నో పార్కింగ్‌.! | no parking | Sakshi
Sakshi News home page

నో పార్కింగ్‌.!

Published Sat, Jul 30 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

నందిమల్ల పుష్కరఘాట్‌ వద్ద గుర్తించిన పార్కింగ్‌స్థలాలు

నందిమల్ల పుష్కరఘాట్‌ వద్ద గుర్తించిన పార్కింగ్‌స్థలాలు

  • పుష్కరఘాట్‌లలో ప్రారంభంకాని పనులు
  • పుష్కరాలకు మరో 13 రోజులే గడువు
  • అనేక ఘాట్లకు వాహనాలు నిలిపేందుకు స్థలాలు గుర్తించని పరిస్థితి
  •  
     
    ప్రధాన ఘాట్ల వద్ద పార్కింగ్‌ స్థలాల విస్తీర్ణం (ఎకరాల్లో)
    బీచుపల్లి 320
    గొందిమళ్ల 100
    పస్పులలో 40
    పంచదేవులపాడు 30
    సోమశిల 10 (వీఐపీ), 40(సాధారణ)
    నదీ అగ్రహారం 25
     
    మొత్తం ఘాట్లు 52
    కేటాయించిన నిధులు : రూ.11.50కోట్లు
     నిధులు మంజూరైనవి :  9 ఘాట్లకు మాత్రమే
    కేటాయించిన స్థలం : 50 నుంచి 300 ఎకరాల వరకు
    (ఒక్కోఘాట్‌కు రద్దీని బట్టి)
    బాధ్యత తీసుకున్నశాఖలు : ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌   
     
    కృష్ణా పుష్కరాల ముహూర్తం దగ్గర పడుతోంది. పుష్కరఘాట్లకు జనం పోటెత్తనున్నారు. వారు వచ్చే వాహనాలను నిలుపుకునేందుకు ఏర్పాటుచేయాల్సిన పార్కింగ్‌ స్థలాల ఎంపిక నెమ్మదిగా సాగుతోంది. కొన్నిచోట్ల ఇప్పుడే పనులు ప్రారంభంకాగా, మరికొన్ని చోట్ల అయితే స్థలాల ఎంపికే పూర్తికాలేదు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో కేవలం 9 ప్రధాన ఘాట్లకు మాత్రమే పార్కింగ్‌ స్థలాలకు నిధులు మంజూరు కావడం గమనార్హం. మరో 37 ఘాట్లకు సంబంధించి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన వాటి మంజూరు మాత్రం ఇప్పటివరకు కాలేదు.
    – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌
     
     
    కృష్ణా పుష్కరాల ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఇంకా నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పార్కింగ్‌ వంటి పనులు చివరి నిమిషం వరకు పూర్తవుతాయో లేదోనన్న సందేహం తలెత్తుతోంది. జిల్లాలో 52పుష్కరఘాట్లను ఏర్పాటు చేసిన అధికారులు, భక్తుల రద్దీ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌ సదుపాయం కల్పించాలని సంకల్పించారు. అయితే పుష్కరాల ప్రారంభానికి 15రోజుల ముందే అన్ని శాఖల పనులు పూర్తి కావాలని అధికారులు పదేపదే చెబుతున్నా పార్కింగ్‌ స్థలాల ఎంపిక, టెండర్ల ప్రక్రియను ఆర్‌అండ్‌బీ శాఖ కొద్ది రోజుల క్రితమే ప్రారంభించింది. ఈ ప్రక్రియ గురువారం వరకు కొనసాగడంతో జిల్లాలో ఏ ప్రధాన పుష్కరఘాట్‌ వద్ద కాంట్రాక్టర్లు పార్కింగ్‌ స్థలాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేకపోయారు. ఇంకా కొన్ని పార్కింగ్‌ స్థలాలకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తయి, అగ్రిమెంట్‌ దశలో ఉండడంతో పుష్కరఘాట్ల వద్ద పార్కింగ్‌ నిర్మాణం ఊసే లేకుండాపోయింది.
     
    రద్దీని బట్టి స్థలాల ఎంపిక
    ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖలు పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్‌ చేసుకునేందుకు అనుగుణంగా ఆయా పుష్కరఘాట్ల రద్దీని బట్టి 50ఎకరాల నుంచి 300ఎకరాల వరకు పార్కింగ్‌ స్థలాలను ఎంపిక చేశాయి. స్థలాలను చదును చేయడం, రక్షణ వలయాలను ఏర్పాటు చేయడం, నిరంతర విద్యుత్‌ సరఫరా వంటి పనులు చేయాల్సి ఉన్నా, ఇంకా ఎక్కడా ఆ స్థాయిలో ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. పార్కింగ్‌ స్థలాల ఏర్పాటు కోసం ఆర్‌అండ్‌బీ శాఖ రూ.11.5కోట్లు వెచ్చించడానికి సిద్ధమై, పనులకు టెండర్లను పిలిచి ఖరారు చేసింది. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది ప్రధానఘాట్లకు మాత్రమే పార్కింగ్‌ స్థలాలకు నిధులు మంజూరయ్యాయి. మరో 37ఘాట్లకు సంబంధించి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా, వాటికి మంజూరు రాలేదు. 
     
    రెండు ఘాట్లలో పనులు ప్రారంభం 
    రాష్ట్రంలోనే ప్రధాన పుష్కరఘాట్‌ బీచుపల్లిలో 320ఎకరాల భూమిని పార్కింగ్‌ కోసం కేటాయించారు. ఇక్కడ పార్కింగ్‌ స్థలాలను ఏ, బీలుగా విభజించి టెండర్లను ఖరారు చేశారు. ఏ పార్కింగ్‌ను 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసేందుకు వీఎస్‌టీ కంపెనీ శుక్రవారం పనులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చే అవకాశం ఉన్న గొందిమళ్ల వీఐపీ ఘాట్‌ (జోగుళాంబ ఘాట్‌)లో పార్కింగ్‌ నిర్మాణ పనుల జాడే కనిపించడం లేదు. దాదాపు 100 ఎకరాల్లో ఇక్కడ వీఐపీ పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, పనులు ప్రారంభం కాలేదు. గద్వాల నది అగ్రహారంలో 25 ఎకరాల్లో పార్కింగ్‌ పనులు శుక్రవారమే ప్రారంభమయ్యాయి. ఆత్మకూర్‌లోని జూరాల వద్ద గల పుష్కరఘాట్‌ సమీపంలోని పార్కింగ్‌ స్థలాన్ని ఎంపిక చేసినప్పటికీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మక్తల్‌ మండలం పస్పులలో 40ఎకరాలు, పంచదేవులపాడులో 30 ఎకరాల్లో పార్కింగ్‌స్థలాన్ని కేటాయించగా ఎక్కడా పనులు ఊసే లేదు. అలాగే సోమశిలలో వీఐపీల కోసం 10ఎకరాలు, సాధారణ భక్తుల కోసం 40ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని టెండర్లు ఖరారు చేసినా నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోలేదు. పార్కింగ్‌ స్థలం మంజూరైన ప్రధాన ఘాట్లలోనే ఇలా ఉంటే.. ప్రతిపాదనలకే పరిమితమైన మిగిలిన ఘాట్ల పార్కింగ్‌ పరిస్థితి ఆయోమయంగా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement