మీకు నో ఎంట్రీ
-
వైఎస్సార్ సీపీ స్థానిక ప్రజాప్రతినిధులపై వివక్ష
-
బెల్ శంకుస్థాపనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
-
పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధం
పామర్రు : నెమ్మలూరులో సోమవారం బెల్ కంపెనీకి శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ స్థానిక ప్రజాప్రతినిధులను అనుమతించలేదు. సభ వద్దకు వెళ్తున్న ప్రజాప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభ ముగిసే వరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు... బెల్ కంపెనీకి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లేందుకు స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతోపాటు నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు వెళ్లారు. సభ వద్దకు ఎమ్మెల్యే కారును మాత్రమే అనుమతించారు. మిగిలిన ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ తాము ప్రజా ప్రతినిధులమని, గుర్తింపు కార్డులను కూడా చూపించారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. ‘వైఎస్సార్ సీపీ నాయకులను లోపలికి పంపవద్దని మాకు పై అధికారులు జారీ చేశారు..’ అని చెప్పారు. ఎవరు చెప్పారని ఎంపీపీ ప్రశ్నించగా... ‘మీకు చెప్పాల్సిన అవసరం లేదు..’ అని ఓ ఎస్‌ఐ దుర్భాషలాడారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను లారీలో ఎక్కించి పామర్రు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో చాలాసేపు వైఎస్సార్ సీపీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు స్టేషన్‌లోనే ఉంచారు. నెమ్మలూరులో సభ పూర్తయిన తర్వాత స్టేషన్ నుంచి పంపారు. ఈ సందర్భంగా ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యమా.. లేక రాక్షస రాజ్యమా.. అని ప్రశ్నించారు. ఒక ప్రజా ప్రతినిధిని అయిన తనను ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం సరికాదన్నారు. టీడీపీ నాయకుల కక్షసాధింపు చర్యలకు ఈ ఘటన నిదర్శనమన్నారు. పోలీసులు నిర్భంధించిన వారిలో కొండిపర్రు ఎంపీటీసీ సభ్యుడు బీవీ రాఘవులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మోర్ల రామచంద్రరావు, పార్టీ నాయకులు సోలే నాగరాజు, పూర్ణచంద్రరావు, గోగం రామారావు, బొప్పూడి సురేష్‌బాబు తదితరులు ఉన్నారు.