నో.. జంబ్లింగ్ !
– వెనక్కు తగ్గిన ప్రభుత్వం !
– పాఠశాలస్థాయిలోనే మూల్యాంకనం
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యారంగంలో నూతన విధానం అంటూ సంగ్రహాణాత్మక మూల్యాంకనం అమలుకు పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. నూతన విధానాన్ని అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫలితాలను ఒకటికి రెండుసార్లు విశ్లేషించాల్సి ఉంది. అయితే ఇవేం పట్టకుండా తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా తన నిర్ణయాలను అమలు చేయాలంటూ ప్రభుత్వం బలవంతంగా టీచర్లపై రుద్దింది. అయితే ఈ విధానం అమలులో చోటు చేసుకున్న ఇబ్బందులు, కలిగే నష్టాలపై ప్రభుత్వంపై ముప్పేట ఒత్తిడి వచ్చింది. పోలుపోలేని స్థితిలో చివరకు పరీక్షలకు రెండు రోజుల ముందు తన నిర్ణయాన్ని మార్చుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా కామన్ పరీక్ష అమలు చేస్తున్నా.. బాహ్య మూల్యాంకనంలో పలు సవరణలు చేస్తూ మంగళవారం జీఓ విడుదల చేసింది. 8,9,10 తరగతులకు సంబంధించి ఎస్‌ఏ–1, ఎస్‌ఏ–2 మూల్యాంకనాన్ని జంబ్లింగ్ విధానంలో కాకుండా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని ఆదేశించింది. సమ్మేటివ్–3 పరీక్షలను మాత్రమే బాహ్యమూల్యాంకనంలో (పదో తరగతికి పబ్లిక్ పరీక్షలు ఉంటాయి) నిర్వహించనున్నారు. అలాగే 6,7 తరగతులకు సంబంధించి ఎస్‌ఏ–1, ఎస్‌ఏ–2, ఎస్‌ఏ–3 మూల్యాంకనాలను మండల కేంద్రాల్లో కాకుండా పాఠశాల స్థాయిల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు.
– 6–10 తరగతులకు 1,2,3 సంగ్రహణాత్మక మూల్యంకనాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ 5 శాతం జవాబు పత్రాలను ప్రత్యేక బందం ద్వారా మూల్యాంకనం జరుగుతుంది.
– 8,9 తరగతులు వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులను మాత్రమే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు కలుపుతారు. అంటే ప్రస్తుతం 8వ తరగతి ఉన్న విద్యార్థి వార్షిక పరీక్షలో వచ్చిన మార్కులు 5 శాతం, అదే విద్యార్థి తొమ్మిదో తరగతిలో వెళ్లిన తర్వాత వార్షిక పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 5 శాతం, ఈ విద్యార్థి 2019 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 10 శాతం కలిపి మొత్తం 20 శాతం అంతర్గతమార్కులు కేటాయిస్తారు. పరీక్షల సక్రమ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక స్క్వాడ్ బందాలను నియమిస్తారు.
ప్రభుత్వం పునరాలోచించాలి
బాహ్య మూల్యాంకనం అమలు చేసే విషయంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులను దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పునరాలోచించాలి. సౌకర్యాల లేమి, ల్యాబ్‌లు, ఇంటర్నెట్ లేని కారణంగా అర్బన్ విద్యార్థులతో పోటీ పడాలంటే ఇబ్బంది. ముందుగా గ్రామీణ ప్రాంతాల పాఠశాలలకు అన్ని సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విధానాలు అమలు చేస్తే బాగుంటుంది.
– రజనీకుమార్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి ‘ఆప్టా’ అధ్యక్ష,ప్రధాన lకార్యదర్శులు
ఏకపక్ష నిర్ణయం తీసుకుంది
నూతన విధానం అమలులో ప్రభుత్వం ఎవర్నీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘంతో పాటు వివిధ వర్గాలు వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గి ఈ విధానాన్ని విరమించుకుంది.
– గోపాల్‌రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి