ఆ ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదట! | NO Money in ATMs | Sakshi
Sakshi News home page

ఆ ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదట!

Published Tue, May 31 2016 8:55 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

ఆ ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదట!

ఆ ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదట!

అతనో ప్రైవేటు ఎంప్లాయి. పేరు నరేష్. వ్యక్తిగత పని నిమిత్తం బయటకు బయలుదేరాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. దారిలో ఏటిఎంలో తీసుకుందాంలే అనుకున్నాడు. ఓ ఏటీఎంలోకి వెళ్లాడు. అందులో డబ్బుల్లేక ఖాళీ రశీదు వచ్చింది. దీంతో మరో ఏటీఎంకి వెళ్లాడు అదే పరిస్థితి. ఇంకో ఏటీఎం మెట్లెక్కాడు. ఫలితం లేదు. ఇది ఒక్క నరేష్ ఇబ్బందే కాదు. మనలో చాలామంది అవస్థ. ప్రస్తుతం జిల్లాలోని ఏటీఎంలలో నగదు కొరత తీవ్రంగా ఉంది.
 
 పాలకోడేరు : పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏటీఎంలలో డబ్బులు ఉండడం లేదు. ఎప్పుడు కార్డు పెట్టినా ఖాళీ రశీదులే వస్తున్నాయి. ఫలితంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో చేతిలో చిల్లిగవ్వ లేక సతమతమవుతున్నారు. జిల్లాలో మొత్తం అన్ని బ్యాంకుల ఏటీఎంలు కలిపి 500 వరకూ ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఇదే దుస్థితి నెలకొంది.
 
 ఏటీఎంలలో నగదు ఎలా పెడతారంటే..
 ఓ ప్రాంతంలోని బ్యాంకు మెయిన్ బ్రాంచి తన పరిధిలోని కొన్ని బ్రాంచీల ఏటీఎంలకు నగదు సరఫరా చేస్తుంది. ఈ ఏటీఎంలలో నగదు పెట్టేందుకు ఓ ప్రైవేటు ఏజెన్సీతో కాంట్రాక్టు కుదుర్చుకుంటుంది. ఆ ఏజెన్సీ సిబ్బంది బ్యాంకు నుంచి నగదు తీసుకెళ్లి ఆ ఏటీఎంలలో పెడుతుంటారు.
 
 బ్యాంకుల్లో డబ్బుల్లేవా !

 బ్యాంకుల్లో డబ్బుల్లేకపోవడమే ఏటీఎంలలో నగదు కొరతకు కారణంగా కనిపిస్తోంది. ఆర్‌బీఐ తాజాగా విధించిన నిబంధనల వల్ల బ్యాంకింగ్ లావాదేవీలపై ఖాతాదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా కార్యకలాపాలు మందగించాయి. దీనివల్ల బ్యాంకుల్లో డబ్బు రొటేషన్ కావడం లేదు. దీనికితోడు బ్యాంకులు ఇచ్చిన రుణాలూ రికవరీ కావడం లేదు. ఫలితంగా  నగదు కొరత తలెత్తింది. ఒక్కోసారి అసలు డబ్బుల్లేని దుస్థితి నెలకొంటోంది.
 
 ఆర్‌బీఐ నిబంధనలు ఇవీ..
 బ్యాంకుల్లో రూ. 50వేలు పైబడి లావాదేవీలు జరిపితే పాన్‌కార్డు నంబరు జతచేయాలి 
పాన్‌కార్డు లేకుంటే ఫారమ్-60ని పూర్తి చేసి సమర్పించాలి.
రూ.25వేలకు మించి డీడీ తీయాలంటే ఆ సొమ్మును ఖాతాలో వేసి ఆ తర్వాత డెబిట్ చేసుకుని డీడీ తీయాలి.
డిపాజిట్లపై వడ్డీ చెల్లింపుల విషయంలోనూ రూ. 10వేలు దాటితే పాన్ కార్డు నంబర్ ఇవ్వాలి.
రూ. 5వేలు మించి లావాదేవీలు జరపాలంటే ఎస్‌బీఐలో గ్రీన్‌కార్డు పొందాలి.  ఇలాంటి నిబంధనలతోపాటు బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఆదాయపుపన్ను శాఖ ఆరా తీస్తుందనే భయం వల్ల కూడా ఖాతాదారులు బ్యాంకింగ్ కార్యకలాపాలపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే బ్యాంకుల్లో తీవ్ర డబ్బు కొరత తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు.  
 
 నిబంధనలు సడలించాలని డిమాండ్
 ఆర్‌బీఐ విధించిన నిబంధనలు సడలించాలని ఖాతాదారులు కోరుతున్నారు. రూ. రెండు లక్షల లావాదేవీల వరకూ ఈ నిబంధనలను వర్తింపజేయరాదని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే బ్యాంకింగ్ కార్యకలాపాలు పుంజుకుంటాయని సూచిస్తున్నారు.
 
 ఏటీఎంలలో డబ్బులు ఉండడం లేదు
 ఏటీఎంల నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. అన్ని బ్యాంకులదీ ఇదే పరిస్థితి. వాటిల్లోకి వెళితే డబ్బులు రావడం లేదు. ఖాళీ రశీదులే వస్తున్నాయి. అదేమని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల కాలంలో తరుచూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది.  
  -  సోము కుసుమ గుప్త, శృంవృక్షం
 
 తంటాలు పడ్డాను
 పనిమీద పూలపల్లి వెళ్లాను. వాహనంలో పెట్రోల్ అయిపోయింది. ఏటీఎం కార్డు ఉందనే భరోసాతో ఉన్నా. తీరా ఏటీఎంలోకి వెళితే డబ్బులు లేక చాలా తంటాలు పడ్డాను. అప్పు చేయాల్సి వచ్చింది.
 -  మేడపాటి సాగర్, వీరవల్లిపాలెం, వీరవాసరం మండలం
 
 సమస్య మా దృష్టికి వచ్చింది  
 ఏటీఎం కేంద్రాల్లో డబ్బు కొరత సమస్య మా దృష్టికి వచ్చింది. బ్యాంకర్ల సమావేశంలో ఈ విషయంపై చర్చించా. ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలలో సమస్యను వెంటనే పరిష్కరిస్తాను. ఇతర బ్యాంకు ఏటీఎంలలో వచ్చేవారం నుంచి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తాను.  
 - సుబ్రహ్మణ్యేశ ్వరరావు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, ఏలూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement