కోల్‌సిటీ : రామగుండం నగరపాలకసంస్థ పరిధిలో ఆసరా పింఛన్లు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ఇళ్లలోకి చొరబడి డబ్బులు వసూలు చేస్తున్న వైనం మంగళవారం వెలుగుచూసింది. డివిజన్ కార్పొరేటర్ వడ్లూరి రవి, బాధితుల కథనం ప్రకారం... ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన బొమ్మిదేని వేణుగోపాల్ అనే యువకుడితోపాటు మరో యువకుడు కలిసి 7వ డివిజన్‌లోని ప్రశాంత్‌నగర్‌కు వచ్చారు. మద్యం తాగి ఉన్న వీరు పింఛన్లు మంజూరు చేయిస్తామని ఇంటింటికీ తిరిగారు. ఐదారు ఇళ్లలోకి వెళ్లి తమకు కొంత ముట్టజెబితే పింఛన్ మంజూరయ్యేలా చూస్తామని చెప్పారు. స్థానికులు అనుమానంతో వారిని పట్టుకునేందుకు యత్నించగా.. వేణుగోపాల్ చిక్కాడు. స్థానికులతోపాటు కార్పొరేటర్ రవి అతడిని చెట్టుకు కట్టేసి విచారించగా, పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.