెలంగాణ ప్రభుత్వ చిహ్నం ఉన్న కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన సర్కారు వాటిని ముద్రణకు పంపింది.
ఈ క్రమంలో గత నెలాఖర్లో ఈ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కొత్త కార్డులు చేరాయి. ఇందుకు సంబంధించి దాదాపు రూ.2.5 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ హామీ ప్రకారం సెప్టెంబర్ మొదటివారంలో వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడంతో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏకంగా జిల్లా పేరు, మండలాల పేర్లు మారే అవకాశం ఉండడంతో వాటి పంపిణీని యంత్రాంగం తాత్కాలికంగా వాయిదా వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిన తర్వాత వాటికి కాస్త మెరుగులు దిద్దాలా..? లేక తిరిగి కొత్త వాటిని ముద్రించి ఇవ్వాలా అనే అంశాన్ని పౌరసరఫరాల శాఖ తేల్చుకోలేకపోతోంది. ఈ క్రమంలో లబ్ధిదారులకు కొత్తకార్డులు ఇప్పట్లో లేవనే చెప్పొచ్చు.