ఆబ్కారీలోనూ ఆమ్యామ్యాలు? | Excise Department There Is Heavy Bribes | Sakshi
Sakshi News home page

ఆబ్కారీలోనూ ఆమ్యామ్యాలు?

Published Thu, Jun 14 2018 10:45 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

 Excise Department There Is Heavy Bribes - Sakshi

మహబూబ్‌నగర్‌లోని ఓ వైన్స్‌ వెనకాల షెడ్‌లో మద్యం సేవిస్తున్న దృశ్యం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  ప్రతీ పనికి మామూళ్ల వసూళ్లకు తెగబడిన పోలీసు సిబ్బంది జాబితాను ఇటీవల డీజీపీ విడుదల చేశారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితయే. జాబితాలో పేర్లు ఉన్న సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతుండగా.. మరో పక్క ఎక్సెజ్‌ శాఖలోనూ జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. నెలనెలా మామూళ్లకు అలవాటు పడిన ఎక్సైజ్‌ సిబ్బంది వివరాలను స్టేషన్ల వారీగా ఆ శాఖ డైరెక్టర్‌ అకున్‌సబర్వాల్‌ నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్నట్లు సమాచారం. ఆ జాబితాలోని కొందరు సిబ్బందిపై రెండు, మూడు రోజుల్లో వేటు పడొచ్చనే ప్రచారం శాఖలో సాగుతోంది.


మొదటి నుంచి అపవాదు..
ఎక్సైజ్‌ శాఖలోని పై స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మామూళ్లు వసూలు చేయడానికి అలవాటు పడ్డారనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. భారీగా వసూళ్లకు పాల్పడుతూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నారనే విమర్శలున్నాయి. మద్యం దుకాణాలకు పర్మిట్‌ రూమ్‌లతో మొదలుకొని కల్లు దుకాణాలకు లైసెన్స్‌ రెన్యూవల్, కొత్త దుకాణాల అనుమతుల విషయంలో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎక్సైజ్‌ శాఖ ప్రక్షాళనలో భాగంగా కొందరు సిబ్బంది చర్యలు తీసుకోవాలని భావిస్తూ డైరెక్టర్‌ జాబితా తెప్పించుకున్నట్లు సమాచారం.


నిబంధనలు తూచ్‌..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాదారులు రింగ్‌గా ఏర్పడి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నెలనెలా మామూళ్లకు అలవాటుపడిన ఎక్సైజ్‌ సిబ్బందికి గంప గుత్తగా వస్తున్న డబ్బు వస్తుండడంతో నిబంధనలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మద్యం దుకాణాలన్నీ కూడా చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి. ఎమ్మార్పీ ధరలను యథేచ్చగా ఉల్లంఘించడంతో పాటు దాదాపు ప్రతీ వైన్స్‌ను బార్లలా మార్చేశారు. కేవలం పర్మిట్‌ రూమ్‌ ఉన్న వైన్స్‌ల్లో మాత్రమే మద్యం తాగేందుకు అనుమతించాల్సి ఉండగా.. ఈ విషయంలోనూ నిబంధనలకు పాతరేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఒక ప్రధాన వైన్స్‌లో పరిశీలిస్తే బార్‌ను తలపిస్తుండడం ఇందుకు నిదర్శంగా చెప్పొచ్చు. ఈ వైన్స్‌లో రెండు, మూడు గదులు ఏర్పాటు చేసి టేబుళ్లు, కుర్చీలతో అచ్చం బార్‌ను తలపిస్తుంది. అంతేకాదు మ ద్యం దుకాణాల్లో గ్లాసులు, తినుబండారాలు అమ్మొద్దనే నిబంధనను ఏ యజ మాని పట్టించుకోకున్నా అధికారులు వదిలేస్తుండడం గమనార్హం.


కల్లు లైసెన్సుల విషయంలో పండుగే...
గీత కార్మికులు చెట్ల నుంచి కల్లు తీసి అ మ్ముకునేందుకు జారీ చేసే లైసెన్సుల విషయంలో ఎక్సైజ్‌ సిబ్బంది పండుగ చేసుకుంటారనే విమర్శలున్నాయి. టీఎఫ్‌టీ(ట్రీ ఫర్‌ ట్యాపర్‌–చెట్టు నుంచి కల్లు తీసి నేరుగా అమ్ముకోవడం), ట్యాపర్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(టీసీఎస్‌ – కనీసం 15 నుంచి 50 మంది వరకు సభ్యులుగా ఏర్పడి ఒక సొసైటీ ద్వారా కల్లు అమ్ముకోవడం)ల లైసెన్సుల జారీ విషయంలో ఎక్సైజ్‌ సిబ్బంది భారీ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. టీసీఎస్, టీఎఫ్‌టీల లైసెన్సుల విషయంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. అందుకే ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.


మామూళ్లపై ఆరా..
పాలమూరు ప్రాంతంలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 25 మంది సీఐలు, 29 మంది ఎస్సైలు, 61 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 215 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొద్ది మంది ప్రతీనెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మద్యం దుకాణాలు, బార్‌షాపులు, కల్లు సొసైటీలు, దుకాణాల ద్వారా ప్రతీనెలా డబ్బులు దండుకుంటు న్నట్లు ఆధారాలతో సహా సేకరించారు. అంతేకాదు మద్యం దుకాణాల రింగ్‌ లీడర్ల డైరీల ద్వారా ఎవరెవరికి ఎంతెంత మామూళ్లు అందుతున్నాయనే వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. భారీగా అక్రమాలకు పాల్పడుతున్న కొద్దిమందిపై మొదటగా వేటు వేయాలని ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జాబితా రూపొం దించారనే ప్రచారం సాగుతోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement