హాకీ క్రీడాకారులకు ప్రోత్సాహం కరువు
-
డీఈఓ మువ్వా రామలింగం
వెంకటాచలం : దేశంలో హాకీ క్రీడకు, క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైందని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం అన్నారు. 62వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలు మండలంలోని సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయంలో శనివారం ప్రారంభమయ్యాయి. డీఈఓ మువ్వా మాట్లాడుతూ హాకీ క్రీడ ద్వారా భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. హాకీ క్రీడను ప్రోత్సహిస్తే వందల మంది క్రీడాకారులను తయారు చేయగల సత్తా వ్యాయామ ఉపాధ్యాయుల్లో ఉందన్నారు. విద్యార్థులు చదువుతోపాటుగా ఆటల్లో కూడా రాణించాలన్నారు. కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, ఎంఈవో కొండయ్య, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పోటీల్లో విజేతలు వీరే
62వ స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు అక్షర విద్యాలయానికి వచ్చాయి. లీగ్ పద్ధతిలో తొలిరోజు మొత్తం 8 మ్యాచ్‌లు నిర్వహించారు.
విజయం సాధించిన జట్లు
బాలుర విభాగంలో..
శ్రీకాకుళం జట్టుపై తూర్పుగోదావరి 3–0తో గెలుపొందగా ప్రకాశం జట్టుపై గుంటూరు జట్టు 2–0తో విజయం సాధించింది. కర్నూల్‌పై క్రిష్ణా జిల్లా 3–0తో గెలుపొందగా పశ్చిమ గోదావరి, నెల్లూరు మధ్య జరిగిన పోటీ డ్రాగా మారింది.
బాలికల విభాగంలో..
క్రిష్ణా జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్లు 3–0తో గెలుపొందగా, ప్రకాశం జిల్లా జట్లుపై నెల్లూరు జిల్లా జట్లు 3–0తో గెలుపొందింది. అలాగే శ్రీకాకుళంపై విశాఖపట్నం జట్టు విజయం సాధించింది. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మిగతా లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసి సోమవారం క్వార్టర్స్, సెమీ, ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తారు.