మూన్నేళ్ల సంది పింఛన్ వస్తలే..
♦ ఓ వితంతువు ఆవేదన ..
♦ అర్థాకలితో పిల్లలు అలమటిస్తున్నారు
♦ అధికారుల నిర్లక్ష్యమే కారణం
మెదక్: చిన్నతనంలో భర్తను పోగొట్టుకున్న ఓ వితంతువుకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు నెలలుగా పింఛన్ రావడంలేదు. దీంతో ముగ్గురు పిల్లలతో పాటు తాను అర్థాకలితో అలమటిస్తున్నామని ఆమె కన్నీరు మున్నీరవుతోంది. మెదక్ మండలం హవేళిఘణాపూర్ గిరిజన తండాకు చెందిన లంబాడీ బూలి భర్త నాలుగేళ్ల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఆమెకు 2014 ఆగస్టు నుంచి పింఛన్ మంజూరైంది.
అయితే వస్తున్న పింఛన్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో అధికారులు గత మూడునెలలుగా ఇవ్వడం లేదు. బాధితురాలికి పదేళ్లలోపు ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులులేని బూలి పిల్లలతో ఓ చిన్నపాటి పూరిపాకలో నివాసముంటోంది. దొరికిన నాడు కూలిపని చేస్తూ పిల్లలకు బువ్వ పెడతానని లేనినాడు ఉపవాసముంటున్నామని విలపిస్తూ తెలిపింది. పింఛన్ బంద్ కావడంతో మూడు నెలలుగా నిత్యం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని బాధితురాలు అధికారులను వేడుకుంటోంది.