గుంటూరు : ఆసుపత్రిలో చికిత్సపొందేందుకు వచ్చిన ఓ బాలుడు క్యాంటిన్ వద్దకు వెళ్లి అదృశ్యమయ్యాడు. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పొన్నూరు మండలం నండూరుకు చెందిన షేక్‌బాజి తొమ్మిదేళ్ల కుమారుడు షాహిద్‌ను ఈనెల 15వ తేదీన చికిత్స కోసం 108వ నంబరు గదిలోని పిల్లల వార్డులో అడ్మిట్ చేశారు. బాలుడి ముక్కు నుంచి అప్పుడప్పుడూ రక్తం పడుతుండడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
షాహిద్ బుధవారం టిఫిన్ చేసేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రిలోని క్యాంటిన్ వద్దకు వెళ్లాడు. కుటుంబసభ్యులు టిఫిన్ చేస్తున్న సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని చెప్పి క్యాంటిన్ నుంచి బయటకు వచ్చాడు. ఎంతసేపటికీ బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో కంగారు మొదలైంది.
కొంతసేపు వేచి చూసిన తల్లిదండ్రులు వార్డులో ఉన్నాడేమోనని వెతికారు. అక్కడ కనిపించకపోయేసరికి ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్ యనమల రమేష్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలలో పిల్లవాడు ఎటువైపు వెళ్లాడనే విషయాన్ని పరిశీలించారు. అయినా జాడ తెలియలేదు. అనంతరం ఆసుపత్రి అధికారులు కొత్తపేట పోలీసులకు బాలుడు అదృశ్యంపై ఫిర్యాదు చేశారు.