కూచిపూడికి కాసుల్లేవట
విశాఖపట్నం : కూచిపూడి నృత్యానికి పూర్వ వైభవం తీసుకువస్తాం.. ప్రతి ఇంటి నుంచి ఓ కూచిపూడి నృత్య కళాకారుడిని తయారు చేయాలి.. కూచిపూడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలు ఉత్తి కోతలనేదానికి ఈ ఘటనే ఉదాహరణ. దళిత విద్యార్ధుల నుంచి కూచిపూడి డ్యాన్స్ పేరిట అధికారులు ఇండెంట్లు పెట్టి వసూళ్లు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా..
రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని ఐక్యరాజ్య సమితి విశ్వ విజ్ఞాన దినోత్సవంగా పాటించాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్రం ఆయన 125వ జయంతిని ఏడాది పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఆ వేడుకల ముగింపుతో పాటు 126వ జయంతి ఉత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఈ నెల 11న విశాఖ సాగర తీరంలో ఒకేసారి ఏడువేల మంది విద్యార్థినులతో రికార్డు స్థాయిలో కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించాలని అధికారులు నిర్ణయించారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థినులతో ఈ ప్రదర్శన ఏర్పాటుచేయాలని సన్నాహాలు చేపట్టారు.
సీఎం చంద్రబాబునాయుడు కూడా హాజరవుతారని చెబుతూ వస్తున్న ఈ కార్యక్రమానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 11 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉండగా, అందులో ఆరు స్కూళ్ల నుంచి 2276 మంది విద్యార్ధినులను నృత్య రూపకానికి ఎంపిక చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నృత్య ప్రదర్శనకు విద్యార్థినులకు అవసరమైన దుస్తులు, అలంకరణ సామగ్రి మాత్రం... ఎవరికి వారే తెచ్చుకోవాలని విద్యార్థినుల నెత్తిన భారం మోపడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అలంకరణ సామాగ్రికి ఒక్కో విద్యార్థినికి రూ.600 నుంచి రూ. 1000 వరకు ఖర్చవుతుందని, ప్రస్తుతానికి తమ వద్ద అంత బడ్జెట్ లేనందున ఎవరికి వారు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. లేనిపక్షంలో ఒక్కొక్కరు రూ.600 ఇస్తే తామే సమకూరుస్తామని చెబుతూ వచ్చారు. ఈ మేరకు కొన్ని గురుకులాల్లో విద్యార్థినుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
అయితే విషయం ఆ నోటా ఈనోటా పడి బయటకు పొక్కింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి పేరుతో స్వయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొనే దళిత విద్యార్ధినులకు అవసరమైన సామాగ్రిని కూడా అందించలేని స్థితిలో పాలకులు ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వసూలు చేసిన మొత్తాన్ని తిరిగిచ్చే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
మొదట్లో నిజమే.. ఇప్పుడు లేదు
మొదట్లో తెలియక కొన్ని హాస్టళ్లలో విద్యార్థినుల నుంచి డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు లేదని రెసిడెన్షియల్ స్కూళ్ల జిల్లా కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ చెప్పారు. కూచిపూడి నృత్య ప్రదర్శన నిమిత్తం ఒక్కో హాస్టల్‌కు ప్రభుత్వం ఇటీవలే మూడున్నర లక్షల రూపాయలను గ్రాంట్‌గా విడుదల చేసిందని బుధవారం సాక్షి ప్రతినిధికి వెల్ల డించారు. ఆర్కే బీచ్‌లో కూచిపూడి నృత్య ప్రదర్శనను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నామని.. అతి పెద్ద కూచిపూడి ప్రదర్శనగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయించాలన్నది తమ ప్రయత్నమని ఆయన వివరించారు.