కమల దళంలో నయా జోష్‌! | new refreshment telangana bjp party | Sakshi
Sakshi News home page

కమల దళంలో నయా జోష్‌!

Published Sun, Aug 7 2016 11:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కమల దళంలో నయా జోష్‌! - Sakshi

కమల దళంలో నయా జోష్‌!

సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ నగర  బీజేపీ శ్రేణులు, అభిమానుల్లో కొత్త జోష్‌ను నింపింది. ఫతేమైదాన్‌(ఎల్‌బీస్టేడియం)లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన పార్టీ మహా సమ్మేళనానికి అంచనాలకు మించి క్యాడర్, అభిమానులు హాజరు కావటం మోదీ సహా ముఖ్య నేతల్లోనూ కొత్త ఉత్సాహం నింపింది. ముందుగా నిర్ణయించిన సమయం కంటే మోదీ ఎక్కువ సేపు ప్రసంగించారు.

స్టేడియం పరిమితికి మించి జనాలు రావటంతో భద్రతా కారణాల దృష్ట్యా వేలాది మందిని లోపలికి అనుమతించలేదు. అయినా వారు స్టేడియం వెలుపలి నుండే మోదీ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. తక్కువ వ్యవధిలోనే నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆశించిన జన స్పందన కనిపించటం, ముఖ్యంగా భారీ ఎత్తున యువకులు హాజరుకావటం పార్టీ నేతల్లో పూర్తి సంతృప్తిని నింపింది.  

తిరంగా యాత్రతో కొత్త ఎజెండా
హైదరాబాద్‌ స్టేట్‌ భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్‌ 17న అధికారిక ఉత్సవం నిర్వహించే కొత్త ఎజెండాతో ‘తిరంగా యాత్ర’కు మోదీ సభావేదిక నుండి పిలుపునిచ్చినప్పుడు సభికుల నుండి భారీ స్పందన వ్యక్తమైంది. నగర పాలక మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచిన నేపథ్యంలో తిరంగా యాత్రతో బీజేపీ మళ్లీ పటిష్టపునాదులు, అభిమానులను సంపాదించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని సీనియర్‌ నేతలు వ్యక్తం చేశారు.

యాత్ర వివాదం అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ఎంఐఎం పార్టీకి ఒకింత చికాకు కలి గించే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ నగర పార్టీ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ మోదీ పాలన తెలంగాణాలోనూ రావాలన్న ఆకాంక్ష, సభకు హాజరైన ప్రతి ఒక్కరిలో వ్యక్తమైందని, ఆ దిశగా పార్టీ కార్యాచరణ అమలు చేస్తుందని చెప్పారు. సభ పూర్తిగా విజయవంతమైందని, హాజరైన కా ర్యకర్తలు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

దారులన్నీ అటువైపే...
హిమాయత్‌నగర్‌/గన్‌ఫౌండ్రి/అబిడ్స్‌: లాల్‌బహుదూర్‌ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ మహాసమ్మేళనానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాల నుంచి కార్యకర్తలు బస్సులు, జీపులు, లారీలు, ఇతర వాహనాల ద్వారా తరలివచ్చారు. బస్సులను నిజాం కాలేజ్‌లో పార్క్‌ చేయగా కార్యకర్తలను గేట్‌ ఎఫ్‌–1, గేట్‌ ఎఫ్‌–2ల నుంచి లోపలకి అనుమతించారు. వందల సంఖ్యలో బస్సులు, కారులు, ద్విచక్రవాహనాలు రావడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ట్రాఫిక్‌కు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణకు నమస్కారాలు.. అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించడంతో సభ హోరెత్తిపోయింది.

► పార్టీ కార్యకర్తలు, శ్రేణులు తమ వెంట తెచ్చుకున్న పెన్నులు, వాటర్‌ బాటిళ్లు, గుట్కా ప్కాకెట్లు, సిగరెట్లు బయటనే వేసి లోపలకి వెళ్లాలంటూ పోలీసులు చెప్పడంతొ కొందరు వాగ్వాదానికి దిగారు.
► వేల సంఖ్యలో గుట్కాలు, సిగిరెట్టు పెట్టెలు, వాటర్‌బాటిళ్లు, జెండా కర్రలు బయట గుట్టలు గుట్టలుగా పడేశారు. వీటన్నిటిని ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ సిబ్బంది తొలగించారు.
►   హ్యాండ్‌ బ్యాగులతో వచ్చిన మహిళలను లోపలికి అనుమంతించలేదు.
►    వేలాది మంది బయటనే వేచి ఉండాల్సి వచ్చింది...
►    మధ్యాహ్నం రెండు గంటల నుంచే స్టేడియంకు ప్రజానీకం రావడం ప్రారంభమయింది. జనంతాకిడి సాయంత్రం 5 గంటలకు ఎక్కువయింది. మోదీ ప్రసంగం ముగిసేవరకు వేల సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు వస్తూనే ఉన్నారు.
►   కొంతమంది యువకులు మోడీ మాస్క్‌లతో, జాతీయ జెండాలతో ర్యాలీలుగా తరలివచ్చారు.
►    జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులకు పార్కింగ్‌ సదుపాయంపై సరైన సమాచారం లేక కొంత ఇబ్బందిపడ్డారు.
►    వీఐపీ పాస్‌లు ఉన్నప్పటికీ పోలీసులు అనుమతించకపోవడంతో కొంతమంది రాష్ట్ర నాయకులు వాగ్వాదానికి దిగారు.
►    బయటే వేచి ఉన్న కార్యకర్తలకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు.
►   ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథాను వేదికపైకి ఆహ్వానించలేదంటూ కొందరు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజాసింగ్‌ జిందాబాద్‌..జై శ్రీరామ్‌ అంటూ నినదించారు.
బేగంపేటలో ఘన స్వాగతం...
సనత్‌నగర్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌లో సాదర స్వాగతం లభించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధానికి గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావులు అపూర్వ స్వాగతం పలికారు. వారితో పాటు  కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, స్పీకర్‌ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్, డీజీపీ అనురాగ్‌శర్మ, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్,

కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు, నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, తీగల కృష్ణారెడ్డి, రాజాసింగ్, కిషన్‌రెడ్డిలు పూలబొకేలు, శాలువాలతో మోదీని సత్కరించారు. అక్కడ 16 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్‌లో గడిపిన ఆయన..అనంతరం అదే విమానంలో గజ్వేల్‌కు పయనమై వెళ్ళారు. గజ్వేల్‌లో సభ ముగించుకుని తిరిగి 5.20 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ప్రధానమంత్రి వెంట సీఎం కేసీఆర్, పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా కాన్వాయ్‌లో ఎల్బీ స్టేడియం వైపు సాగిపోయారు. అక్కడ ‘మోదీతో మనం–మహా సమ్మేళనం’లో ప్రసంగించిన ఆయన తిరిగి 7.55కు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఢిల్లీకి తిరిగి వెళ్ళారు.

అష్టదిగ్బంధంలో బేగంపేట్‌ రహదారులు
ప్రధానమంత్రి రాకను పురస్కరించుకుని అడుగడుగునా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అన్నిదారులను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.  ఎయిర్‌పోర్ట్‌ వైపు వెళ్ళే రహదారులపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సాయంత్రం 5.20 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారనగానే 5 గంటల నుంచే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఎయిర్‌పోర్ట్‌కు రెండు కిలోమీటర్ల వరకు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కేవలం వీవీఐపీ, వీఐపీలను మాత్రమే ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement