క్రమ‘బద్ధ’కంగా
-
నెలాఖరవుతో ముగుస్తున్న గడువు
-
జిల్లాలో అనధికార కట్టడాలు సుమారు 10,000
-
వచ్చిన దరఖాస్తులు 6,690
-
రెగ్యులైజేషన్‌లో తాత్సారం
-
క్రమబద్దీకరణ జరిగినవి కేవలం 929 మాత్రమే
-
పరిశీలనలో 5,757
మండపేట :
బీపీఎస్ రెగ్యులైజేషన్‌లో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది. వచ్చిన అరకొర దరఖాస్తుల క్రమబద్దీకరణ నత్తనడన సాగుతోంది. తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తయినవి కేవలం 13 శాతం మాత్రమే. నెలాఖరుతో భవనాల క్రమబద్ధీకరణ గడువు ముగియనుండగా నిర్ణీత లక్ష్యం చేరుకోవడం ప్రశ్నార్ధకంగా మారింది. బీపీఎస్‌కు జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల నుంచి 6,690 దరఖాస్తులు రాగా కేవలం 929 మాత్రమే క్రమబద్ధీకరించారు.
బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) ద్వారా పట్టణ ప్రాంతాల్లో 1985 జనవరి 1వ తేదీ నుంచి 2014 డిసెంబరు 31 మధ్యకాలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు గత ఏడాది మే నెల నుంచి డిసెంబరు నెలాఖరవు వరకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో దాదాపు 10 వేలు వరకు అనధికార కట్టడాలుండగా వీటి ద్వారా ఆయా స్థానిక సంస్థలకు సుమారు రూ.25 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా. నిర్ణీత గడువు ముగిసేనాటికి 6,690 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటి ద్వారా సుమారు రూ.8 కోట్లు ఆదాయం మాత్రమే సమకూరనుంది.
జాప్యం ఇలా...
మొదటి నుంచీ భవనాల క్రమబద్ధీకరణలో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది. జనవరి నుంచి రెగ్యులైజేషన్ చేపట్టారు. జూలై నెలాఖరు నాటికి భవనాల క్రమబద్ధీకరణకు గడువు ముగియగా పదిశాతం కూడా పూర్తికాకపోవడంతో మరో రెండు నెలలపాటు ప్రభుత్వం గడువు పెంచింది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండగా 77 శాతం దరఖాస్తులు ఇంకా ప్రోసెసింగ్‌లోనే ఉన్నాయి. మొత్తం 6,690 దరఖాస్తులు రాగా మంగళవారం నాటికి ఆన్‌లైన్ వివరాలు మేరకు రాజమండ్రి కార్పొరేషన్‌లో రెండు, అమలాపురంలో రెండు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన వాటిలో 929 దరఖాస్తులు పరిష్కరించగా మిగిలిన 5,757 దరఖాస్తులు ప్రోసెసింగ్‌లో ఉన్నాయి. క్రమబద్ధీకరణలో పెద్దాపురం మున్సిపాల్టీ ముందంజలో ఉండగా కాకినాడ, రాజమండ్రి నగర పాలక సంస్థలతోపాటు అమలాపురం, మండపేట తదితర పలు మున్సిపాల్టీల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్లాన్‌కు సంబంధించిన వివరాలు, యజమాని ఆధార్‌కార్డు, అటెస్టెడ్ దస్తావేజు కాపీలు తదితర వివరాలను ఆన్‌లైన్‌కు అప్‌లోడ్ చేయడంలో జాప్యం, దరఖాస్తుదారుల నుంచి పెనాల్టీ సొమ్ములు సకాలంలో వసూలు కాకపోవడం తదితర కారణాలతో క్రమబద్దీకరణ ఆశించిన స్థాయిలో జరగడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలాఖరవుతో గడువు ముగుస్తుండటంతో మిగిలిన దరఖాస్తులు ఏ మేరకు పరిష్కారమవుతాయనేది అనుమానాలకు తావిస్తోంది. గడువు ముగిసేనాటికి క్రమబద్ధీకరణ జరగకుంటే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధమమవుతోంది. ప్రోసెసింగ్‌లో ఉన్నందున చాలా వరకు క్రమబద్ధీకరణవుతాయని పట్టణ ప్రణాళికా విభాగం అధికారవర్గాలంటున్నాయి.
జిల్లాలోని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో వచ్చిన దరఖాస్తులు,
ఇప్పటి వరకు వాటి ప్రగతి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
పట్టణం వచ్చిన దరఖాస్తులు పరిష్కారమైనవి ప్రోసెసింగ్‌లో ఉన్నవి
కాకినాడ 2,077 157 1,920
రాజమండ్రి 2,923 507 2,414
అమలాపురం 392 13 377
మండపేట 302 12 290
పెద్దాపురం 203 99 104
పిఠాపురం 119 17 102
రామచంద్రపురం 37 1 39
సామర్లకోట 51 19 32
తుని 421 71 350
గొల్లప్రోలు 38 4 34
ముమ్మిడివరం 79 11 68
ఏలేశ్వరం 45 18 27