ఖమ్మం క్రైం: ఎక్సైజ్ కొత్త పాలసీ విధానం ఇంకా ప్రకటించక పోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. వైన్‌షాపుల లెసైన్స్ గడువు జూన్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త షాపులకు లెసైన్స్ ఇచ్చేందుకు అనుసరించాల్సిన అంశాలపై ఎక్సైజ్ అధికారులకు ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ కారణంగా గడువు ముగిసేలోపు చేయాల్సిన పనులు ఏ విధంగా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది. అలాగే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపారు. షాపుల లెసైన్స్‌లు రెన్యువల్ చేసే సమయంలో ఆ షాపులను పరిగణలోకి తీసుకోవాలా..? వద్దా..? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే జిల్లా ఉన్నతాధికారులు మాత్రం కిందిస్థాయి సిబ్బందిని పూర్తి వివరాలను అందజేయాలని ఆదేశించారు.
ఏయే ప్రాంతాల్లో ఎంతెంత అమ్మకాలు జరుగుతున్నాయనే పూర్తి వివరాలను కమిషనర్ కోరినట్లు తెలిసింది. సీమాంధ్రలో కలుస్తున్న తొమ్మిది వైన్‌షాపులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ షాపులను తెలంగాణ రాష్ట్రంలో కలపాలా... ఆంధ్రా రాష్ట్రంలో ఉంచాలా అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించకపోవడంతో అధికారులు దానికి సంబంధించి ప్రత్యేక నివేదికను తయారు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 153 వైన్‌షాపులు, 44 బార్ అండ్ రెస్టారెంట్‌లు, మూడు క్లబ్‌లకు సంబంధించి లెసైన్స్‌లను పాత విధానంతోనే అమలు చేస్తారా... లేక కొత్త రాష్ట్రంలో కొత్త విధానాలు రూపొందిస్తారో... వేచి చూడాల్సి ఉంది.
నేడు వైన్‌షాపుల యజమానులతో కమిషనర్ సమావేశం
రాష్ట్రంలో లెసైన్స్ విధానంపై శనివారం హైదరాబాద్‌లో జిల్లా వైన్‌షాపుల యజమానులతో కమిషనర్ నదీం అహ్మద్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మద్యం పాలసీ విధానం అమలు తీరు గురించి చర్చించనున్నట్లు తెలిసింది. వరుస ఎన్నికల నేపథ్యంలో షాపు యజమానులకు కొంత నష్టం జరగడంతో.. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించి షాపు యజ మానులతో మాట్లాడేందుకు హైదరాబాద్‌కు పిలిపించినట్లు వైన్‌షాపు యజమానులు తెలిపారు.
కొత్త పాలసీ ఏంటో..?
Published Sat, Jun 14 2014 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
Advertisement
Advertisement