తిరుమల లడ్డూ ధర యథాతథం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూ ధరను పెంచడం లేదు. ఈ విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 2,678 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. శ్రీవారి వైభవోత్సవాలను 8 రోజుల నుంచి 5 రోజులకు కుదించారు. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి బంగారు తాపడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో అమవాస్య నాడు హనుమంత వాహన సేవ నిర్వహించాలని నిర్ణయించారు.
అలాగే.. శనగపప్పు, ఏలకులు, నెయ్యి, పెసరపప్పు, చింతపండు కొనుగోళ్లకు ఆమోదం తెలిపారు. రూ. 3.30 కోట్లతో రెండో ఘాట్ రోడ్డు మరమ్మత్తులకు ఆమోదం లభించింది. ఆర్జిత సేవ, అద్దె గదులపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అలాగే తిరుమలలో రూ. 4.5 కోట్లతో ఆక్టోపస్ భద్రతాదళానికి భవన నిర్మాణం చేపట్టేందుకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది.