ఆర్జిత సేవా టికెట్ల ధరల్లో భారీ పెంపు
టీటీడీ ధర్మకర్తల మండలి ఉపకమిటీ సిఫారసు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనంతోపాటు అన్నిరకాల ఆర్జిత సేవా టికె ట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నేతృత్వంలో శుక్రవారం రాత్రి జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి ఉప కమిటీ సమావేశం ఈ మేరకు సిఫారసు చేసింది. మూలమూర్తికి నిర్వహించే అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మారాధన, అభిషేకం, వస్త్రం సేవా టికెట్ల ధరల్ని ఎక్కువగా పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. బంగారువాకిలిలో నిర్వహించే సహస్రకలశాభిషేకం, తిరుప్పావైతోపాటు ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను తక్కువ మోతాదులో పెంచాలని సూచించింది.
లడ్డూ ధరను యథావిధిగానే కొనసాగించాలని, అయితే సర్వదర్శనం, కాలిబాట భక్తులకు ప్రస్తుతం రూ.10 చొప్పున రెండు లడ్డూలు ఇస్తుండగా.. ఇకపై ఒక లడ్డూనే ఇవ్వాలని సిఫారసు చేసింది. తిరుమల, తిరుపతిలోని అతిథిగృహాల గదులు, కాటేజీలతోపాటు దేశవ్యాప్తంగా ఉండే కల్యాణమండపాల అద్దెలను కూడా 50 నుంచి 100 శాతానికిపైగా పెంచాలని సూచించింది. ఆన్‌లైన్ టికెట్ల ధర(రూ.300)ను పెంచాలంది. శనివారం జరిగే ధర్మకర్తల మండలి సమావేశం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2016-2017 సంవత్సరానికిగాను టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.2,650 కోట్లు దాటనుంది.