విలీన కొర్రీతో పద కొండేళ్లుగా ఎన్నికలు నిల్
నాలుగేళ్లుగా ప్రత్యేక పాలనలోనే 42 పంచాయతీలు
రెండున్నరేళ్లుగా అనపర్తిలో ప్రత్యేక పాలన
అడుగు పడని అభివృద్ధి
క్షీణిస్తున్న పారిశుద్ధ్యం
మండపేట : పంచాయతీల్లో సర్వాధికారం ప్రథమ పౌరులదే. పల్లెల ప్రగతికి బాటలు వేసేది అక్కడి పాలకవర్గాలే. ప్రజలకు, అధికారులకు మధ్య వారధిలా ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకవర్గ సభ్యులది కీలకపాత్ర. అటువంటి పాలకులు లేని పల్లెలు జిల్లాలో చాలానే ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రత్యేక పాలనలో మగ్గుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. విలీన కొర్రీతో 42 పంచాయతీలకు ఎన్నికలు జరిగి 11 ఏళ్లు కావస్తుండగా, సర్పంచ్‌ల మరణాలతో ప్రథమ పౌరులు లేని పంచాయతీలు 14 వరకు ఉన్నాయి. పనిచేయని కుళాయిలు, డ్రైన్‌లో పారని మురుగునీరు, వెలగని వీధిలైట్లు, వీధి మలుపులో తొలగని చెత్త, క్షీణించిన పారుశుద్ధ్యంతో వెంటాడుతున్న రోగాలు, అందుబాటులో ఉండని అధికారులు, అడుగు పడని అభివృద్ధి, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్లుగా ఎన్నికలకు నోచుకోక ప్రత్యేక పాలనలోనే ఆయా పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారులు ఎప్పుడు వస్తారో తెలీదు. నిధుల వ్యయం, అభివృద్ధి పథకాల అమలు అంతా అయోమయం. 2011 సెప్టెంబరుతో గత పాలకవర్గాల పదవీకాలం ముగియగా, బీసీ రిజర్వేషన్లు వివాదం, ఇతర కారణాలతో 2013 జూలైలో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 1069 పంచాయతీలకు గాను నగర, పురపాలక సంస్థల్లో సమీప గ్రామాలను విలీన ప్రతిపాదనలుపై కోర్టు వివాదాలు నేపధ్యంలో జిల్లాలోని 42 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. రాజమండ్రి డివిజన్ పరిధిలోని రాజమహేంద్రవరం కార్పొరేషన్, మండపేట మున్సిపాల్టీల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనలతో 28 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోగా, కాకినాడ డివిజన్‌లోని కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది పంచాయతీలు, పెద్దాపురం డివిజన్‌లోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల సమీపంలోని ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అనపర్తి పంచాయతీ పదవీకాలం 2014 ఆగస్టు 4తో ముగియగా నగర పంచాయతీగా స్థాయి పెంపుదలకు వ్యతిరేకంగా నడుస్తున్న కోర్టు వాజ్యంతో ఎన్నికలు నిలిచిపోయాయి. రంగంపేట మండలం జి.దొంతమూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించడంతో ప్రత్యేకపాలనలో ఉంది.
కోర్టు ఆదేశాలిచ్చినా
విలీన ప్రతిపాదనను నిరసిస్తూ పలు గ్రామాలకు చెందిన నేతలు కోర్టులను ఆశ్రయించి ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు తెచ్చుకున్నా వాటి అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేవలం ఎంపీటీసీ ఎన్నికలు జరిపి చేతులు దులిపేసుకుంది. పంచాయతీ ఎన్నికల జరిపించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన సర్కారు ఎన్నికలు జరపకుండా తమ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పంచాయతీల పరిధిలోని 240కు పైగా వార్డులకు ఎన్నికలు జరపాల్సి ఉంది.
మరణాలు, రాజీనామాలతో మరో 14 ఖాళీ
పలువురు సర్పంచుల రాజీనామాలు, మరణాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 14 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరపాల్సి ఉంది. ఆయా కారణాలతో జి.మామిడాడ, ఎస్.యానాం, వెంగాయమ్మపురం, పాతర్లగడ్డ, లొల్ల, ఈస్ట్ లక్ష్మీపురం, మెగ్గళ్ల, నామవాని పాలెం, అన్నాయిపేట, లింగాపురం, ఇరుసుమండ, టీజే నగరం, దొండపాక, గంగనాపల్లి పంచాయతీలు ఇన్‌చార్జిల ఏలుబడిలో ఉన్నాయి.
వెంటాడుతున్న సమస్యలు
గ్రామ పంచాయతీల్లో సర్వాధికారం సర్పంచ్‌లదే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు నుంచి గ్రామాభ్యుదయానికి పాటు పడటంలోను వారిదే కీలకపాత్ర. పాలవర్గాలకు ఎన్నికలు జరగక ఏళ్ల తరబడి ప్రత్యేక పాలనలోనే ఆయా గ్రామాలు మగ్గుతున్నాయి. గ్రామ ప్రజలకు అవసరమైన సేవలతో పాటు పంచాయతీలకు విడుదలయ్యే నిధుల వినియోగంలోను పారదర్శక లోపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సమస్యలు చెప్పుకునేందుకు వార్డు సభ్యులు లేకపోవడం, అధికారులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో సంవత్సర కాలంలో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, ఇప్పట్లో పాలకులు లేని పంచాయతీల్లో ప్రభుత్వం ఎన్నికలు జరిపే దాఖలాలు లేవన్న విమర్శలు వ్యక్తమతున్నాయి. కనీసం ఆయా గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్యలు పట్టించుకునే వారు లేరు
దీర్ఘకాలంగా పాలకవర్గం లేక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాల్టీలో కలిస్తే ఉపాదిహామీ వర్తించదన్న వాదన బలంగా ఉంది. విలీనం అనివార్యమైతే ప్రజలకు వివరణ ఇవ్వాలి.
- రుద్రాక్షల శ్రీనివాస్, మాజీ సర్పంచ్, నేలటూరు
ఎన్నికలు జరపాలి
ఎన్నికలు జరగక పాలకవర్గం లేదు. ప్రత్యేక పాలన కావడంతో మండలంలోని రెండు పంచాయతీలకు అనపర్తి ఈఓ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ కరువై పాలన కుంటుపడుతోంది. పారిశుద్ధ్యం లోపిస్తోంది. ఎన్నికలు జరిపి పాలకవర్గాన్ని ఏర్పాటుచేయాలి.
- సత్తి వెంకటరెడ్డి, అనపర్తి కొత్తూరు