alampur jogulamba temple
-
జోగుళాంబ సన్నిధిలో సుప్రీం న్యాయమూర్తి
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్, ఢిల్లీ హైకోర్టు జడ్జి రాజీవ్ షక్దీర్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పురేందర్‌కుమార్, చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈవో, చైర్మన్లు అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు. -
అలంపూర్ క్షేత్రానికి మహర్దశ: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అలంపూర్ జోగుళాంబ ఆలయాలకు మహర్దశ రానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ ఆదివారం హైదరాబాద్‌లోని దిల్కుషా అథితి గృహంలో మంత్రి కిషన్‌రెడ్డికి జోగుళాంబ దేవి రక్షా కంకణం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. అలంపూర్ జోగుళాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ మంజూరు చేసిందని చెప్పారు. అతి త్వరలోనే తాను కుటుంబ సమేతంగా జోగుళాంబ దేవిని దర్శించుకుంటానన్నారు. -
జల ప్రళయానికి పదేళ్లు
సాక్షి, అలంపూర్: కృష్ణా.. తుంగభద్ర నదీ తీర గ్రామాలవీ... జనమంతా ప్రశాంత జీవితం కొనసాగిస్తున్న ఆయా గ్రామాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోగా వరద ఉప్పెనలా ముంచుకొచ్చింది. ఇళ్లు, వాకిలి, వస్తువులు, పొలాలన్నీ జలమయమయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు నెల రోజుల పాటు ఆయా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో బయటపడ్డారు. రెండు నదులు కలిసి సుమారు 43 గ్రామాలపై ముప్పేట దాడి చేసిన ఈ జలప్రళయంలో వేలాది ఇళ్లు జలమయం కాగా.. లక్షకు పైగా ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అపార ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ జల ప్రళయ సంఘటనకు నేటికి సరిగ్గా పదేళ్లు అవుతుంది. అయినా.. ఆ వరదలను ఊహించుకుంటే ఇప్పటికీ బాధిత గ్రామాల ప్రజలు ఉలిక్కిపడతారు. పదేళ్ల క్రితం ముంచెత్తిన వరదల గురించి ఎవరిని అడిగినా కన్నీటిధారలే.. కోలుకునే వరకు పడ్డ ఇబ్బందులు.. పడ్డ కష్టం ఇలా ఎవరిని తట్టినా దీనగాథలే వినిపిస్తాయి. పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ ఎప్పుడు ఉగ్రరూపం దాలుస్తుంది? ప్రశాంతంగా ప్రవహిస్తోన్న తుంగభద్ర ఎప్పుడు పోటెత్తుతుందో అనే ఆందోళన ఇప్పటికీ ఆయా గ్రామాల ప్రజలను వెంటాడుతూనే ఉంది. కృష్ణా, తుంగభద్ర నదులు ఉమ్మడి జిల్లాలో సృష్టించిన ప్రళయంతో జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ, వడ్డేపల్లి, రాజోలి, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్, ఇటిక్యాల, గద్వాల పట్టణం, ధరూర్ మండలం నాగర్‌దొడ్డి, మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణ మండలంలోని 43 గ్రామాలు జలమయమయ్యాయి. పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆయా గ్రామాలకు వరదలు ముంచెత్తాయి. కోలుకోని పల్లెలు.. చేనేతకు పుట్టినిల్లుగా ఉన్న అలంపూర్, రాజోలి, మద్దూరు, కొర్విపాడు గ్రామాలు వరద ధాటికి కుదేలయ్యాయి. ఆయా గ్రామాల్లో పునరావాసం కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. మళ్లీ ఇళ్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న కొందరు పూరి గుడిసెలు.. బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు.అలంపూర్, వడ్డేపల్లి మండలంలోని రాజోలి, తుమ్మలపల్లి, పడమటి గార్లపాడు, తూర్పుగార్లపాడు, తుమ్మిళ్ల, నసనూరు, ఇటిక్యాల మండలంలోని ఆర్.గార్లపాడు, అయిజ మండలంలోని కూటక్కనూరు, మానవపాడు మండలంలోని మద్దూరు గ్రామాల్లో పునరావసం కల్పించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేవలం అయిజ మండలం కూట్కనూరు, ఇటిక్యాల మండలం ఆర్.గార్లపాడులో పునరావసం కల్పించారు. వడ్డేపల్లి మండలంలో పునరావసం అసంపూర్తిగా ఉండగా అలంపూర్, మద్దూరులో మాత్రం పునరావసం ఊసే లేదు. వడ్డేపల్లి మండలంలోని పడమటి గార్లపాడులో 69 మందికి, మానవపాడు మండలం మద్దూరు గ్రామంలో 500 మందికి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినా.. స్థలమే ఎంపిక చేయలేదు. అలంపూర్‌లోని ప్రధాన కాలనీలో ముంచెత్తిన వరద (ఫైల్) వడ్డేపల్లి మండలం రాజోలిలో వరద బాధితుల పునరావసం కోసం సేకరించిన 212 ఎకరాల్లో 3,048 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణాల కోసం ప్లాట్లుగా మార్చారు. 3,048 ఇండ్లను నిర్మించడానికి దశల వారీగా స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఇప్పటి వరకు 2,175 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయగా, 45ఇళ్ల వరకు ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. 500 ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. తూర్పుగార్లపాడులో169 ఇళ్లు, తుమిళ్ల గ్రామంలో 499, నసనూరులో సుమారు 290 ఇళ్ల నిర్మాణాలు కొలిక్కి రాలేదు. చేనేత కార్మికులకు ఇళ్లతో పాటు మగ్గాల కోసం అదనంగా షెడ్ల నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 750 మందికి షెడ్లు నిర్మించడానికి సన్నాహాలు చేశారు. కానీ ఇప్పటికే చేనేత మగ్గాల షెడ్లు మాత్రం నిర్మాణం జరగలేదు. ఊరు మొత్తం మునిగింది పదేళ్ల క్రితం వచ్చిన వరదలను తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తది. నాకు బాగా గుర్తు.. అప్పుడు నేను నా దోస్తులతో కలిసి బయటే ఉన్న.. వరద అప్పుడే మొదలైంది. అందరం చూస్తుండగానే ఊరు మొత్తం మునిగిపోయింది. ఊళ్లోకి నీళ్లొస్తున్నాయని అంతకు ముందు రోజు రాత్రి నుంచే గ్రామంలో మేమెవ్వరం కూడా నిద్రపోలేదు. ఉదయం 5 గంటలకు మెల్లగా నీరు ఊర్లోకి రావడం మొదలైంది. 9 గంటలకంతా ఊరు మొత్తం నీరు చేరుకుని చుట్టు ముట్టింది. అప్పటికే బియ్యం, కొంత సామాను బయటికి తెచ్చినం. మమ్మల్ని రోడ్డు మీద పడేసిన ఆ ఘటన తలుచుకుంటే కంట్లో నీళ్లు ఆగవు. – లింగన్ గౌడ్, తుమ్మిళ్ల, రాజోలి మండలం -
జోగుళాంబ అమ్మవారి నిజరూప దర్శనం
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగుళాంబ అమ్మవారు వసంత పంచమిని పురస్కరించుకుని ఆదివారం నిజరూప దర్శనమిచ్చారు. ఆలయంలో సహస్ర ఘటాలకు పూజలు చేసిన భక్తులు వాటిని శిరస్సున ధరించి అమ్మవారిని అభిషేకించారు. వందమందికి పైగా కాళాకారులు వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణలతో అమ్మవారి నమూనా విగ్రహాన్ని ఊరేగిస్తూ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహిళా భక్తులు ఏకరూప వస్త్రధారణతో కలశాలు శిరస్సున ధరించి భక్తిని చాటుకున్నారు. 5 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో చండీ హోమాలకు పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి మూల విరాట్‌ను పంచామతాలతో అభిషేకించారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, మాజీ మంత్రి డీకే.అరుణ, సికింద్రాబాద్ కోర్టు జడ్జి సునీత, అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి ఏ.రాధిక తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
ఆర్టీసీతో పాటు టీఎస్‌టీడీసీ ప్రత్యేకంగా బస్సుల ఏర్పాటు ఆగస్టు 12 నుంచి 23 వరకు సర్వీసులు మహబూబ్‌నగర్ క్రైం: కృష్ణా పుష్కరాల కోసం జిల్లా ఆర్టీసీతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. జిల్లా నలుమూలల నుంచి సంబంధిత డిపో కేంద్రాల పరిధిలో ప్రధాన బస్‌స్టేçÙన్ల నుంచి పుష్కరఘాట్లకు ప్రయాణికులను చేరవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 9డిపోల పరిధిలో మొత్తం 430బస్సులు నడుపుతున్నారు. ఆన్లైన్ బుకింగ్.. కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు మందస్తుగా తమ టికెట్లును ఆర్టీసీకి సంబంధించిన వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవడానికి వీలు కల్పించారు. పుష్కరాలకు కుటుంబసమేతంగా లేదా స్నేహితులు 36మంది మించితే ముందస్తుగా ప్రత్యేక బస్సు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం జిల్లాలోని ఆయా డిపోల మేనేజర్లను సంప్రదించాల్సి ఉంటుంది. పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సిద్ధం చేసింది. రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు నదీ తీరంలో పుణ్యస్నానాలాచరించేందుకు వస్తుంటారు. పుష్కరయాత్రికల కోసం టీఎస్‌టీడీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఆగస్టు 12నుంచి 23వరకు పుష్కరాల కోసం హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేకంగా 25బస్సులను నడుపనున్నట్లు ప్రకటించింది. మహబూబ్‌నగర్, అలంపూర్, సోమశిల, బీచుపల్లికి ప్రత్యేక సర్వీసులు నాన్ ఏసీ బస్సును ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి బీచుపల్లి పుష్కరఘాట్‌తో పాటు అలంపూర్ జోగులాంబ దేవాలయం దర్శనం కోసం ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఇందుకోసం టూర్ ప్యాకేజీలు పెట్టారు. హైదరాబాద్ టు బీచుపల్లి... హైదరాబాద్ నుంచి బీచుపల్లి, అలంపూర్ పర్యాటక ప్రాంతాలకు టీఎస్టీడీఎసీ ప్రత్యేక వోల్వో, ఏసీ, నాన్ ఏసీ బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరిన బస్సు మధ్యాహ్నం వరకు బీచుపల్లి ఘాట్‌కు చేరుకుంటుంది. అక్కడ పుష్కరస్నానం చేసిన తర్వాత భక్తులు స్థానిక ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అలంపూర్ జోగులాంబ దేవాలయానికి వెళ్లి అటు నుంచి తిరిగి రాత్రి హైదరాబాద్ చేరుకునే విధంగా ప్యాకేజీ తయారు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి సోమశిలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.700లుగా టికెట్ ధరను నిర్ణయించారు. -
నో పార్కింగ్.!
పుష్కరఘాట్లలో ప్రారంభంకాని పనులు పుష్కరాలకు మరో 13 రోజులే గడువు అనేక ఘాట్లకు వాహనాలు నిలిపేందుకు స్థలాలు గుర్తించని పరిస్థితి ప్రధాన ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాల విస్తీర్ణం (ఎకరాల్లో) బీచుపల్లి 320 గొందిమళ్ల 100 పస్పులలో 40 పంచదేవులపాడు 30 సోమశిల 10 (వీఐపీ), 40(సాధారణ) నదీ అగ్రహారం 25 మొత్తం ఘాట్లు 52 కేటాయించిన నిధులు : రూ.11.50కోట్లు నిధులు మంజూరైనవి : 9 ఘాట్లకు మాత్రమే కేటాయించిన స్థలం : 50 నుంచి 300 ఎకరాల వరకు (ఒక్కోఘాట్కు రద్దీని బట్టి) బాధ్యత తీసుకున్నశాఖలు : ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ కృష్ణా పుష్కరాల ముహూర్తం దగ్గర పడుతోంది. పుష్కరఘాట్లకు జనం పోటెత్తనున్నారు. వారు వచ్చే వాహనాలను నిలుపుకునేందుకు ఏర్పాటుచేయాల్సిన పార్కింగ్ స్థలాల ఎంపిక నెమ్మదిగా సాగుతోంది. కొన్నిచోట్ల ఇప్పుడే పనులు ప్రారంభంకాగా, మరికొన్ని చోట్ల అయితే స్థలాల ఎంపికే పూర్తికాలేదు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో కేవలం 9 ప్రధాన ఘాట్లకు మాత్రమే పార్కింగ్ స్థలాలకు నిధులు మంజూరు కావడం గమనార్హం. మరో 37 ఘాట్లకు సంబంధించి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన వాటి మంజూరు మాత్రం ఇప్పటివరకు కాలేదు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ కృష్ణా పుష్కరాల ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఇంకా నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పార్కింగ్ వంటి పనులు చివరి నిమిషం వరకు పూర్తవుతాయో లేదోనన్న సందేహం తలెత్తుతోంది. జిల్లాలో 52పుష్కరఘాట్లను ఏర్పాటు చేసిన అధికారులు, భక్తుల రద్దీ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించాలని సంకల్పించారు. అయితే పుష్కరాల ప్రారంభానికి 15రోజుల ముందే అన్ని శాఖల పనులు పూర్తి కావాలని అధికారులు పదేపదే చెబుతున్నా పార్కింగ్ స్థలాల ఎంపిక, టెండర్ల ప్రక్రియను ఆర్అండ్బీ శాఖ కొద్ది రోజుల క్రితమే ప్రారంభించింది. ఈ ప్రక్రియ గురువారం వరకు కొనసాగడంతో జిల్లాలో ఏ ప్రధాన పుష్కరఘాట్ వద్ద కాంట్రాక్టర్లు పార్కింగ్ స్థలాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేకపోయారు. ఇంకా కొన్ని పార్కింగ్ స్థలాలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయి, అగ్రిమెంట్ దశలో ఉండడంతో పుష్కరఘాట్ల వద్ద పార్కింగ్ నిర్మాణం ఊసే లేకుండాపోయింది. రద్దీని బట్టి స్థలాల ఎంపిక ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు అనుగుణంగా ఆయా పుష్కరఘాట్ల రద్దీని బట్టి 50ఎకరాల నుంచి 300ఎకరాల వరకు పార్కింగ్ స్థలాలను ఎంపిక చేశాయి. స్థలాలను చదును చేయడం, రక్షణ వలయాలను ఏర్పాటు చేయడం, నిరంతర విద్యుత్ సరఫరా వంటి పనులు చేయాల్సి ఉన్నా, ఇంకా ఎక్కడా ఆ స్థాయిలో ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. పార్కింగ్ స్థలాల ఏర్పాటు కోసం ఆర్అండ్బీ శాఖ రూ.11.5కోట్లు వెచ్చించడానికి సిద్ధమై, పనులకు టెండర్లను పిలిచి ఖరారు చేసింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది ప్రధానఘాట్లకు మాత్రమే పార్కింగ్ స్థలాలకు నిధులు మంజూరయ్యాయి. మరో 37ఘాట్లకు సంబంధించి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా, వాటికి మంజూరు రాలేదు. రెండు ఘాట్లలో పనులు ప్రారంభం రాష్ట్రంలోనే ప్రధాన పుష్కరఘాట్ బీచుపల్లిలో 320ఎకరాల భూమిని పార్కింగ్ కోసం కేటాయించారు. ఇక్కడ పార్కింగ్ స్థలాలను ఏ, బీలుగా విభజించి టెండర్లను ఖరారు చేశారు. ఏ పార్కింగ్‌ను 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసేందుకు వీఎస్టీ కంపెనీ శుక్రవారం పనులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్న గొందిమళ్ల వీఐపీ ఘాట్ (జోగుళాంబ ఘాట్)లో పార్కింగ్ నిర్మాణ పనుల జాడే కనిపించడం లేదు. దాదాపు 100 ఎకరాల్లో ఇక్కడ వీఐపీ పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, పనులు ప్రారంభం కాలేదు. గద్వాల నది అగ్రహారంలో 25 ఎకరాల్లో పార్కింగ్ పనులు శుక్రవారమే ప్రారంభమయ్యాయి. ఆత్మకూర్‌లోని జూరాల వద్ద గల పుష్కరఘాట్ సమీపంలోని పార్కింగ్ స్థలాన్ని ఎంపిక చేసినప్పటికీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మక్తల్ మండలం పస్పులలో 40ఎకరాలు, పంచదేవులపాడులో 30 ఎకరాల్లో పార్కింగ్స్థలాన్ని కేటాయించగా ఎక్కడా పనులు ఊసే లేదు. అలాగే సోమశిలలో వీఐపీల కోసం 10ఎకరాలు, సాధారణ భక్తుల కోసం 40ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయాలని టెండర్లు ఖరారు చేసినా నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోలేదు. పార్కింగ్ స్థలం మంజూరైన ప్రధాన ఘాట్లలోనే ఇలా ఉంటే.. ప్రతిపాదనలకే పరిమితమైన మిగిలిన ఘాట్ల పార్కింగ్ పరిస్థితి ఆయోమయంగా ఉంది. -
సిద్ధమవుతోంది..!
కొలిక్కి వస్తున్న వీఐపీ ఘాట్ నిర్మాణం నిర్మాణంలోనే రెండో ఘాట్ నత్తనడకన రోడ్డు నిర్మాణాలు అలంపూర్: కృష్ణా పుష్కరాల కోసం నిర్మిస్తున్న వీఐపీ ఘాట్ పనులు కొలిక్కి వస్తున్నాయి. అలంపూర్ క్షేత్రానికి అతి సమీపంలోని గొందిమల్లలో వీఐపీలకు, సాధారణ భక్తుల కోసం ఘాట్ నిర్మాణాలు చేపడుతున్నారు. నదిలో నీటి ప్రవాహాల అంచనాలకు అనుగుణంగా రెండు ఘాట్లను నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఒక ఘాట్ నిర్మాణాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. కానీ నీటి ప్రవాహం పెరిగినా పుష్కర స్నానాలు చేయడానికి వీలుగా నిర్మిస్తున్న రెండోఘాట్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. పుష్కరాలకు కేవలం 14రోజుల గడువు మాత్రమే ఉండటంతో పనుల హడావుడి పెరిగింది. రెండేసి ఘాట్ల నిర్మాణం.. గొందిమల్లలో నీటి నిల్వల హెచ్చు తగ్గులను దృష్టిలో ఉంచుకుని రెండు ఘాట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకటి లో–లెవల్ ఘాట్ మరొకటి హై–లెవల్ ఘాట్లను రూ.3.17 కోట్లతో వ్యయంతో నిర్మిస్తున్నారు. లోలెవల్ ఘాట్ నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ పుష్కర స్నానాలు ఆచరించడానికి వీలుగా నిర్మిస్తున్నారు. 30మీటర్ల వెడల్పు, 90 మీటర్ల పొడవుతో దీని నిర్మాణం జరుగుతోంది. దాదాపుగా ఘాట్ పనులు పూర్తి చేసి, ఘాట్‌కు రంగు బిల్లలు వేసే పనులు కొనసాగుతున్నాయి. అయితే నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉంటే ఘాట్‌కు దాదాపు 30మీటర్ల దూరంలో నీళ్లు ప్రవహిస్తాయి. ఇటీవల ఘాట్ పరిశీలనకు వచ్చిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు ఈ విషయమై చర్చించారు. నీళ్లు ఘాట్‌కు దూరంగా ఉంటంతో మరో 20అడుగుల ఘాట్‌ను నదిలో నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం పెరగడంతో అదనంగా పెంచాల్సిన ఘాట్ పనులపై సందిగ్ధం నెలకొంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా నీటి నిల్వలు పెరిగితే ప్రస్తుతం నిర్మిస్తున్న ఘాట్ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయంగా హైలెవల్ ఘాట్‌ను నిర్మిస్తున్నారు. లోలెవల్ ఘాట్ ఎత్తు నుంచి ఈ ఘాట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. జోగుళాంబ ఘాట్‌గా నామకరణం.. అలంపూర్ క్షేత్రానికి అతీ సమీపంలో గొందిమల్లలో నిర్మిస్తున్న ఘాట్‌కు జోగుళాంబ పేరుతో పిలవనున్నారు. ఇటీవల పుష్కరఘాట్ల సందర్శనకు వచ్చిన కలెక్టర్ టీకే శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘాట్‌లో పుష్కరస్నానాలు ఆచరించే భక్తులు నేరుగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వస్వామి క్షేత్రాన్ని సందర్శించుకునే అవకాశం ఉంది. దీంతో ఈ ఘాట్‌కు జోగుళాంబ ఘాట్‌గా నామకరణం చేశారు. యాత్రికులు ఒక మార్గంలో వచ్చి రెండో మార్గంలో వెళ్లడానికి వీలుగా ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇతర సదుపాయాలపైనే ఆయా శాఖలు పనుల్లో నిమగ్నమయ్యాయి. -
30లోగా పుష్కర పనులు పూర్తి
– వీఐపీ ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్ టీకే శ్రీదేవి – ప్రత్యేక టీంలతో పుష్కర పనుల పర్యవేక్షణ – వాటర్ లెవల్స్‌కు తగ్గట్టుగా ఏ, బీ ప్రణాళికలు అలంపూర్: కృష్ణా పుష్కర పనులు ఈ నెల 30లోగా పూర్తవుతాయని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. అలంపూర్ మండలపరిధిలోని గొందిమల్లలో కృష్ణానది తీరంలో నిర్మిస్తున్న వీఐపీ పుష్కరఘాట్‌ను ఆమె బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక్కడ నిర్మిస్తున్న లోలెవల్, హైలెవల్స్ పుష్కర పనుల పురోగతి, నాణ్యత, పిండ ప్రదానాల స్థలం, పార్కింగ్, బట్టలు మార్చుకునే గదులు, పారిశుద్ధ్యం వంటి అంశాలను అధికారులతో చర్చించారు. ముందుగా నదితీరంలో నిర్మించిన లోలెవల్ ఘాట్‌ను సందర్శించారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 30మీ.వెడల్పు, 90మీ.పొడవుతో నిర్మించిఘాట్లో 10మీ. వెడల్పులో బారీకేడ్ ఏర్పాటు చేసి వీఐపీలకు కేటాయించాలని, మిగిలిన 20మీటర్ల వెడల్పులో సాధారణ భక్తులు పుష్కరస్నానాలు చేసే విధంగా చేయాలన్నారు. వీఐపీలకు, సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహాలను బట్టి ముందస్తుగా ప్లాన్ ‘ఏ’ ప్లాన్ ‘బీ’లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. నదిలో నీళ్లు అధికంగా వస్తే లోలెవల్ ప్లాట్‌ఫామ్ మునిగితే ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్న హైలెవల్ ఘాట్లలోనూ ఇవే ఏర్పాట్లు చేయాలన్నారు. హెలిప్యాడ్ సైతం రెండు ఘాట్లకు అనుగుణంగా ఒకటి మాత్రమే నిర్మించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గొందిమల్ల ఘాట్‌కు జోగుళాంబ పేరు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి పుష్కరాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఐదో శక్తిపీఠం జోగుళాంబ ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి గొందిమల్ల కృష్ణానది తీరంలో ఘాట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఘాట్‌కు జోగుళాంబఘాట్గా పిలువనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక టీంలతో పుష్కరపనులను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి దాదాపు అన్నీ పనులు పూర్తి కావస్తాయని.. మిగిలిన ఒకటి రెండు పనులు పుష్కర సమయానికి పూర్తి చేస్తామన్నారు. నది హారతి హరిద్వారలో గంగానదికి తరహాలోనే కృష్ణానదికి పుష్కరాలకు హారతి ఇచ్చేందుకు దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఘాట్లను అందంగా తీర్చిదిద్దడం, విగ్రహాల ఏర్పాటుతో పాటు ఘాట్ల వద్ద, అలంపూర్ ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పుష్కర సమయం తెల్లవారుజామున 3.40గంటలకు వస్తున్నట్లు దేవాదాయ శాఖ ఏసీ కృష్ణ కలెక్టర్‌కు వివరించారు. షాద్‌నగర్ నుంచి ట్రాఫిక్ నియంత్రణ జిల్లాలో 179 కి.మీ.కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కృష్ణానది పరివాహకం ఉన్న ప్రతి మండలంలో పుష్కరస్నానాలు ఆచరించడానికి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మనరాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా 27పెద్ద ఘాట్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఘాట్ల వద్ద ఉన్న రద్దీ ఆధారంగా షాద్‌నగర్ నుంచే ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఘాట్ల వద్ద రద్దీ సమాచారం ఎఫ్ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు తెలిసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఘాట్ల వివరాలు తెలిసే విధంగా హోర్డింగ్‌లు ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. రోడ్డు పనులపై ఆగ్రహం పుష్కరాలకు కేవలం 21రోజులే ఉన్నా అలంపూర్–అలంపూర్ చౌరస్తా మధ్య కొనసాగుతున్న డబుల్‌రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై ఎస్ఈలతో చర్చించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలంపూర్, గొందిమల్ల గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే స్వచ్ఛభారత్‌తో గ్రామాలను శుభ్రం చేసుకోవాలని సూచించినా, ఎందుకు చేయలేదని డీపీఓను ప్రశ్నించారు. గ్రామాలను శుభ్రంగా ఉంచడం సర్పంచ్ల బాధ్యత అని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యపనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు ఏజేసీ బాలాజి రంజిత్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, డ్వామా పీడీ దామోదర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ రఘు, ఆర్అండ్బీ ఎస్ఈ విజయ్ కుమార్, డీఆర్డీఏ పీడీ మధుసుదన్‌నాయక్, ఎస్ఈ రఘునాథ్, డీపీఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అబ్దుల్ హామిద్, డీఎస్పీ బాలకోటి, తహసీల్దార్ మంజుల, ఎస్ఐ పర్వతాలు, జెడ్పీటీసీ సూర్యబాబు గౌడు, సర్పంచ్ సుజాత నాయుడు తదితరులున్నారు. జోగుళాంబ పేరు మార్మోగాలి అలంపూర్‌రూరల్: కృష్ణా పుష్కరాలలో ఐదో శక్తిపీఠం జోగుళాంబ ఆలయం పేరు నలుమూలల మార్మోగాలని కలెక్టర్ టీకే శ్రీదేవి పేర్కొన్నారు. బుధవారం ఆమె అలంపూర్ ఆలయాలను సందర్శించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పించిన వసతులు, చేస్తున్న ఏర్పాట్లపై దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ బి.కృష్ణ, ఆలయ కార్యనిర్వాహణాధికారి గురురాజను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ధ్వజస్తంభాలకు మెరుగులు దిద్దడం, రాజగోపురాలకు రంగులు, పరిసరాల్లో గ్రీనరీ, పరిశుభ్రత, తాత్కాలిక ఆర్చిగేట్లు వంటి పనులు చేపట్టినట్లు వారు కలెక్టర్‌కు వివరించారు. 12రోజుల పాటు భక్తులకు దర్శనం సందర్భంగా అసౌకర్యం కలగకుండా మాస్టర్‌ప్లాన్‌తో వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రచారం బాగా చేయాలి.. పుష్కరాలకు సమయం చాలా తక్కువగా ఉందని, వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. లడ్డూ, ప్రసాదాలు రుచిగా, శుచిగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. గొందిమల్ల ఘాట్‌లో పుష్కరస్నానం చేసేందుకు సీఎం కేసీఆర్ రానున్న సందర్భంగా దేవస్థానం నుంచి చేపడుతున్న పూజా కార్యక్రమాల ప్రణాళికను దేవాదాయ శాఖ ఏసీ కృష్ణ కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, స్థానిక సర్పంచ్ జయరాముడు, ఎంపీడీఓ మల్లికార్జున్, తహసీల్దార్ మంజుల, డీఎస్పీ బాలకోటి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పర్వతాలు, స్థానిక నాయకులు ఉన్నారు.