Laddu price
-
ధరలు పెంపు, యాదాద్రిలో మరింత ప్రియం కానున్న స్వామివారి లడ్డూ ప్రసాదం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు జరిపించే శ్రీస్వామి వారి కైంకర్యాలు, శాశ్వత పూజలు, భోగాలతో పాటు ప్రసాదం ధరలను పెంచుతున్నట్లు ఈవో గీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి దేవస్థానంతో పాటు కొండపై గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి, అనుబంధ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సైతం ధరలు పెంచినట్లు తెలిపారు. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. యాదాద్రిలో పెంచిన ధరలివి నిజాభిషేకం (ఇద్దరికి) గతంలో రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.800 చేశారు. ఒక్కరికి రూ.250 ఉంటే ప్రస్తుతం రూ.400కు పెంచారు. సహస్ర నామార్చనకు రూ.216 ఉంటే రూ.300, సుదర్శన నారసింహ హోమానికి రూ.1,116 ఉంటే రూ.1,250, నిత్య కల్యాణోత్సవానికి రూ.1,250 ఉంటే రూ,1,500, స్వాతి నక్షత్రం రోజున నిర్వహించే శత ఘటాభిషేకానికి (ఇద్దరికి) రూ.750 ఉంటే రూ.1,000, లక్ష పుష్పార్చనకు రూ.2,116 ఉంటే రూ.2,500, వెండి మొక్కు జోడు సేవలకు రూ.500 ఉంటే రూ.700, సువర్ణ పుష్పార్చనకు రూ.516 ఉంటే రూ.600, వేదాశీర్వచనం రూ.516 ఉంటే రూ.600, ఆండాల్ అమ్మవారి ఊంజల్ సేవకు రూ.750 ఉంటే రూ.1000, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో కలిపి) రూ.500 ఉంటే రూ.800, గో పూజకు రూ.50 ఉంటే రూ.100, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలకు వీఐపీల కోసం ప్రత్యేకంగా రూ.1,500, ఉపనయనం రూ.50 ఉంటే రూ.500, అక్షరాభ్యాసం రూ.51 ఉంటే రూ.200, అష్టోత్తర పూజకు రూ.100 ఉంటే రూ.200, అన్నప్రాశన (ఐదుగురికి) రూ.500 ఉంటే రూ.1000కి పెంచారు. ప్రసాదం ధరల వివరాలివీ.. స్వామివారి లడ్డూ ప్రసాదం ధరలను సైతం అధికారులు పెంచారు. వంద గ్రాముల లడ్డూ గతంలో రూ.20 ఉంటే రూ.30కి పెంచారు. 500 గ్రాముల లడ్డూ రూ.100 ఉంటే రూ.150, 250 గ్రాముల పులిహోర రూ.15 ఉంటే రూ.20, 250 గ్రాముల వడ రూ.15 ఉంటే రూ.20కి పెంచారు. శివాలయంలో, పాతగుట్ట ఆలయంలోనూ పూజల ధరలను పెంచారు. శాశ్వత పూజల ధరలు కూడా పెరిగాయి. -
లడ్డూ ధర పెంపుపై నిర్ణయం తీసుకోలేదు
తిరుమల/సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ ధర పెంచే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. చెన్నై టీనగర్లోని టీటీడీ ఆలయానికి కొత్తగా నియమితులైన స్థానిక సలహామండలి ఉపాధ్యక్షులు, సభ్యుల చేత ఆదివారం ఆయన పదవీ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోని అన్ని శ్రీవారి ఆలయాలకు స్థానిక సలహామండలి సభ్యుల నియామకాలు పూర్తి చేశారని చెప్పారు. భక్తులను ఇబ్బందిపెట్టే ఎలాంటి నిర్ణయాన్నీ పాలకమండలి తీసుకోదన్నారు. అద్దె గదుల విషయంలోనూ సామాన్య భక్తులు తీసుకునే వాటి ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. చెన్నైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం భూమి కేటాయించాలని తమిళనాడు సీఎంతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మందిరానికి మెరుగులు దిద్దుతామన్నారు. 23 నుంచి తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, అదే రోజున చెన్నైలోనూ ప్రారంభిస్తామని చెప్పారు. -
లడ్డు ధర పెంచట్లేదు : టీటీడీ చైర్మన్
సాక్షి, చెన్నై : తిరుమలలో లడ్డు ప్రసాదం ధరలను పెంచుతున్నారంటూ వస్తున్న వదంతులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఖండించారు. ధరలను పెంచట్లేదని, వదంతులను నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని టీటీడీ చైర్మన్ ఆదివారం పరిశీలించారు. తిరుమల లడ్డు ధర పెంచే ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ లేదు. లడ్డు ప్రసాదం ధర పెంపు అని ప్రచారం అవుతున్న వార్తలు అవాస్తవాలు. — Y V Subba Reddy (@yvsubbareddymp) November 17, 2019 తిరుమల తిరుపతి దేవస్థానం, చెన్నై శ్రీ వెంకటేశ్వర టెంపుల్స్ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షలు ఉపాధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. pic.twitter.com/BkIeN7yHaM — Y V Subba Reddy (@yvsubbareddymp) November 17, 2019 -
తిరుమల లడ్డూ ధర యథాతథం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూ ధరను పెంచడం లేదు. ఈ విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 2,678 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్కు పాలకమండలి ఆమోదం తెలిపింది. శ్రీవారి వైభవోత్సవాలను 8 రోజుల నుంచి 5 రోజులకు కుదించారు. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి బంగారు తాపడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో అమవాస్య నాడు హనుమంత వాహన సేవ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే.. శనగపప్పు, ఏలకులు, నెయ్యి, పెసరపప్పు, చింతపండు కొనుగోళ్లకు ఆమోదం తెలిపారు. రూ. 3.30 కోట్లతో రెండో ఘాట్ రోడ్డు మరమ్మత్తులకు ఆమోదం లభించింది. ఆర్జిత సేవ, అద్దె గదులపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అలాగే తిరుమలలో రూ. 4.5 కోట్లతో ఆక్టోపస్ భద్రతాదళానికి భవన నిర్మాణం చేపట్టేందుకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. -
ఆర్జిత సేవా టికెట్ల ధరల్లో భారీ పెంపు
టీటీడీ ధర్మకర్తల మండలి ఉపకమిటీ సిఫారసు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనంతోపాటు అన్నిరకాల ఆర్జిత సేవా టికె ట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నేతృత్వంలో శుక్రవారం రాత్రి జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి ఉప కమిటీ సమావేశం ఈ మేరకు సిఫారసు చేసింది. మూలమూర్తికి నిర్వహించే అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మారాధన, అభిషేకం, వస్త్రం సేవా టికెట్ల ధరల్ని ఎక్కువగా పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. బంగారువాకిలిలో నిర్వహించే సహస్రకలశాభిషేకం, తిరుప్పావైతోపాటు ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను తక్కువ మోతాదులో పెంచాలని సూచించింది. లడ్డూ ధరను యథావిధిగానే కొనసాగించాలని, అయితే సర్వదర్శనం, కాలిబాట భక్తులకు ప్రస్తుతం రూ.10 చొప్పున రెండు లడ్డూలు ఇస్తుండగా.. ఇకపై ఒక లడ్డూనే ఇవ్వాలని సిఫారసు చేసింది. తిరుమల, తిరుపతిలోని అతిథిగృహాల గదులు, కాటేజీలతోపాటు దేశవ్యాప్తంగా ఉండే కల్యాణమండపాల అద్దెలను కూడా 50 నుంచి 100 శాతానికిపైగా పెంచాలని సూచించింది. ఆన్లైన్ టికెట్ల ధర(రూ.300)ను పెంచాలంది. శనివారం జరిగే ధర్మకర్తల మండలి సమావేశం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2016-2017 సంవత్సరానికిగాను టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.2,650 కోట్లు దాటనుంది. -
ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుమల: టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది. టీటీడీ పాలకమండలి సమావేశంలో లడ్డు ధరపై వాడీవేడీగా చర్చ కొనసాగుతోంది. ఆర్జిత సేవలు, లడ్డూ ధరల పెంపుపై చర్చ జరుపుతున్నారు. లడ్డూ ధర పెంచాలి లేకుంటే పరిమాణం తగ్గించాలని ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి పట్టుపట్టినట్టు తెలుస్తోంది. లడ్డూ ధర పెంపును పాలకమండలి సభ్యుల్లో కొందరు వ్యతిరేకించినట్టు సమాచారం. కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తమను అవమానించారంటూ పాలకమండలి సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.