నెలన్నర క్రితం ఒక్కటైన చోటే..
- రోడ్డు ప్రమాదంలో నవ దంపతుల దుర్మరణం
- నర్సు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళుతుండగా ఘటన
భూత్పూర్ / వనపర్తి : నిండునూరేళ్లు కలిసి దాంపత్య జీవితం గడపాలని నెలన్నర క్రితం ఒక్కటైన ఆ జంట అంతలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. ఉద్యో గం కోసం యత్నిస్తుండగా విధి మాత్రం వారిద్దరినీ మృత్యుఒడికి చేర్చింది.. ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి పట్టణంలోని వెంగళరావునగర్‌కు చెందిన కాటి రవికుమార్ (25)కు తెలకపల్లి మండ లం చిన్నముద్దునూరు వాసి శ్రీలత (21) తో గత మార్చి 26న పెళ్లి జరిగింది. భర్త స్థానికంగా ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా, భార్య ప్రైవేటు హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్సుగా పని చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లిన రవికుమార్ భార్యకు వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలని కోరాడు. దీంతో జిల్లా కేంద్రానికి శుక్రవారం ఉదయం బైక్‌పై బయలుదేరారు.
అమిస్తాపూర్ శివారులోని గణపతి దేవాలయం సమీపంలోకి చేరుకోగానే గొర్రెలు, మేకల లోడ్‌తో బీదర్ నుంచి చెన్నైకి వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న డీసీఎంను తప్పించబోయి అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే ఆమెను 108 అంబులెన్‌సలో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందింది.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ అశోక్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. 45 రోజుల క్రితం ఆనందంగా ఒక్కటైన చోటే భార్యాభర్తలిద్దరూ విగత జీవులుగా ఉండటం చూసిన కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. భాదిత కుటుంబాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మున్సిపల్ మాజీ చైర్మన్ బి.లక్ష్మయ్య తదితరులు పరామర్శించారు.