సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఎట్టకేలకు ముహుర్తం ఖరారు చేసింది. ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు జరిగే రచ్చబండ కార్యక్రమంలో రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఏళ్ల తరబడి కార్డుల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి రాష్ట్ర సర్కారు ఫుల్‌స్టాప్ పెట్టింది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ సర్వే పేరిట అడ్డగోలుగా కార్డులను ఏరివేసింది. సర్వేలో శాస్త్రీయత లోపించడంతో అర్హుల కార్డులకు కూడా కోత పడింది. ఆ తర్వాత ఆధార్ కార్డుల జారీతో ప్రభుత్వం కొత్త కార్డుల జోలికి వెళ్లలేదు. ఈ క్రమంలోనాలుగేళ్ల నుంచి నూతన కార్డుల జారీని నిలిపివేయడంతో జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి.
2వ విడత రచ్చబండ లో జిల్లావ్యాప్తంగా 1,32, 340 మంది కొత్త కార్డులకు అర్జీలు పెట్టుకోగా, వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన యంత్రాంగం 74, 198 మాత్రమే అర్హమైనవిగా తేల్చింది. అదే సమయంలో రచ్చబండ తర్వాత వివిధ రూపాల్లో వచ్చిన 29, 572 అర్జీలలో స్పష్టతలేని ఐదు వేల దరఖాస్తులను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుమారు లక్ష మంది దరఖాస్తుదారులు కొత్త కార్డుల కోసం వేచిచూస్తున్నారు. కార్డుల జారీకి అర్హులుగా తేల్చిన లబ్ధిదారుల వివరాలను పూర్తిగా కంప్యూటరీకరించిన పౌరసరఫరాల శాఖ.. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే వీటిని పంపిణీకి తెరలేపేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారంలో జరిగే రచ్చబండలో వీటిని లబ్ధిదారులకు అందజేయాలని భావిస్తోంది.
40వేల మందికి సొంతింటి భాగ్యం!
ఇక ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కూడా మార్గం సుగమమైంది. వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావిస్తున్న అధికార పార్టీ ఎన్నికల వేళ కొత్త ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపుతోంది. రచ్చబండ 1, 2వ విడతలలో వచ్చిన దరఖాస్తులను వడపోసిన గృహనిర్మాణ శాఖ.. వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరిచింది. జిల్లావ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాల్లో 77వేల మంది ఇందిరమ్మ గృహాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఈ(హౌసింగ్) నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేసింది. వీటన్నింటినీ కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేసిన యంత్రాంగం.. వీటిలో దాదాపు 37వేల మందికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోటా (జీఓ 33, 44) కింద మోక్షం కలిగించింది.
జిల్లాలోని తొమ్మిది గ్రామీణ నియోజకవర్గాలకు రెండు వేల చొప్పున ఇళ్లను మంజూరు చేసిన సర్కారు.. రెండు దఫాల్లో 36వేల ఇళ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేసింది. అలాగే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన విచక్షణాధికారంతో మేడ్చల్‌కు రెండు వేల ఇళ్లు, మహేశ్వరం సెగ్మెంట్‌కు వేయి ఇళ్లను అదనంగా మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో పెండింగ్ జాబితా సగానికి తగ్గింది. కేవలం 40వేల మంది దరఖాస్తుదారులు మాత్రమే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల ‘క్యూ’లో ఉన్నారు. వీరందరికీ ఈసారి రచ్చబండలో సొంతింటి భాగ్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా గృహానిర్మాణశాఖ కూడా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది.
ఇందిరమ్మ ఇళ్లు,రేషన్‌కార్డులకు ఎట్టకేలకు మోక్షం?
Published Thu, Nov 7 2013 1:06 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement