నా జాతకంలో ఓటమి లేదు | no failures in my Horoscope, CM KCR says | Sakshi
Sakshi News home page

నా జాతకంలో ఓటమి లేదు

Published Sat, Jun 11 2016 3:24 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

నా జాతకంలో ఓటమి లేదు - Sakshi

నా జాతకంలో ఓటమి లేదు

- ఎర్రవల్లి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
- దేవుడి దయతో ఏదనుకుంటే అది జరిగింది
- ఎర్రవల్లి, నర్సన్నపేట ప్రాజెక్ట్‌ కూడా సక్సెస్‌ అయితది..
ఈ రెండు గ్రామాలు దేశానికే మార్గదర్శకం కాబోతున్నాయ్‌
- త్వరలో డబుల్‌ బెడ్‌ ఇళ్లలోకి పోదాం
- పెద్ద దావత్‌ చేసుకుందాం.. నేను మీతోనే తింటా..
- ఇంటింటికీ పాడి గేదెలు.. ఇంటర్నెట్‌ సౌకర్యం
- ఊరిలో అంతా కలసి ఉండాలె.. కొట్లాటలు, పంచాయితీలు బంద్‌ చేయాలె
- గ్రామంలో 42 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్ల పంపిణీ


గజ్వేల్‌:
‘‘ఇప్పటివరకు దేవుడి దయ వల్ల నేనేది జరగాలనుకున్ననో అదే జరిగింది.. నేను కూడా ఎర్రవల్లి గ్రామస్తుణ్నే.. జాతకం ప్రకారం నాకు ఫెయిల్యూర్‌ లేదు.. ఎర్రవల్లి, నర్సన్నపేట ఆదర్శ గ్రామాల ప్రాజెక్టు కూడా సక్సెస్‌ అయితది.. ఈ రెండు గ్రామాలు రేపు దేశానికే మార్గదర్శకం కాబోతున్నయ్‌... ఇందులో అనుమానం లేదు..’’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవల్లి గ్రామంలో వందశాతం రాయితీపై 42 మంది లబ్ధిదారులకు సీఎం ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘మరో రెండు నెలల్లో ఈ రెండు గ్రామాల్లో చిన్న యాగం చేద్దాం.. దేవుణ్ని కొలుచుకుందాం. తర్వాత డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల గృహప్రవేశ పండుగ చేసుకుందాం. అలాగే రిలయన్స్‌ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందించబోతున్నాం..’’ అని చెప్పారు. ‘‘సంఘటితంగా ఉంటే కొండలను కూడా బద్దలు కొట్టగలం. ఐకమత్యంలో చాలా బలముంది. ఈ విషయాన్ని మనకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలే. ఇప్పుడు మనం ఆచరించి చూపిద్దాం’’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందని, ప్రస్తుతం కూడÐð ల్లి వాగును అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘

‘ఈసారి వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని చెబుతుండ్రు. సెప్టెంబర్‌లో బాగా పడతాయట. కూడవెల్లి వాగునీటితో కుంటలను నింపుకుని వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుందాం. తాగునీటికి ఇప్పటికే గోదావరి జలాలు అందుతున్నాయి. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు స్వయం ఆధార గ్రామాలుగా అవతరించాలన్నదే లక్ష్యం. రెండు గ్రామాల్లో ఒక్కరు కూడా పని లేకుండా ఉండొద్దు. 60 కుటుంబాలను ఇప్పటికే గుర్తించాం. ఇందులో ఇప్పటికే కొందరికి ట్రాక్టర్లు అందజేశాం. మరో 16–20 మందిని ఉమ్మడి వ్యవసాయంలో ఆపరేటర్లుగా నియమించబోతున్నం. ఇద్దరిని ఎరువుల గోదాం ఇన్‌చార్జులుగా నియమిస్తాం. ఒకరికి చెప్పుల దుకాణం, మరో ఇద్దరికి హెయిర్‌ కటింగ్‌ సెలూన్స్, మరికొందరికి కూరగాయల మార్కెట్, రెడీమేడ్‌ షాపులు, హోటళ్లు ఏర్పాటు చేసి ఉపాధి చూపుతాం’’ అని చెప్పారు.

ఇంటింటికీ ఆవులు లేదా గేదెలు
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల గృహ ప్రవేశ సమయానికి ఇంటింటికి రెండు పాడి గేదెలు లేదా ఆవులను అందజేస్తామని సీఎం చెప్పారు. ‘‘ఎవరు నచ్చినై వారు కొనుక్కోవచ్చు. ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకునే పశువులను కొనుక్కుని పాడి ద్వారా మంచి ఆదాయం పొందాలె. సర్కారే అందరికీ గేదెలు, ఆవులను కొనిస్తది. దీంతో పాటు ప్రతి ఇంటికి పది దేశవాళీ కోళ్లను కూడా అందిస్తం. ఈ పథకాన్ని మంచిగా ఉపయోగించుకుని ఎర్రవల్లి, నర్సన్నపేట ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించాలె. రెండు నెలల్లో గ్రామంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం పూర్తవుతుంది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏ అభివృద్ధి పనిచేసినా అందరికీ తెల్వాలె. ఇందుకు కమ్యూనిటీ హాల్‌ వేదిక కాబోతుంది’’ అని అన్నారు.

‘‘ఈ రెండు గ్రామాల్లో ఇంటర్నెట్‌ ఏర్పాటు చేయాలని నేను అడిగిన వెంటనే రిలయన్స్‌ సంస్థ ఒప్పుకుంది. సర్వే కూడా ప్రారంభించింది. రెండు నెలల్లో ఈ సౌకర్యం మీకు అందుబాటులోకి వస్తది. ఈడ కూసోని అమెరికాలో ఉన్న వాళ్లతో వీడియో కాల్‌ మాట్లాడొచ్చు. హైదరాబాద్‌లో ఉండేటోళ్లు ఎర్రవల్లి కాడ ఒక ఇల్లు కొనుక్కుంటే బాగుండు.. అనే వాతావరణం ఏర్పడతది. వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి ఆదర్శ గ్రామస్తులు ఈడికి వచ్చిండ్రు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసిండ్రు. రాబోయే రోజుల్లో ఈ ఊరి నుంచి వేరే గ్రామాలకు పోయి మీరే తోవ చూపాలే. ఈ రెండు గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి.. రేపటి భావితరాల తెలంగాణ కోసమే. ప్రతి గ్రామం ఈ రెండు గ్రామాల్లా తయారు చేయడమే నా లక్ష్యం. కాకపోతే ముందు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు ఆ అదృష్టం పొందాయి’’ అని సీఎం వ్యాఖ్యానించారు.

గన్‌ ఫెన్సింగ్‌ కంటే సోషల్‌ ఫెన్సింగ్‌ గొప్పది
‘‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. నా భద్రత కోసం ఈడికి ఇంతమంది పోలీసులు వచ్చిండ్రు. ఇది గొప్ప కాదు. సోషల్‌ ఫెన్సింగ్‌ అనేది గొప్పది. గ్రామంలో ఒకరికొకరు ఎదురుపడగానే నవ్వుతూ మాట్లాడుకోవాలె. సమష్టిగా ఉండాలే. ఇక నుంచి కొట్లాటలు, పంచాయితీలు బంద్‌ జేయాలే. నా కోసం నా ఊరున్నది అనే భావన కలగాలె. అది చాలా గొప్పది’’ అని సీఎం చెప్పారు. సమష్టిగా ఉండడం వల్ల ఎన్నో విజయాలు వస్తాయన్నారు.

ఇష్టమొచ్చినట్లు పంటలు వేయొద్దు..
‘‘నిన్న మొన్నటిలాగా ఇకపై ఇష్టమొచ్చినట్లు పంటలు వేయొద్దు. ఈ ఊర్లో ఏ పంటలైతే బాగుంటయో.. ఏ నేలలో ఏ విత్తనమేయాలో.. అగ్రానమిస్టు చెబుతారు. ఆయన చెప్పినట్లే ఇక్కడ పంటలు వేద్దాం. ఈ సారి వెయ్యి ఎకరాల్లో సోయాబీన్, మరో 1,800 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేద్దాం’’ అని సీఎం ఎర్రవల్లి గ్రామస్తులతో అన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ ప్రవీణ్‌రావుతో సోయాబీన్‌ పంట వివరాలను రైతులకు చెప్పించారు. సోయాబీన్‌ ఎకరాకు 8–10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని, ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ. 5,200 ధర పలుకుతుందని ఈ లెక్కన ఎకరాకు రూ.45 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తుందని ప్రవీణ్‌రావు వివరించారు. అలాగే మొక్కజొన్నకు ఎకరాకు రూ.40 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తుందన్నారు.

గ్రామం పువ్వులా కనబడాలె..
‘‘ఎర్రవల్లి ఒక పువ్వులా కనబడాలె. ఇప్పుడు నిర్మించిన డబుల్‌బెడ్రూం ఇళ్లకు ఒక్కొక్క వీధిలో ఒక్కో రంగు వేయాలె. సింగపూర్‌లో ఇలాంటి విధానం ఉంటది. అదే తరహాలో ఇక్కడ కనబడాలె..’’ అని సీఎ కేసీఆర్‌ జేసీ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. ‘‘వెంకట్రామిరెడ్డి ఈ రెండు గ్రామాల గురించి చాలా కష్టపడుతుండు. తిన్న సద్ది రేవు తల్వాలే. వెంకట్రామిరెడ్డి మీ పెద్ద కొడుకు. మనం శ్రావణమాసంలో ఇళ్లకు పోంగనే పెద్ద దావత్‌ చేసుకుందం. నేనూ మీతోపాటే భోజనం చేస్తా. వెంకట్రామిరెడ్డిని గొప్పగా సన్మానించుకుందాం..’’ అని అన్నారు. ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు పనితీరును కూడా సీఎం ప్రశంసించారు. హైదరాబాద్‌ వెళ్లే లోపు మూడ్రోజుల్లో మళ్లీ ఎర్రవల్లి వచ్చి అభివృద్ధిని చూస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement