– ప్రచారం కోసం పదివేల పోస్టర్లు
– వ్యాస్ ఆడిటోరియంలో ఆవిష్కరణ
– ప్రజాచైతన్యం కోసం త్వరలో పాటపాడనున్న ఎస్పీ ఆకె రవికృష్ణ
– సీసీ టీవీ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రజంటేషన్
కర్నూలు
– ఆగస్టు 17వ తేదీ పాతబస్తీకి చెందిన శ్యామలమ్మ బంగారునగలు రిపేరు చేసుకునేందుకు కాలి నడకన వెళ్తుండగా, సూపర్ స్వీట్స్ పమీపంలో పర్సు జారిపడి పోయింది. అదేమార్గం గుండా వెళ్తున్న ఒక వ్యక్తి పర్సు గుర్తించి, తెరిచి చూడగా అందులో బంగారు నగలు ఉన్నాయి. అతను జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు. ఆలస్యంగా తేరుకున్న బాధితురాలు తిరిగి అదే మార్గం గుండా గాలించినా పర్సు దొరకలేదు. ఈ మేరకు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా,అదే మార్గంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఉన్న సీసీ పుటేజీలో నిందితున్ని గుర్తించి రెండున్నర్ర రోజుల వ్యవధిలోనే బంగారు నగలును రికవరీ చేశారు.
– జనవరి 18వ తేదీన సరస్వతి నగర్‌లో ఉదయం 10.30 గంటల సమయంలో ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి నడుచుకుంటూ విధులకు వెళ్తుండగా, దార్వాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు మోటర్ సైకిల్‌పై ఆమెను సమీపించి, రెండు తులాల బంగారు నగలు లాక్కొని ఉడాయించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, సమీపంలో బాలాజి హాస్టల్‌లో ఉన్న సీసీ పుటేజీ ద్వారా మూడో పట్టణ పోలీసులు.. నిందితులు సలీమ్, మహ్మద్ అలీగా గుర్తించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని, నేర నియంత్రణే కాకుండా, దర్యాప్తులోనూ ఆలస్యం జరగకుండా ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ ఆకె రవికృష్ణ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీసీ కెమెరాల ఆవశ్యకతను గురించి వివరించారు. బంగారు నగలు పోగొట్టుకున్న పాతబస్తీ మహిళ శ్యామలను అక్కడికి రప్పించి ఆమె అనుభవాన్ని చెప్పించారు. మహిళల భద్రత, సమాజ రక్షణ కోసం సీసీ టీవీలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉద్యమ రూపంలో తీసుకెళ్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
ప్రచారం కోసం పదివేల పోస్టర్లు
సీసీ టీవీల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దాదాపు పదివేల వాల్ పోస్టర్లను సిద్ధం చేశారు. నేర రహిత సమాజ స్థాపన కోసం పోలీసులు తీసుకునే చర్యలకు జిల్లా ప్రజలు సహకరించాలంటూ పోస్టర్లలో ముద్రించారు. కళాశాల, స్కూల్ బస్సులు, ఆటోలు, జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే ప్రాంతాల్లో వాటిని అతికించి అవగాహన కల్పించేందుకు కార్యచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఎస్పీ స్వయంగా ఆటోలకు వాల్‌పోస్టర్లను అతికించి, కింది స్థాయి సిబ్బందికి ఆ బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్‌డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, రామచంద్ర, సీఐలు కష్ణయ్య, ములకన్న, నాగరాజురావు, నాగరాజు యాదవ్, మధుసూదన్‌రావు, ఆర్‌ఐ జార్జ్, ఎస్‌ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
సీసీటీవీల ఏర్పాటుపై త్వరలో పాప్‌గీతం
నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెయ్... చెయ్... నేత్రదానం అంటూ పాప్‌సాంగ్ పాడిన ఎస్పీ ఆకె రవికష్ణ తనలోని కళను మరోసారి ఆవిష్కరించేందుకు ఆల్బమ్‌ను రూపొందిస్తున్నారు. పెట్టు.. పెట్టు.. సీసీ టీవీ పెట్టు.. తల్లికి.. చెల్లికి.. సమాజ రక్షణ కోసం.. సీసీ టీవీ పెట్టు... అంటూ త్వరలోనే సీసీ టీవీలపై పాప్‌గీతం పాడి వీడియో, ఆడియో రూపంలో విడుదల చేయనున్నారు. వ్యాపార వాణిజ్య వర్గాలు, అపార్టుమెంటు వాసులు, శివారు కాలనీల ప్రజలకు అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఎస్పీ స్వీయ రచన చేశారు. పాతబస్తీకి చెందిన ముగ్గురు యువకులు ఈ పాప్‌గీతానికి సంగీతం సమకూర్చనున్నారు.