
'9 నెలలు ఆగలేడా'
విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో ఇవ్వడానికి అభ్యంతరం లేదని, కానీ ఆ జీవో నిలబడదని చెప్పారు. మంత్రి నారాయణతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ముద్రగడ పద్మనాభం కాపులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆయన మాటలు నమ్మొద్దని కాపులను కోరారు. ఎన్నికల్లో హామీయిచ్చిన మేరకు కార్పొరేషన్, కమిషన్ వేశామని చెప్పారు. రిజర్వేషన్ల అమలుకు 9 నెలలు గడువు పెట్టామని, అప్పటివరకు వేచిచూడాలని కదా అన్నారు. 9 నెలలు ఆగలేడా అని ఆవేశంగా ప్రశ్నించారు.
కాపు ఐక్య గర్జన సభకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరించామని చెప్పారు. ముద్రగడ కాపులను రెచ్చగొట్టి హింసను ప్రోత్సహించారని ఆరోపించారు. అయినా ప్రభుత్వం ఎంతో సంయమనంతో వ్యవహరించిందన్నారు. కాపుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 100 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. కాపులకు చంద్రబాబు ఎంతో చేశారని, తనను డిప్యూటీ సీఎం చేశారని తెలిపారు.