30లోగా పుష్కర పనులు పూర్తి | pushkaralu works completed in july 30 | Sakshi
Sakshi News home page

30లోగా పుష్కర పనులు పూర్తి

Published Wed, Jul 20 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

గొందిమల్ల ఘాట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ టీకే శ్రీదేవి

గొందిమల్ల ఘాట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ టీకే శ్రీదేవి

– వీఐపీ ఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్‌ టీకే శ్రీదేవి 
– ప్రత్యేక టీంలతో పుష్కర పనుల పర్యవేక్షణ 
– వాటర్‌ లెవల్స్‌కు తగ్గట్టుగా ఏ, బీ ప్రణాళికలు
 
అలంపూర్‌: కృష్ణా పుష్కర పనులు ఈ నెల 30లోగా పూర్తవుతాయని కలెక్టర్‌ టీకే శ్రీదేవి అన్నారు. అలంపూర్‌ మండలపరిధిలోని గొందిమల్లలో కృష్ణానది తీరంలో నిర్మిస్తున్న వీఐపీ పుష్కరఘాట్‌ను ఆమె బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక్కడ నిర్మిస్తున్న లోలెవల్, హైలెవల్స్‌ పుష్కర పనుల పురోగతి, నాణ్యత, పిండ ప్రదానాల స్థలం, పార్కింగ్, బట్టలు మార్చుకునే గదులు, పారిశుద్ధ్యం వంటి అంశాలను అధికారులతో చర్చించారు. ముందుగా నదితీరంలో నిర్మించిన లోలెవల్‌ ఘాట్‌ను సందర్శించారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 30మీ.వెడల్పు, 90మీ.పొడవుతో నిర్మించిఘాట్‌లో 10మీ. వెడల్పులో బారీకేడ్‌ ఏర్పాటు చేసి వీఐపీలకు కేటాయించాలని, మిగిలిన 20మీటర్ల వెడల్పులో సాధారణ భక్తులు పుష్కరస్నానాలు చేసే విధంగా చేయాలన్నారు. వీఐపీలకు, సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహాలను బట్టి ముందస్తుగా ప్లాన్‌ ‘ఏ’ ప్లాన్‌ ‘బీ’లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. నదిలో నీళ్లు అధికంగా వస్తే లోలెవల్‌ ప్లాట్‌ఫామ్‌ మునిగితే ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్న హైలెవల్‌ ఘాట్లలోనూ ఇవే ఏర్పాట్లు చేయాలన్నారు. హెలిప్యాడ్‌ సైతం రెండు ఘాట్‌లకు అనుగుణంగా ఒకటి మాత్రమే నిర్మించనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. 
 
గొందిమల్ల ఘాట్‌కు జోగుళాంబ పేరు
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి పుష్కరాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపడుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఐదో శక్తిపీఠం జోగుళాంబ ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి గొందిమల్ల కృష్ణానది తీరంలో ఘాట్‌ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఘాట్‌కు జోగుళాంబఘాట్‌గా పిలువనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక టీంలతో పుష్కరపనులను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి దాదాపు అన్నీ పనులు పూర్తి కావస్తాయని.. మిగిలిన ఒకటి రెండు పనులు పుష్కర సమయానికి పూర్తి చేస్తామన్నారు. 
 
నది హారతి 
హరిద్వారలో గంగానదికి తరహాలోనే కృష్ణానదికి పుష్కరాలకు హారతి ఇచ్చేందుకు దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఘాట్‌లను అందంగా తీర్చిదిద్దడం, విగ్రహాల ఏర్పాటుతో పాటు ఘాట్‌ల వద్ద, అలంపూర్‌ ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పుష్కర సమయం తెల్లవారుజామున 3.40గంటలకు వస్తున్నట్లు దేవాదాయ శాఖ ఏసీ కృష్ణ కలెక్టర్‌కు వివరించారు.  
 
షాద్‌నగర్‌ నుంచి ట్రాఫిక్‌ నియంత్రణ 
జిల్లాలో 179 కి.మీ.కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. కృష్ణానది పరివాహకం ఉన్న ప్రతి మండలంలో పుష్కరస్నానాలు ఆచరించడానికి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మనరాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా 27పెద్ద ఘాట్‌లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఘాట్‌ల వద్ద ఉన్న రద్దీ ఆధారంగా షాద్‌నగర్‌ నుంచే ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఘాట్‌ల వద్ద రద్దీ సమాచారం ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు తెలిసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఘాట్‌ల వివరాలు తెలిసే విధంగా హోర్డింగ్‌లు ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. 
 
రోడ్డు పనులపై ఆగ్రహం
పుష్కరాలకు కేవలం 21రోజులే ఉన్నా అలంపూర్‌–అలంపూర్‌ చౌరస్తా మధ్య కొనసాగుతున్న డబుల్‌రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై ఎస్‌ఈలతో చర్చించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలంపూర్, గొందిమల్ల గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే స్వచ్ఛభారత్‌తో గ్రామాలను శుభ్రం చేసుకోవాలని సూచించినా, ఎందుకు చేయలేదని డీపీఓను ప్రశ్నించారు. గ్రామాలను శుభ్రంగా ఉంచడం సర్పంచ్‌ల బాధ్యత అని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యపనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు ఏజేసీ బాలాజి రంజిత్‌ ప్రసాద్, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, డ్వామా పీడీ దామోదర్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ రఘు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయ్‌ కుమార్, డీఆర్‌డీఏ పీడీ మధుసుదన్‌నాయక్, ఎస్‌ఈ రఘునాథ్, డీపీఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అబ్దుల్‌ హామిద్, డీఎస్పీ బాలకోటి, తహసీల్దార్‌ మంజుల, ఎస్‌ఐ పర్వతాలు, జెడ్పీటీసీ సూర్యబాబు గౌడు, సర్పంచ్‌ సుజాత నాయుడు తదితరులున్నారు.  
 
జోగుళాంబ పేరు మార్మోగాలి
అలంపూర్‌రూరల్‌:  కృష్ణా పుష్కరాలలో ఐదో శక్తిపీఠం జోగుళాంబ ఆలయం పేరు నలుమూలల మార్మోగాలని కలెక్టర్‌ టీకే శ్రీదేవి పేర్కొన్నారు. బుధవారం ఆమె అలంపూర్‌ ఆలయాలను సందర్శించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పించిన వసతులు, చేస్తున్న ఏర్పాట్లపై దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ బి.కృష్ణ, ఆలయ కార్యనిర్వాహణాధికారి గురురాజను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ధ్వజస్తంభాలకు మెరుగులు దిద్దడం, రాజగోపురాలకు రంగులు, పరిసరాల్లో గ్రీనరీ, పరిశుభ్రత, తాత్కాలిక ఆర్చిగేట్లు వంటి పనులు చేపట్టినట్లు వారు కలెక్టర్‌కు వివరించారు. 12రోజుల పాటు భక్తులకు దర్శనం సందర్భంగా అసౌకర్యం కలగకుండా మాస్టర్‌ప్లాన్‌తో వ్యవహరించాలని కలెక్టర్‌ ఆదేశించారు.
 
ప్రచారం బాగా చేయాలి..
పుష్కరాలకు సమయం చాలా తక్కువగా ఉందని, వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. లడ్డూ, ప్రసాదాలు రుచిగా, శుచిగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. గొందిమల్ల ఘాట్‌లో పుష్కరస్నానం చేసేందుకు సీఎం కేసీఆర్‌ రానున్న సందర్భంగా దేవస్థానం నుంచి చేపడుతున్న పూజా కార్యక్రమాల ప్రణాళికను దేవాదాయ శాఖ ఏసీ కృష్ణ కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ వెంట డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అబ్దుల్‌ హమీద్, స్థానిక సర్పంచ్‌ జయరాముడు, ఎంపీడీఓ మల్లికార్జున్, తహసీల్దార్‌ మంజుల, డీఎస్పీ బాలకోటి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ పర్వతాలు, స్థానిక నాయకులు ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement