న్యూజిలాండ్ శుభారంభం
– ఛేజింగ్‌లో బోల్తాపడ్డ ఆర్డీటీ జట్టు
అనంతపురం న్యూసిటీ: సన్నాహక క్రికెట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం ఉదయం హట్‌హాక్స్, ఆర్డీటీ జట్ల మధ్య టీ–20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. గరెత్ సెవెరిన్ 50 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్ ల్యూక్‌ఉడ్‌కాక్ 23 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. ఆర్డీటీ బౌలర్లలో మస్తాన్‌ఖాన్ 3/31, సాయికార్తీక్, గిరినాథ్‌రెడ్డి తలా వికెట్ తీసుకున్నారు.
బోల్తాపడ్డ ఆర్డీటీ జట్టు
అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్డీటీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేసింది. గిరినాథ్‌రెడ్డి (37), సాయికార్తీక్‌రావు (34), షాబుద్దీన్ (34) మాత్రమే రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మెక్ ఇవాన్ 2/27, స్మిత్, జెస్సీ, ఉడ్‌కాక్, గ్రీన్‌ఉడ్ తలా వికెట్ తీసుకున్నారు. దీంతో న్యూజిల్యాండ్ హట్‌హాక్స్ జట్టు 29 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.
ముందుగా ఆర్డీటీ క్రికెట్ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా హాజరైన ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాలఫెర్రర్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్థాయిలో క్రీడాకారులు కలర్ దుస్తులతో పోటీల్లో పాల్గొన్నారు. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల సభ్యులు తమ దేశగీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు పగడాల మల్లికార్జున, జొన్నా జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.