మాట్లాడుతున్న కలెక్టర్ టీకే శ్రీదేవి
-
సమష్టి కృషితో కృష్ణాపుష్కరాలు విజయవంతం
-
కలెక్టర్ టీకే శ్రీదేవి
మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాల విధులు నిర్వహించడం గొప్ప అనుభూతి అని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. పుష్కరాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా మంగళవారం స్థానిక అన్నపూర్ణ గార్డెన్స్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అభినందనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను స్వయంగా ఏర్పాట్లు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసిందని, మన జిల్లాలోనే సీఎం కేసీఆర్ పుణ్యస్నానం చేయడం సంతోషకరమన్నారు.
సమష్టి కృషి వల్ల పుష్కరాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కరఘాట్లలో తాగునీటి వసతి, పారిశుద్ధ్య పనుల్లో భాగంగా మరుగుదొడ్ల ఏర్పాట్లు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారని అభినందించారు. ఎక్కడ అపశృతి జరగకుండా పుష్కరాలను నిర్వహించినట్లు చెప్పారు. గ్రామస్థాయి అధికారి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేశారని కొనియాడారు. పుష్కరాల విధులు తన సర్వీస్‌లో గొప్పగా నిలిచిపోతాయని చెప్పారు. జిల్లాలో కోటి 86 లక్షల భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. జిల్లాలోని ప్రతిఘాట్‌ను అందంగా తీర్చిదిద్దామని, ఎక్కడ ఎలాంటి చిన్న తప్పు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు. అనంతరం పుష్కరవిధుల్లో పాల్గొన్న అధికారులకు ప్రశంసపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ పద్మనాభరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.