hockey players
-
ఆ ఐదుగురు ఆసుపత్రికే...
బెంగళూరు : కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఐదుగురు భారత హాకీ జట్టు ఆటగాళ్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రికి తరలించారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి సాధారణం కంటే తక్కువకు పడిపోవడంతో మంగళవారం భారత పురుషుల హాకీ జట్టు కీలక ఆటగాడు మన్దీప్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఎస్ఎస్ స్పర్శ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో మన్దీప్ చికిత్స పొందుతుండగా... ఇదే ఆసుపత్రిలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, డిఫెండర్లు సురేందర్ కుమార్, జస్కరణ్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, గోల్‌కీపర్ కృషన్ బహదూర్ పాఠక్‌లను చేర్చారు. ఈనెల 20 నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో జాతీయ హాకీ శిక్షణ శిబిరం మొదలవుతుంది. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌గా వచ్చింది. -
నలుగురు హాకీ ఆటగాళ్లు దుర్మరణం
హోసంగాబాద్(మధ్యప్రదేశ్): రోడ్డు ప్రమాదంలో నలుగురు జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు దుర్మరణం చెందారు. సోమవారం ఉదయం హోసంగాబాద్‌లోని రాసాల్పూర్ వద్ద చోటు చేసుకున్న కారు ప్రమాదంలో నలుగురు హాకీ ఆటగాళ్లు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డారు. జాతీయ రహదారి-69పై హాకీ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో అతివేగంగా వెళుతున్న కారు జాతీయ రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ధ్యాన్‌చంద్ ట్రోఫీలో భాగంగా సదరు హాకీ ఆటగాళ్లు కారులో ఇతార్సి నుంచి హోసంగాబాద్‌కు వెళుతున్న సమయంలో కారు ప్రమాదం జరిగింది. Madhya Pradesh: Four national level hockey players dead, three injured, in a car accident in Hoshangabad pic.twitter.com/otLiRNQzoQ — ANI (@ANI) October 14, 2019 -
ఘోర ప్రమాదం : 15 మంది హాకీ ఆటగాళ్ల మృతి
హంబోల్డ్ : కెనడాలో జరిగిన రోడ్డుప్రమాదం హాకీ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటన సస్కచెవాన్ ప్రావిన్సులో శనివారం జరిగింది. జూనియర్ ఐస్ హాకీ జట్టుతో వెళుతున్న బస్సు మార్గమధ్యంలో సెమీ ట్రైలర్ ట్రక్కును ఢీకొంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో టిస్డేల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 15 మంది చనిపోగా మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే మృతుల్లో 24 మంది ఆటగాళ్లు. వీరి వయసు 16 నుంచి 21లోపే. ఈ ఘటన దేశాన్ని తీవ్రంగా కలచివేసిందని ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. -
హాకీ క్రీడాకారులకు ప్రోత్సాహం కరువు
డీఈఓ మువ్వా రామలింగం వెంకటాచలం : దేశంలో హాకీ క్రీడకు, క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైందని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం అన్నారు. 62వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలు మండలంలోని సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయంలో శనివారం ప్రారంభమయ్యాయి. డీఈఓ మువ్వా మాట్లాడుతూ హాకీ క్రీడ ద్వారా భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. హాకీ క్రీడను ప్రోత్సహిస్తే వందల మంది క్రీడాకారులను తయారు చేయగల సత్తా వ్యాయామ ఉపాధ్యాయుల్లో ఉందన్నారు. విద్యార్థులు చదువుతోపాటుగా ఆటల్లో కూడా రాణించాలన్నారు. కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, ఎంఈవో కొండయ్య, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలు వీరే 62వ స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు అక్షర విద్యాలయానికి వచ్చాయి. లీగ్ పద్ధతిలో తొలిరోజు మొత్తం 8 మ్యాచ్‌లు నిర్వహించారు. విజయం సాధించిన జట్లు బాలుర విభాగంలో.. శ్రీకాకుళం జట్టుపై తూర్పుగోదావరి 3–0తో గెలుపొందగా ప్రకాశం జట్టుపై గుంటూరు జట్టు 2–0తో విజయం సాధించింది. కర్నూల్‌పై క్రిష్ణా జిల్లా 3–0తో గెలుపొందగా పశ్చిమ గోదావరి, నెల్లూరు మధ్య జరిగిన పోటీ డ్రాగా మారింది. బాలికల విభాగంలో.. క్రిష్ణా జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్లు 3–0తో గెలుపొందగా, ప్రకాశం జిల్లా జట్లుపై నెల్లూరు జిల్లా జట్లు 3–0తో గెలుపొందింది. అలాగే శ్రీకాకుళంపై విశాఖపట్నం జట్టు విజయం సాధించింది. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మిగతా లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసి సోమవారం క్వార్టర్స్, సెమీ, ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తారు.