రోడ్డు ప్రమాదాలపై నిర్లక్ష్యం
► నివారణలు చేపట్టని అధికారులు
సింహాద్రిపురం: మండలంలో పలు ప్రాంతాలు రోడ్ల ప్రమాదాలకు చిరునామాగా మారుతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవడంలేదని వాహనదారులు విమర్శిస్తున్నారు. మండల పరిధిలోని టీటీడీ కళ్యాణ మండపం, నిడివెల్ల, ఆగ్రహారం, నక్కలపల్లె గ్రామాల వద్ద అధికంగా రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. రెండు వరుసల రోడ్డు కావడం.. వాహన చోధకులు అడ్డు అదుపు లేకుండా స్పీడ్ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ప్రమాదాల్లో 8మంది మృత్యువాత పడగా.. 10మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నానివారణకు ఆర్‌అండ్‌బీ అధికారులు, పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపట్ల వాహన చోదకులు విమర్శిస్తున్నారు. వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అపరాద రుసుం విధించి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడంలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించుకొని మండల ప్రజలు కోరుతున్నారు.
సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. : తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఆగ్రహారం వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించాలి. ---రవీంద్రనాథరెడ్డి(స్థానికుడు), ఆగ్రహారం
ప్రమాదాలు నివారిస్తాం.. : ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాల సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో అనేక సార్లు ట్రాఫిక్ విషయాలపై అవగాహన కల్పించాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ---హనుమంతు(ఎస్‌ఐ), సింహాద్రిపురం