money Charge
-
ఆబ్కారీలోనూ ఆమ్యామ్యాలు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ప్రతీ పనికి మామూళ్ల వసూళ్లకు తెగబడిన పోలీసు సిబ్బంది జాబితాను ఇటీవల డీజీపీ విడుదల చేశారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితయే. జాబితాలో పేర్లు ఉన్న సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతుండగా.. మరో పక్క ఎక్సెజ్ శాఖలోనూ జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. నెలనెలా మామూళ్లకు అలవాటు పడిన ఎక్సైజ్ సిబ్బంది వివరాలను స్టేషన్ల వారీగా ఆ శాఖ డైరెక్టర్ అకున్‌సబర్వాల్ నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్నట్లు సమాచారం. ఆ జాబితాలోని కొందరు సిబ్బందిపై రెండు, మూడు రోజుల్లో వేటు పడొచ్చనే ప్రచారం శాఖలో సాగుతోంది. మొదటి నుంచి అపవాదు.. ఎక్సైజ్ శాఖలోని పై స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మామూళ్లు వసూలు చేయడానికి అలవాటు పడ్డారనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. భారీగా వసూళ్లకు పాల్పడుతూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నారనే విమర్శలున్నాయి. మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్‌లతో మొదలుకొని కల్లు దుకాణాలకు లైసెన్స్ రెన్యూవల్, కొత్త దుకాణాల అనుమతుల విషయంలో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనలో భాగంగా కొందరు సిబ్బంది చర్యలు తీసుకోవాలని భావిస్తూ డైరెక్టర్ జాబితా తెప్పించుకున్నట్లు సమాచారం. నిబంధనలు తూచ్.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాదారులు రింగ్‌గా ఏర్పడి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నెలనెలా మామూళ్లకు అలవాటుపడిన ఎక్సైజ్ సిబ్బందికి గంప గుత్తగా వస్తున్న డబ్బు వస్తుండడంతో నిబంధనలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మద్యం దుకాణాలన్నీ కూడా చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి. ఎమ్మార్పీ ధరలను యథేచ్చగా ఉల్లంఘించడంతో పాటు దాదాపు ప్రతీ వైన్స్‌ను బార్లలా మార్చేశారు. కేవలం పర్మిట్ రూమ్ ఉన్న వైన్స్‌ల్లో మాత్రమే మద్యం తాగేందుకు అనుమతించాల్సి ఉండగా.. ఈ విషయంలోనూ నిబంధనలకు పాతరేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రధాన వైన్స్‌లో పరిశీలిస్తే బార్‌ను తలపిస్తుండడం ఇందుకు నిదర్శంగా చెప్పొచ్చు. ఈ వైన్స్‌లో రెండు, మూడు గదులు ఏర్పాటు చేసి టేబుళ్లు, కుర్చీలతో అచ్చం బార్‌ను తలపిస్తుంది. అంతేకాదు మ ద్యం దుకాణాల్లో గ్లాసులు, తినుబండారాలు అమ్మొద్దనే నిబంధనను ఏ యజ మాని పట్టించుకోకున్నా అధికారులు వదిలేస్తుండడం గమనార్హం. కల్లు లైసెన్సుల విషయంలో పండుగే... గీత కార్మికులు చెట్ల నుంచి కల్లు తీసి అ మ్ముకునేందుకు జారీ చేసే లైసెన్సుల విషయంలో ఎక్సైజ్ సిబ్బంది పండుగ చేసుకుంటారనే విమర్శలున్నాయి. టీఎఫ్టీ(ట్రీ ఫర్ ట్యాపర్–చెట్టు నుంచి కల్లు తీసి నేరుగా అమ్ముకోవడం), ట్యాపర్ కోఆపరేటివ్ సొసైటీ(టీసీఎస్ – కనీసం 15 నుంచి 50 మంది వరకు సభ్యులుగా ఏర్పడి ఒక సొసైటీ ద్వారా కల్లు అమ్ముకోవడం)ల లైసెన్సుల జారీ విషయంలో ఎక్సైజ్ సిబ్బంది భారీ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. టీసీఎస్, టీఎఫ్‌టీల లైసెన్సుల విషయంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. అందుకే ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. మామూళ్లపై ఆరా.. పాలమూరు ప్రాంతంలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 25 మంది సీఐలు, 29 మంది ఎస్సైలు, 61 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 215 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొద్ది మంది ప్రతీనెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మద్యం దుకాణాలు, బార్‌షాపులు, కల్లు సొసైటీలు, దుకాణాల ద్వారా ప్రతీనెలా డబ్బులు దండుకుంటు న్నట్లు ఆధారాలతో సహా సేకరించారు. అంతేకాదు మద్యం దుకాణాల రింగ్ లీడర్ల డైరీల ద్వారా ఎవరెవరికి ఎంతెంత మామూళ్లు అందుతున్నాయనే వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. భారీగా అక్రమాలకు పాల్పడుతున్న కొద్దిమందిపై మొదటగా వేటు వేయాలని ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జాబితా రూపొం దించారనే ప్రచారం సాగుతోంది. -
కూచిపూడికి కాసుల్లేవట
విశాఖపట్నం : కూచిపూడి నృత్యానికి పూర్వ వైభవం తీసుకువస్తాం.. ప్రతి ఇంటి నుంచి ఓ కూచిపూడి నృత్య కళాకారుడిని తయారు చేయాలి.. కూచిపూడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలు ఉత్తి కోతలనేదానికి ఈ ఘటనే ఉదాహరణ. దళిత విద్యార్ధుల నుంచి కూచిపూడి డ్యాన్స్ పేరిట అధికారులు ఇండెంట్లు పెట్టి వసూళ్లు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా.. రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని ఐక్యరాజ్య సమితి విశ్వ విజ్ఞాన దినోత్సవంగా పాటించాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్రం ఆయన 125వ జయంతిని ఏడాది పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఆ వేడుకల ముగింపుతో పాటు 126వ జయంతి ఉత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఈ నెల 11న విశాఖ సాగర తీరంలో ఒకేసారి ఏడువేల మంది విద్యార్థినులతో రికార్డు స్థాయిలో కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించాలని అధికారులు నిర్ణయించారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థినులతో ఈ ప్రదర్శన ఏర్పాటుచేయాలని సన్నాహాలు చేపట్టారు. సీఎం చంద్రబాబునాయుడు కూడా హాజరవుతారని చెబుతూ వస్తున్న ఈ కార్యక్రమానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 11 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉండగా, అందులో ఆరు స్కూళ్ల నుంచి 2276 మంది విద్యార్ధినులను నృత్య రూపకానికి ఎంపిక చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నృత్య ప్రదర్శనకు విద్యార్థినులకు అవసరమైన దుస్తులు, అలంకరణ సామగ్రి మాత్రం... ఎవరికి వారే తెచ్చుకోవాలని విద్యార్థినుల నెత్తిన భారం మోపడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అలంకరణ సామాగ్రికి ఒక్కో విద్యార్థినికి రూ.600 నుంచి రూ. 1000 వరకు ఖర్చవుతుందని, ప్రస్తుతానికి తమ వద్ద అంత బడ్జెట్ లేనందున ఎవరికి వారు తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. లేనిపక్షంలో ఒక్కొక్కరు రూ.600 ఇస్తే తామే సమకూరుస్తామని చెబుతూ వచ్చారు. ఈ మేరకు కొన్ని గురుకులాల్లో విద్యార్థినుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే విషయం ఆ నోటా ఈనోటా పడి బయటకు పొక్కింది. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి పేరుతో స్వయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొనే దళిత విద్యార్ధినులకు అవసరమైన సామాగ్రిని కూడా అందించలేని స్థితిలో పాలకులు ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వసూలు చేసిన మొత్తాన్ని తిరిగిచ్చే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. మొదట్లో నిజమే.. ఇప్పుడు లేదు మొదట్లో తెలియక కొన్ని హాస్టళ్లలో విద్యార్థినుల నుంచి డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు లేదని రెసిడెన్షియల్ స్కూళ్ల జిల్లా కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ చెప్పారు. కూచిపూడి నృత్య ప్రదర్శన నిమిత్తం ఒక్కో హాస్టల్‌కు ప్రభుత్వం ఇటీవలే మూడున్నర లక్షల రూపాయలను గ్రాంట్‌గా విడుదల చేసిందని బుధవారం సాక్షి ప్రతినిధికి వెల్ల డించారు. ఆర్కే బీచ్‌లో కూచిపూడి నృత్య ప్రదర్శనను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నామని.. అతి పెద్ద కూచిపూడి ప్రదర్శనగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయించాలన్నది తమ ప్రయత్నమని ఆయన వివరించారు. -
పింఛన్ల పేరిట వసూళ్లకు యత్నం : నిందితుడికి దేహశుద్ధి
కోల్‌సిటీ : రామగుండం నగరపాలకసంస్థ పరిధిలో ఆసరా పింఛన్లు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ఇళ్లలోకి చొరబడి డబ్బులు వసూలు చేస్తున్న వైనం మంగళవారం వెలుగుచూసింది. డివిజన్ కార్పొరేటర్ వడ్లూరి రవి, బాధితుల కథనం ప్రకారం... ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన బొమ్మిదేని వేణుగోపాల్ అనే యువకుడితోపాటు మరో యువకుడు కలిసి 7వ డివిజన్లోని ప్రశాంత్‌నగర్‌కు వచ్చారు. మద్యం తాగి ఉన్న వీరు పింఛన్లు మంజూరు చేయిస్తామని ఇంటింటికీ తిరిగారు. ఐదారు ఇళ్లలోకి వెళ్లి తమకు కొంత ముట్టజెబితే పింఛన్ మంజూరయ్యేలా చూస్తామని చెప్పారు. స్థానికులు అనుమానంతో వారిని పట్టుకునేందుకు యత్నించగా.. వేణుగోపాల్ చిక్కాడు. స్థానికులతోపాటు కార్పొరేటర్ రవి అతడిని చెట్టుకు కట్టేసి విచారించగా, పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
లాటరీ పేరుతో మోసం
దహెగాం : లక్కీ డ్రాపేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటన దహెగాం మండలంలోని కేస్లాపూర్లో వెలుగుచూసిది. స్కీం నిర్వాహకుల చేతిలో మోసపోయినట్లు గ్రహించిన కేస్లాపూర్ గ్రామస్తులు పలువురు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం... మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన పాషా కొద్దిరోజుల క్రితం లక్కీ స్కీం నిర్వహించాడు. పలు గ్రామాల్లో ఏజెంట్లను నియమించాడు. ప్రతీ వారం రూ.100 వంతున 20 వారాలు చెల్లించాలని, వారవారం నిర్వహించే డ్రాలో మోటార్‌సైకిల్, రిఫ్రిజిరేటర్, ఎల్సీడీ టీవీ లాంటి విలువైన బహుమతులు అందజేస్తామని చెప్పాడు. సుమారు 2 వేల మందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. 20 వారాలు వాయిదా కట్టినా ఎలాంటి వస్తువులు అందజేయకపోవడంతో డబ్బులు చెల్లించిన వారు స్కీం నిర్వాహకుడితోపాటు ఏజెంట్లను పలుమార్లు అడిగారు. అడిగిన ప్రతిసారీ ఇవ్వాళ, రేపు అంటూ కాలం వెల్లదీస్తుండడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేస్లాపూర్‌కు చెందిన బొడ్డు రాంచందర్, చునార్కర్ మల్లయ్య, తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై పోలీసులను సంప్రదించగా.. తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొనడం గమనార్హం.