ఈ నెల పింఛన్ ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: ప్రతి నెలా ఒకటో తారీ ఖున పింఛన్లు అందుకునే లబ్ధిదారులు గత నెల పింఛన్ల కోసం 16వ తేదీ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ నెల కూడా వారికి ఎదురుచూపులు తప్పేలా లేవు. ఈ నెల ఒకటో తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలంటే.. గత నెల 20 లోపే బడ్జెట్ రిలీజ్ ఆర్డరు (బీఆర్వో)లను ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ, అక్టోబర్ 25న బీఆర్వోలు జారీ చేయడంతో నవంబరు 16 తరువాతే పింఛన్ల పంపి ణీ జరిగింది. అయితే డిసెంబర్ నెల పింఛన్లకు అధికారులు ఇప్పటికీ బీఆర్వోలు విడుదల చేయలేదు. దీంతో ఈ నెల పింఛన్లు ఇప్పట్లో వచ్చేలా లేవని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 లక్షల మంది పెన్షనర్లు పింఛన్ కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఎన్నికలు ఉన్న జిల్లాలకు...
గత నెల మొదటివారంలో వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో ఆసరా పింఛన్లను పంపిణీ చేసినట్లే.. ఈ నెలలో కూడా ఎన్నికలు ఉన్న మరి కొన్ని జిల్లాల్లో పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి నెలా పింఛన్లు పంపిణీ పూర్తయ్యాక, సమయానికి పింఛను తీసుకోని వారి సొమ్ము మిగులు తోంది. తాజాగా మిగిలిన సొమ్ము సుమారు రూ.160 కోట్లు సెర్ప్ వద్ద ఉన్నట్లు సమాచారం. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ, నారాయణ్‌ఖేడ్ ఉపఎన్నిక ఉన్నందున మెదక్ జిల్లాలోనూ పింఛన్ల పంపిణీలో మరింత జాప్యం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న సొమ్ముతో ఆయా జిల్లాల్లో పింఛన్ల పంపిణీ చేసేందుకు సర్కారు ఆదేశాల కోసం సెర్ప్ అధికారులు ఎదురుచూస్తున్నారు.
కొత్త పింఛన్లు మంజూరు
ఆసరా పింఛన్ల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న 21,970 మందికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా పింఛన్లు మంజూ రు చేసింది. అయితే.. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పింఛన్లను పంపిణీ చేసే అవకాశం లేదని సెర్ప్ అధికారులు అంటున్నారు.